గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో జనవరి మూడున ప్రారంభమై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక థీమ్‌ను రూపొందించారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన పూల శిల్పాలు, కీర్తి స్తంభం, ఒలింపిక్ టార్చ్, గర్బా నృత్యం లాంటి అందమైన దృశ్యాలు సందర్శకులను సమ్మోహనపరుస్తున్నాయి. హల్క్, డోరేమాన్ తదితర కార్టూన్ పాత్రలను పూలతో తయారు చేశారు. ఇవి పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో సందర్శకులతో నిత్యం రద్దీగా ఉంటోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఫ్లవర్ షో(Flower Show) కోసం రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నైట్ ఫ్లవర్ పార్క్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో 54 లైటింగ్ డిస్‌ప్లేలు, జంతువుల బొమ్మలతో పాటు ఇతర ఇంటరాక్టివ్ ఫీచర్‌లున్నాయి. రాత్రిపూట ఈ పార్క్ ఎంతో సమ్మోహనంగా కనిపిస్తోంది.
నెల రోజుల పాటు జరిగే ఈ ఫ్లవర్ షో ఉద్దేశ్యం కేవలం వినోదమే కాకుండా పర్యావరణంపై అవగాహన కల్పించడం. పర్యావరణ విషయంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Ahmedabad Municipal Corporation) చూపుతున్న చొరవకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.
ఫ్లవర్ షోను ఈసారి ఆరు విభాగాలుగా మలచారు. పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు పూల మధ్య ఆటలాడుకోవచ్చు. ప్రతి పూల బొమ్మకు క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేసి, దానికి సంబంధించిన సమాచారాన్ని వినవచ్చు. ఈ సాంకేతికత సందర్శకులకు మంచి అనుభూతినిస్తుంది.
ఈ ప్రదర్శన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కూడా ఆకట్టుకుంటోంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసుగల పిల్లలకు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో ప్రదర్శనను తిలకించేందుకు చిన్నారులు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ ఫ్లవర్ షో అందరినీ అమితంగా ఆకట్టుకుంతోంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడం సందర్శకులకు ఒక మధురానుభూతిగా మిగులుతుందని నిర్వాహకులు అంటున్నారు.
అహ్మదాబాద్‌లోనే కాదు.. తమిళనాడులో కూడా ఫ్లవర్ షో జరుగుతోంది. చెన్నైలోని సెంమొళి పూంగాలో 4వ చెన్నై ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. లక్షలాది పూలతో అందాలను చిందిస్తున్న ఈ ప్రదర్శన జనవరి 11 వరకు కొనసాగనుంది.
అహ్మదాబాద్, చెన్నై(Chennai)లలో జరిగే ఈ ప్రదర్శనలు సందర్శకులకు కొత్త లోకాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతిపై ప్రేమను అందరిలో పెంపొందిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఫ్లవర్ షోలను తిలకించేందుకు పలువురు విదేశీయులు కూడా ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడి సుమనోహర దృశ్యాలను చూసి మైమరచిపోతుంటారు.
ఇది కూడా చదవండి: భారత్‌లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం
Comments
Please login to add a commentAdd a comment