నల్లమలలో తగ్గుతున్న పులుల సంఖ్య | tigers decreasing in nallamala forest | Sakshi
Sakshi News home page

నల్లమలలో తగ్గుతున్న పులుల సంఖ్య

Published Sat, Feb 3 2018 11:55 AM | Last Updated on Sat, Feb 3 2018 11:55 AM

tigers  decreasing in nallamala forest - Sakshi

ఒంగోలు క్రైం: నల్లమల అభయారణ్యం దట్టమైన వృక్ష సంపదకు ఆలవాలం. తిరుమల శేషాచలం కొండల నుంచి మొదలయ్యే అరణ్యం నల్లమలతో అనుసంధానం అయిఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎర్రచందనం మొదలు కొని ఎన్నో లక్షలాధి ఔషధ మొక్కలు, వృక్ష సంపద నల్లమల అభయారణ్యం సొంతం. వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకూ కొదువలేదు. ఇక అభయారణ్యానికి రాజసాన్నిచ్చే పెద్ద పులులు, చిరుతలకూ కొదువలేదు. పులులు ఉన్నాయంటేనే అభయారణ్యాల వృద్ధి వాటంతట అదే సొగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ ఫారెస్ట్‌ ఒకటిగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తరువాత అభయారణ్యం కాస్తా రెండుగా చీలిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు కొంత అటు తెలంగాణకు కొంత చీలిపోయింది.

ఏదేమైనా నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఏకైక పులుల సంరక్షణ కేంద్రం. అభయారణ్యంలో పులుల సంఖ్య ఏటికేడాదికి తరుగుతోంది. అందుకు వాటి సంరక్షణ చర్యల్లో లోపమే ప్రధాన కారణం. దానికి తోడు వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఏర్పడింది. వన్యప్రాణులను పులులను వేటాడి వాటి చర్మాలను ఇతరప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించారు. నాలుగేళ్ల క్రితం రెండు పులుల చర్మాలు ఒకే చోట లభించాయి. ఆ సంఘటన అటవీ శాఖాధికారులను విస్మయానికి గురిచేసింది.  గత ఏడాది శ్రీశైలం రూటులో బొమ్మలాపురం–దేవలూరు ప్రాంతంలో ఒక చిరుత పులిని వేటగాళ్లు మట్టుబెట్టారు. మరో చిరుత రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీ కొని మృత్యువాత పడింది. నల్లమలలో వన్యప్రాణుల గణన మొదటి విడత గణన జనవరి 28వ తేదీతో ముగిసింది.

నల్లమలలో తరుగుతున్న సంఖ్య..
దేశ వ్యాప్తంగా వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్లు్యఏఐఐ)నేషనల్‌ టైగర్‌  కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)లు సంయుక్తంగా వన్య ప్రాణుల గణన చేస్తుటాయి. అందులో ప్రధానమైనది పులుల గణన. పులుల గణన ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంటుందంటే.. పులులు ఉంటే అరణ్యాలు విస్తరిస్తాయి. జలపాతాలు, నదులు కోతకు గురికాకుండా ఉంటాయి. శాఖాహార వన్యప్రాణుల సంతతి పెరగకుండా చేస్తాయి. అరణ్యాలు తరిగిపోయి, శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే గ్రామాల మీదకు, పంటలను నాశనం చేయటం లాంటి ఎన్నో నష్టాలు లేకుండా చేస్తాయి.
 పులుల గణాంకాలను బట్టి చూస్తే గత ఎనిమిదేళ్లలో 27 పులుల తగ్గాయి. 2006 సంవత్సరంలో అభయారణ్యంలో 95 పులులు ఉన్నాయి.

 2010 గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 72కు పడిపోయాయి. 2014లో నిర్వహించిన గణాంకాల ప్రకారం వాటి సంఖ్య 68కి పడిపోయింది. నల్లమల అభయారణ్యంలో పులుల సంఖ్య తగ్గుతుంటే ఇతర అభయారణ్యాల్లో వాటి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే 2006లో 1,411 ఉంటే 2010లో వాటి సంఖ్య 295 పులులు పెరిగి 1,706కు చేరుకున్నాయి. 2014లో నిర్వహించిన పులుల సర్వేలో ఆశ్చర్యం కలిగించే గణాంకాలు వెలుగుచూశాయి. ఏకంగా నాలుగేళ్లలో 520 పులుల సంతానం పెరిగి అధికారుల  సైతం ఆశ్యర్యానికి గురిచేశాయి. అక్కడ చేపడుతున్న పులుల రక్షణ కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

చట్టాలు కఠినంగా ఉన్నా ఆగని మరణమృదంగం..                                       
వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలను కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా, వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు, అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే ఎన్నో రకాలుగా క్రిమినల్‌  కేసులు ఉంటాయి. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006–యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా సైతం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.  2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలాలు సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అయితే యింతటి కఠిన తరమైన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.  

మూగ జీవాలు వేటగాళ్ల వలలో..
అడవి అంటే ఒకప్పుడు భయం. అడవిలో స్వేచ్చగా, రాజసం ఉట్టిపడేలా తిరిగే పులులు అంటే మరీ భయపడే ఉండేవారు. వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అంతరించి పోతున్నాయి. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులుల వంటి వన్య ప్రాణులు కొందరు స్వార్ధపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు ఉండేవి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఇందులో భాగంగా గతంలో కొనేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు రంగం ప్రవేశం చేసిన సంఘటనలు జరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement