మూడు మండలాల్లో వేలాది ఎకరాలు మాయం
కబ్జాలో అటవీ, ప్రభుత్వ, శిఖం, సీలింగ్ భూములు
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు మాయమవుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్‌లోని రెండు మండలాల్లో వేల ఎకరాల అటవీ భూములను కాజేశారు. ప్రభుత్వ స్థలాలు, శిఖం, సీలింగ్ భూములను కూడా వదలడం లేదు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో కొందరు ప్రభుత్వ భూములను కాజేయగా.. మరికొందరు అక్రమంగా ధరణిలో పేర్లు నమోదు చేయించి.. సీలింగ్ భూములను సైతం కాజేశారు. భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.– సాక్షి ప్రతినిధి, నల్లగొండ
రాజకీయ పలుకుబడితో కబ్జాలు
కృష్ణపట్టె పరిధిలోకి వచ్చే మిర్యాలగూడ డివిజన్‌లోని దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవుల పల్లి మండలాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కొందరు ఈ దందాకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ కబ్జాల పర్వం కొనసాగగా, ఇ ప్పటికీ కబ్జాలు ఆగడం లేదు. కఠినంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి.
5వేల హెక్టార్లకు పైగా అడవి మాయం
ఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు 9వేల హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. అందులో దాదాపు 5వేల హెక్టార్లకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. అదే మండలంలోని వజీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో 855.69 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉండగా, అందులోనూ కబ్జాలు జరిగాయి. రాజగట్టు బ్లాక్ పరి«ధిలో 309.91 హెక్టార్ల భూమి ఉండగా, దానిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపు బాధి తులకు పునరావాసం కింద కేటాయించారు.
ఫార్మ్– డి పట్టాలు జారీ చేశారు. సాగునీటి సదుపాయం లేకపోవడంతో బాధితులు సాగు చేయకపోవడంతో అధికారులతో కుమ్మక్కైన కొందరు దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు తెలిసింది. వీర్లపాలెం బ్లాక్ పరిధిలో 2,389.72 హెక్టార్ల అటవీ భూమిలో దాదాపు 500 హెక్టార్ల భూమిని రాజకీయ పలుకు బడితో కొందరు ఆక్రమించుకున్నారు. దిలావర్‌పూర్ బ్లాక్ పరిధిలో 1,679.42 హెక్టార్ల అటవీ భూమి ఉండగా 200 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది.
మొల్కచర్ల బ్లాక్ పరిధిలో 2726.26 హెక్టార్ల భూమి ఉండగా 724.10 హెక్టార్ల భూమిని సాగర్ ముంపు బాధితులకు కేటాయించారు. ఆ భూములను కూడా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్లు కూడా వేసుకున్నట్లు తెలిసింది. కేజేఆర్ కాలనీ పరిధిలో దాదాపు వంద ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
దామరచర్ల మండలంలోనే 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో తప్పుడు పట్టాలను సృష్టించారు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో ఈభూములను కబ్జా చేయడం గమనార్హం. చట్ట విరుద్ధంగా ఇచ్చిన పట్టాలపై 2010లోనే ఆర్డీవో విచారణ జరిపి దొంగ పట్టాలను రద్దు చేశారు.
అవి రద్దయి 15 ఏళ్లు కావస్తున్నా.. నేటికీ భూములు కబ్జాదారుల అధీనంలోనే ఉన్నాయి. దామరచర్ల పీఏసీఎస్‌లో 12 మంది 18 నకిలీ పట్టాలను సృష్టించి రూ.కోట్లు రుణంగా పొందారు. ఉల్సాయిపాలెం పరిధిలోని 145 సర్వే నంబర్‌లోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో అధికారులు అక్రమంగా పట్టాలు జారీ చేశారు.
మిర్యాలగూడలోనూ భారీగా కబ్జాలు
మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామ రుద్రప్ప చెరువు 310 ఎకరాల్లో ఉండగా, అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ వద్ద 66, 67 సర్వే నంబర్లలో 3.22 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ప్రస్తుతం ఆ భూమి కబ్జాపై విచారణ కొనసాగుతోంది.
పట్టణ శివారు లోని చింతపల్లి, హైదలాపురంలో సర్వే నంబరు 5లో స్వాతంత్య్ర సమరయోధుల పేరిట సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు.నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై 626 సర్వే నంబరులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. పట్టణం నడి బొడ్డులోని పాత బస్టాండ్ ఎదురుగా రూ.కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిని నకిలీ దత్తత పత్రాలు సృష్టించి కాజేసినట్లు ఆరోపణలున్నాయి.
పట్టణంలోని బస్టాండ్ పక్కనే 4 గుంటల ప్రభుత్వ భూమిని బడా వ్యాపారి ఆక్రమించుకున్నట్లు ఆరోప ణలున్నాయి. అడవిదేవులపల్లి మండలంలో 900.04 హెక్టార్ల భూమి ఉండగా అందులో దాదాపు 600 హెక్టార్లు కబ్జాకు గురైనట్లు అధికారులు భావిస్తున్నా రు. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతి నిధుల అండదండలతో కొందరు ఆ భూముల్లో వరి, బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు.
తాత్కాలిక చర్యలతో ఆగని కబ్జాలు..
దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సమీపంలో తాళ్లవీరప్పగూడెం వద్ద 66వ సర్వే నంబరులో 15.08 ఎకరాలు, 67వ సర్వే నంబరులో 8.29 ఎకరాల భూమి జాబిశెట్టి శేషమ్మ పేరుతో ఉండగా 1997లో సీలింగ్ యాక్టు ప్రకారం పట్టాదారు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
అయితే ధరణిలో కొందరు ఆ భూములపై పట్టాలు పొందారు. అంబటి రామాంజనేయులు 6 ఎకరాలు, వింజం ముసలయ్య 5.29 ఎకరాలు, సాధినేని శ్రీనివాస్‌రావు 2.25 ఎకరాలు, రాయికింది దివ్య 3 ఎకరాలు, నాలావత్ కమిలి 3 ఎకరాలు, ఇండియా సిమెంట్స్ 1 ఎకరం పట్టా పొందారు.
ఈ పట్టాలను రద్దు చేసి, ఇటీవల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. మిర్యాలగూడ పట్టణ శివారు పందిళ్లపల్లి చెరువు 480 ఎకరాల్లో ఉంది. ఆ భూములను కబ్జా చేసేందుకు కొందరు కంచె నిర్మించగా అధికారులు దానిని తొలగించారు. అప్పుడప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నా కబ్జాలు మాత్రం ఆగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment