ప్రకృతి అందాలు, రమణీయ, కమనీయ దృశ్యాలకు నెలవైన నల్లమల అభయారణ్యం సరికొత్త సొబగులు దిద్దుకుంటోంది. రూ.కోటితో పర్యావరణ ప్రేమికులకు మరో కొత్త లోకాన్ని చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ టాప్ జీపుల్లో విహరిస్తూ సాగే జంగిల్ సఫారీ ఇకపై సరికొత్త అనుభూతులు నింపనుంది. తుమ్మలబైలు సమీపంలో రూపుదిద్దుకుంటున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో ఉట్టిపడుతున్న జీవకళ ప్రకృతిని ప్రేమించే మనసులను కట్టిపడేస్తోంది.
పెద్దదోర్నాల(ప్రకాశం): నల్లమల అభయారణ్యం.. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. అక్కడ సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే కలిగే ఆనందమే వేరు. నల్లమలలో ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న పర్యాటకులకు అటవీశాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. తాజాగా సుమారు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. వన్యప్రాణుల ఆకృతులతో కూడిన పర్యావరణ విజ్ఞాన కేంద్రంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు పగోడాలు, క్యాబిన్‌లో అధునాతనంగా రూపుదిద్దుకున్న టాయిలెట్లు, ఆరు బయట పచ్చిక బయళ్లతో ఆకట్టుకునే రీతిలో జంగిల్ సఫారీ ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఎకో టూరిజం పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేందుకు సరికొత్త వాటిని సిద్ధం చేస్తోంది.
శరవేగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పనులు...
జంగిల్ సఫారీలో భాగంగా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో పెద్దపులి, చిరుతపులి, జింకలు, కృష్ట జింక, నీల్‌గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలతో పాటు రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలి, ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్ఠించారు. ఆయా ఆకృతులకు సంబంధించి విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి ఆకృతి వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి గాండ్రింపుతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్‌లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వన్యప్రాణుల శిలాప్రతిమల్లో జీవకళ...
పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆకృతులు జవకళను సంతరించుకుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పులుల ప్రతిమలు చూస్తుంటే.. మన కళ్ల ముందే సజీవంగా ఉన్నాయన్న అనుభూతి కలుగుతోంది. సహజసిద్ధ వాతావరణంలో రాజసంగా నిలుచుని ఉండే పెద్దపులి ప్రతిమ సందర్శకులను కట్టిపడేసేలా ఉంది. చెట్టుపై కూర్చున్న చిరుతపులితో పాటు పెద్ద పులులను సైతం ఎదిరించే మొండితనం, ధైర్యం ఉన్న బుల్లి జీవి హనీబ్యాడ్జర్, ప్రపంచంలోని జింకలలో కెల్లా అత్యంత చిన్న జింకగా ప్రసిద్ధి గాంచిన మూషిక జింకలు సైతం జీవకళతో అబ్బురపరుస్తున్నాయి.
గడ్డి మైదానంలో కూర్చుని సేదతీరుతున్న కణితి, పర్యావరణ విజ్ఞాన కేంద్రం గోడలపై ఏర్పాటు చేసిన నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతుల ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. జంగిల్ సఫారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి సరస్సు, పచ్చిక బయళ్లు, చిన్నారులు కూర్చునేందుకు చెక్కతో తీర్చిదిద్దిన సీతాకోక చిలుక, తాబేలు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జంగిల్ సఫారీకి అధునాతన వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నెలవైన పులిచెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ముఖద్వారంతో పాటు 14 కిలోమీటర్లు జంగిల్ సఫారీ కొనసాగే రహదారిని అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలతో జంగిల్ సఫారీని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు గొప్ప అనుభూతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోటి రూపాయలతో పనులు
నల్లమల జంగిల్ సఫారీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వన్యప్రాణుల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాం. విద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జంగిల్ సఫారీ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఆద్యంతం పచ్చని పచ్చిక బయళ్లతో అందంగా తయారు చేస్తున్నాం. పులిచెరువు ముఖద్వారం ఆర్చిని ఆకర్షణీయంగా మారుస్తున్నాం. వన్యప్రాణుల ప్రతిమలు జీవకళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి.
– విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి
Comments
Please login to add a commentAdd a comment