pseudo police
-
నకిలీ పోలీస్ అరెస్టు
హైదరాబాద్: ఆటో ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారం కిత్రం నింబోలిఅడ్డా ప్రాంతంలో యూనస్ అనే వ్యక్తి పోలీసునంటూ బెదిరిస్తూ ఆటోలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి రూ.1.80 లక్షలు దోచుకెళ్లాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా యూనస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ. 80 వేల నగదుతోపాటు ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ పోలీసుల ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. హయత్‌నగర్ సమీపంలో పోలీసులమంటూ నలుగురు వ్యక్తులు పలువురి వద్ద నగదు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో స్థానికులు వారిని పట్టుకుని... దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసులమంటూ దోపిడీ
♦ నలుగురు సూడో పోలీసుల అరెస్టు ♦ రూ.59 వేల నగదు,ఆటో, 9 సెల్ఫోన్లు స్వాధీనం సుల్తాన్‌బజార్ : సీసీఎస్ పోలీసులమని చెప్పి విద్యార్థులను చితకబాది.. వారి వద్ద డబ్బు, సెల్ఫోన్లు దోచుకున్న నలుగురు కేటుగాళ్లను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, రూ.59 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన ఈ.హనుమంతు, మీర్పేట్ తిరుమలహిల్స్‌కు చెందిన నల్ల భార్గవ్, గాయత్రినగర్‌కు చెందిన అశోక్ డిగ్రీ చదువుతున్నారు. ఈనెల 13న కాచిగూడ లింగంపల్లిలోని నృపతుంగ కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసిన వారు తమ ఐఫోన్ రిపేర్ చేయించుకొనేందుకు కోఠి గుజరాతి గల్లీలోని దేవి మొబైల్‌షాపునకు వచ్చారు. అదే సమయంలో నాంపల్లి అఫ్జల్‌సాగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్అలీ (28), ఫలక్‌నూమా కుర్మవాడికి చెందిన మహ్మద్ సోహిల్ అలీ(25), మల్లేపల్లికి చెందిన సయ్యద్ సాజిద్‌అలీ(32), హబీబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజార్(18) దేవీ మొబైల్‌షాప్‌కు వచ్చారు. తాము సీసీఎస్ పోలీసులమని విద్యార్థులపై దాడి చేశారు. వారిని కొట్టుకుంటూ ఆటో (ఏపీ 12 వి 8426)లో తీసుకెళ్లారు. భరత్ అనే విద్యార్థిని పాతబస్తీ సిటీకాలేజీ వద్ద విడిచి పెట్టారు. హనుమంతు వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు లాక్కొని అతడిని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో, అశోక్ వద్ద రూ.700లు లాక్కొని అతడిని రాజేంద్రనగర్‌లో విడిచిపెట్టారు. దోపిడీకి గురైన విద్యార్థులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుల్లో ఇద్దరు పాతనేరస్తులు ఉన్నట్లు నిర్థారణైంది. కాగా, నిందితులు గురువారం మరో దోపిడీ వేసేందుకు దారుస్సలాం వచ్చి టీ తాగుతూ పోలీసులకు చిక్కారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. జల్సాల కోసం పోలీసుల అవతారమెత్తి విద్యార్థులను దోచుకున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి 9 సెల్ఫోన్లు, ఆటో, రూ.59 వేలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్లు జి.శ్రీనివాస్, అంజయ్య, డీఐ కిశోర్‌బాబు పాల్గొన్నారు. -
నల్లమలలో నకిలీ పోలీసులు.. యువ జంటలే టార్గెట్
కర్నూలు : నల్లమల అభయారణ్యంలో నకిలీ పోలీసులు హల్చల్ సృష్టిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న మఫ్టీలో ఉన్న పోలీసుల్లా యాత్రికులను బెదిరించి దారిదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రేమికుల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. పోలీసుల పేరిట సాగుతున్న ఈ దందాతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మీడియా, పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి తమ గోడు వినిపిస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. యువ జంటలే టార్గెట్ ఆదివారం అనంతపురం నుంచి ఓ కుటుంబం శ్రీశైలం వెళ్లేందుకు కారులో వచ్చింది. ఆత్మకూరు చేరుకున్న ఆ కుటుంబం సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్ స్మృతివనం చేరుకున్నారు. నకిలీ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును ఆపి లెసైన్స్, ఆర్సీ పుస్తకం అడిగారు. లెసైన్స్, ఆర్సీ చూపినా.. రకరకాల ప్రశ్నలు వేసి తమ నుంచి రూ. 7 వేలు వసూలు చేసినట్లు ఆ కుటుంబ యజమాని వాపోయారు. నకిలీ పోలీసుల ఆగడాలను భరించలేక ఒకసారి వచ్చిన వారు తిరిగి ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఆసకి చూపడంలేదు. శ్రీశైలం, మహానంది క్షేత్రాల దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అధికశాతం ఆత్మకూరు సమీపంలోని వైఎస్సార్ స్మృతివనాన్ని సందర్శిస్తున్నారు. రోజూ వందలాది మంది వస్తుండటంతో కొందరు యువకులు పోలీసులమని చెప్పి పథకం ప్రకారం దారిదోపిడీ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది యువకులు మూడు గ్రూపులుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నల్లమల మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కువ మంది మఫ్టీలోనే తిరుగుతుంటారు. పోలీసుల కదలికలను గమనించిన కొందరు యువకులు మఫ్టీలో ఉన్న పోలీసుల మాదిరి వారి హావభావాలతో తిరుగుతూ హంగామా చేస్తున్నారు. వారం క్రితం హైదరాబాద్ నుంచి కొత్తగా వివాహం చేసుకున్న జంట వైఎస్సార్ స్మృతివనం చూసేందుకు వచ్చారు. గమనించిన నకిలీ పోలీసులు వారిని వెంబడించారు. వీరు సరదాగా గడిపిన దృశ్యాలను ఫొటోలు, వీడియో తీశారు. ఆ తర్వాత వాటిని చూపి బెదిరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దారికి రాకపోవడంతో వీడియోలు యూటూబ్‌లో పెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక వారి వద్దనున్న బంగారు ఆభరణాలను తీసిచ్చి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ జంట హైదరాబాద్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. గతంలోనూ ఓ కళాశాలకు చెందిన కొందరు నల్లమల అందాలు చూసేందుకు వచ్చారు. వారి ఫొటోలను తీసి అల్లరి చేశారు. దీంతో వారు చేసేది లేక వారి వద్దనున్న సెల్పోన్లను, నగదు ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఒకటి కాదు.. అనేకం నల్లమల ప్రాంతంలో చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయం నల్లమల అటవీ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. యాత్రికులుగా వస్తున్న యువతీ యువకులు కొందరు ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి నిజమైన యాత్రికులు, భక్తులు ఇటువైపు వచ్చేందుకు జంకుతున్నారు. వన్యప్రాణుల వేట సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. జింకలు, అడవి పందులను వేటాడి ఇక్కడే వంట చేసుకుని విందు చేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.