నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్ | pseudo police in Nallamala Forest target lovers | Sakshi
Sakshi News home page

నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్

Published Tue, Jun 17 2014 8:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్

నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్

కర్నూలు : నల్లమల అభయారణ్యంలో నకిలీ పోలీసులు హల్‌చల్ సృష్టిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న మఫ్టీలో ఉన్న పోలీసుల్లా యాత్రికులను బెదిరించి దారిదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రేమికుల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. పోలీసుల పేరిట సాగుతున్న ఈ దందాతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మీడియా, పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి తమ గోడు వినిపిస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.
 
యువ జంటలే టార్గెట్
ఆదివారం అనంతపురం నుంచి ఓ కుటుంబం శ్రీశైలం వెళ్లేందుకు కారులో వచ్చింది. ఆత్మకూరు చేరుకున్న ఆ కుటుంబం సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్ స్మృతివనం చేరుకున్నారు. నకిలీ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును ఆపి లెసైన్స్, ఆర్‌సీ పుస్తకం అడిగారు.  లెసైన్స్, ఆర్‌సీ చూపినా.. రకరకాల ప్రశ్నలు వేసి తమ నుంచి రూ. 7 వేలు వసూలు చేసినట్లు ఆ కుటుంబ యజమాని వాపోయారు. నకిలీ పోలీసుల ఆగడాలను భరించలేక ఒకసారి వచ్చిన వారు తిరిగి ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఆసకి చూపడంలేదు. 

శ్రీశైలం, మహానంది క్షేత్రాల దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అధికశాతం ఆత్మకూరు సమీపంలోని వైఎస్సార్ స్మృతివనాన్ని సందర్శిస్తున్నారు. రోజూ వందలాది మంది వస్తుండటంతో కొందరు యువకులు పోలీసులమని చెప్పి  పథకం ప్రకారం దారిదోపిడీ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది యువకులు మూడు గ్రూపులుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నల్లమల మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కువ మంది మఫ్టీలోనే తిరుగుతుంటారు.

పోలీసుల కదలికలను గమనించిన కొందరు యువకులు మఫ్టీలో ఉన్న పోలీసుల మాదిరి వారి హావభావాలతో తిరుగుతూ హంగామా చేస్తున్నారు. వారం క్రితం హైదరాబాద్ నుంచి కొత్తగా వివాహం చేసుకున్న జంట వైఎస్సార్ స్మృతివనం చూసేందుకు వచ్చారు. గమనించిన నకిలీ పోలీసులు వారిని వెంబడించారు. వీరు సరదాగా గడిపిన దృశ్యాలను ఫొటోలు, వీడియో తీశారు. ఆ తర్వాత వాటిని చూపి బెదిరించే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ దారికి రాకపోవడంతో వీడియోలు యూటూబ్‌లో పెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక వారి వద్దనున్న బంగారు ఆభరణాలను తీసిచ్చి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ జంట హైదరాబాద్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. గతంలోనూ ఓ కళాశాలకు చెందిన కొందరు నల్లమల అందాలు చూసేందుకు వచ్చారు. వారి ఫొటోలను తీసి అల్లరి చేశారు. దీంతో వారు చేసేది లేక వారి వద్దనున్న సెల్‌పోన్లను, నగదు ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఒకటి కాదు.. అనేకం నల్లమల ప్రాంతంలో చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది.
 
అసాంఘిక కార్యకలాపాలకు నిలయం
నల్లమల అటవీ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. యాత్రికులుగా వస్తున్న యువతీ యువకులు కొందరు ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి నిజమైన యాత్రికులు, భక్తులు ఇటువైపు వచ్చేందుకు జంకుతున్నారు. వన్యప్రాణుల వేట సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. జింకలు, అడవి పందులను వేటాడి ఇక్కడే వంట చేసుకుని విందు చేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement