అరెస్టు వివరాలను తెలియజేస్తున్న ఎస్పీ బాబూజీ అట్టాడ
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, అనేకట్ తాలూకా బంగ్లామేడు గ్రామానికి చెందిన అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబు అలియాస్ మురుగేషన్ బాబు చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే. మొదట చందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సేతు మాధవన్, మణియప్పన్‌లకు ప్రధాన అనుచరుడిగా ఎదిగాడు. ఇతను ప్రస్తుతం వేలూరు సమీపంలోని కాట్పాడిలో నివాసముంటున్నాడు. ఇతని స్వగ్రామం బంగ్లామేడు గ్రామం చుట్టు పక్కల ప్రాంతాల అడవుల్లో (జావాది హిల్స్) తన అనుచరులతో కలిసి చందనం చెట్లు నరికి వాటిని దుంగలుగా తయారు చేసేవాడు. 1990 నుంచి చందనం (శ్యాండిల్ వుడ్) అక్రమరవాణా చేస్తూ డబ్బును సంపాదించాడు.
1992 నుంచి 2000 సంవత్సరం వరకు ఆరు కేసులను తమిళనాడు రాష్ట్రం అటవీ, పోలీసు అధికారులు నమోదు చేశారు. చందనం అక్రమ రవాణా తర్వాత 2010 నుంచి తమిళనాడుకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్‌లతో సంబంధాలు ఏర్పరచుకుని అప్పటి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతను తమ ప్రాంతంలోని చెట్లు నరికే కూలీలకు భారీగా డబ్బు ఆశ చూపి వారి సహకారంతో రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల, అటవీ ప్రాంతాల నుంచి వాహనాలలో ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి చేరవేసి అక్కడి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేసేవాడు. ఇటీవల జిల్లాలో అరెస్టయిన సేతు మాధవన్, ఆర్కాట్ భాయ్‌ల విచారణలో అనేకట్ బాబు గుట్టు రట్టయింది. జిల్లాలో ఇతను 24 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2010 నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిసింది.
అనేకట్ బాబుతో పాటు మరో నలుగురు అరెస్ట్ : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబుతో పాటు, చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్, సత్య, హైదర్ ఆలీలు వృత్తి రీత్యా డ్రైవర్లుగా, అనేకట్ బాబుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అనేకట్ బాబు ఆదేశాల మేరకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం, నల్లమల, లంకమల, పాలకొండలు అటవీ ప్రాంతాల్లోకి వాహనాల్లో చేరవేస్తూ ఉంటారు. వీరిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన షేక్ మున్నా ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతను సుధాకర్, సత్యలకు అనుచరుడిగా ఉంటూ వారు చెప్పిన మేరకు ఎర్రచందనం నరికే వారిని బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి తన ఆటోలో తీసుకెళ్లి మైదుకూరు, పోరుమామిళ్ల అటవీ ప్రాంతాల సమీపంలో వదిలేవాడు. వారికి బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవాడు. ఇతనిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ నేతృత్వంలో పోలీసులు పక్కా వ్యూహంతో వీరిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment