మెట్రోకు విదేశీ తలుక్
- కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్ పట్టాలు
- అడుగడుగునా విదేశీ హంగులు
సాక్షి, సిటీ బ్యూరో: కొరియా కోచ్‌లు.. శ్యామ్‌సంగ్ హంగులు... ఫ్రాన్స్ పట్టాలు.. నగర మెట్రో ప్రాజెక్ట్‌లో ప్రతిదీ విశేషమే. అన్ని వర్గాల వారికీ మన మెట్రో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విదేశీ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ విదేశాల్లో పేరొందిన సంస్థ లు మెట్రో ప్రాజెక్ట్‌లో మేము సైతం అన్నట్టుగా కీలక పనులు చేపడుతున్నా యి. మరికొన్ని అవసరమైన విడి భాగాలను సరఫరా చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రముఖ సంస్థలు సాంకేతిక, డిజైనింగ్, సేవలు, నిర్మాణం, ప్రణాళిక, నిర్వహణ, కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో పాలు పంచుకుంటున్న దేశ విదేశాలకు చెందిన పేరెన్నికగన్న సంస్థల వివరాలివే..
కొరియా కోచ్‌లు
దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. ఇప్పటివరకు నాలుగు మెట్రో రైళ్లు ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. మరో మూడు త్వరలో కొరియా నుంచి నగరానికి చేరనున్నాయి. మొత్తంగా ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్‌కు 2017 నాటికి సుమారు 171 బోగీలు(57రైళ్లు-ఒక్కో రైలుకు 3 బోగీలు)ను దశల వారీగా సరఫరా చేయనుంది.
శ్యామ్‌సంగ్‌డేటా సిస్టమ్స్:
కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభా గాల తయారీ, సరఫరా, పరీక్షలను నిర్వహించనుంది.
పార్సన్స్ బ్రింకర్‌హాఫ్:
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఈ సంస్థ మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్ట్‌లకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్ట్‌లో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఇది 1885 నుంచి ఈ రంగంలో ఉంది. ఐదు ఖండాలలో సేవలందిస్తోంది.
కియోలిస్
ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజా రవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. మన మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది.
హాల్‌క్రో
ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్ ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.
ఎర్నెస్ట్ అండ్ యంగ్
పన్నులు, సేవలు, మేనేజ్‌మెంట్ విభాగాల్లో విలువైన సూచనలు, సలహాలు అందించడంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెట్రో ప్రాజెక్ట్‌లో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు సంస్థకు వచ్చే కార్భన్‌క్రెడిట్స్ (పర్యావరణ రాయితీలు)ను లెక్కగడుతుంది.
ఏఈకామ్
యూరప్‌కు చెందిన ఈ కంపెనీ సాంకేతిక, యాజ మాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ, ఇంధనం, మంచినీరు, మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్ట్‌కు సలహాలు అందిస్తోంది.
లూయిస్‌బెర్జర్
అమెరికాకు చెందిన ఈ సంస్థ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో మనకు సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో సేవలందిస్తోంది.
ఓటీఐఎస్
నగరంలోని ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది.
ఆర్థిక సహకారం ఇలా..
దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడుతున్న మెట్రో ప్రాజెక్ట్‌కు ఎల్‌అండ్‌టీ సంస్థ సుమారు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, సిండికేట్ బ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. భూసేకరణ, ఇతర వసతుల కల్పనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది.
ఫ్రాన్స్ పట్టాలు
ఆకాశమార్గం (ఎలివేటెడ్) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్ (ఫ్రాన్స్‌లోని విభాగం) సంస్థ సరఫరా చేస్తోంది. సముద్ర మార్గంలో మొదట ముంబయికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్, మియాపూర్ డిపోలకు చేరుకుంటున్నాయి. మొత్తం మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్ నుంచి 22,500 మెట్రిక్ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకోవడం విశేషం.