![Foreign Universities Will Be In Telangana Says Vinod Kumar - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/24/Vinod-Kumar.jpg.webp?itok=MyYXrpq7)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు విదేశీ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్‌లో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నూతన విద్యా విధానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లో జరిగిన విద్యా సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పేదలు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు యూనివర్సిటీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విదేశాల్లో చదువుకున్న తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి సొంత రాష్ట్రానికి సేవలు అందించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విదేశీ విద్యపై అవగాహన కల్పించేందుకు జిల్లాల్లో కూడా విద్యా సదస్సులు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సదస్సులో అమెరికా కాన్సులేట్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, కాబోయే అధ్యక్షుడు భువనేశ్ భుజాల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment