విదేశీ విద్యకు.. ‘అప్లై విజ్’
విద్యార్థులను, వర్సిటీలను కలిపే వేదిక
• ఏ ర్యాంకుకు ఏ యూనివర్సిటీలో సీటొస్తుందో తెలుసుకోవచ్చు...
• ప్రస్తుతానికి 4 దేశాల్లోని 1,000 వర్సీటీల సమాచారం
• త్వరలో నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు
• ‘స్టార్టప్ డైరీ’తో అప్లైవిజ్ ఫౌండర్ గాయం నర్సిరెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ వర్సిటీలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్స్, ఫీజులు వంటి వివరాలు ఒకేచోట పొందాలంటే కష్టమే. దీంతో చాలా మంది విద్యార్థులు అరకొర సమాచారంతోనే విదేశాల్లో అడుగుపెట్టడం.. కొన్ని సార్లు మోసాలకు గురికావటమూ జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగానే ‘అప్లైవిజ్’ను రూపొందించామన్నారు గాయం నర్సిరెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు విదేశీ యూనివర్సిటీల్లో అకడమిక్ అడ్మిషన్స్ కోలాహలం మొదలవుతుంది.
జనవరి– మార్చి మధ్య మూడు నెలలు ఎక్కడ చూసినా ఇదే చర్చ. జీఆర్‌ఈ, టోఫెల్‌లో ఎంత ర్యాంకు వచ్చింది? ఏ వర్సిటీలో సీటు వస్తుందో? అసలొస్తుందో రాదో? వస్తే ఎప్పుడు చేరాలి? ఫీజెంత? ఇలా రకరకాల సందేహాలు. విద్యార్థులకు గానీ, తల్లిదండ్రులకు గానీ పూర్తి సమాచారం తెలియట్లేదు. దీనికి పరిష్కారం చూపించేందుకే అప్లైవిజ్.కామ్ ఆరంభించాం. రూ.4 లక్షల పెట్టుబడితో మరో కో–ఫౌండర్ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి గతేడాది ఆగస్టులో ప్రారంభించాం.
ప్రవేశ పరీక్షల నుంచే మొదలు..
విదేశాల్లో చదువుకునేందుకు జీఆర్‌ఈ, జీమ్యాట్, శాట్, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ వంటి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏ వర్సీటీలు ఏ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? ఏ ర్యాంకు వస్తే ఏ వర్సిటీలో సీటొస్తుంది? ఫీజులెంత? వర్సిటీ మంచిదా? కాదా? దాని ర్యాంకెంత? వంటి సమాచారమంతా తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగానే. అయితే ముందుగా విద్యార్థులు తమ ప్రొఫైల్స్‌ను నమోదు చేసుకోవాలి. అలాగే విద్యార్థులు అందించే ఎస్‌ఓపీ/ఎస్‌సైలను కూడా కొనుగోలు చేయవచ్చు.
1,000 వర్సిటీల సమాచారం...
ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే దేశాల్లోని 1,000 వర్సీటీల సమాచారం అందుబాటులో ఉంది. మరో నెల రోజుల్లో కెనడా, సింగపూర్, జర్మనీ దేశాల్లోని వర్సిటీ సమాచారాన్ని కూడా పొందుపరుస్తాం. ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు అప్లైవిజ్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అప్లైవిజ్‌తో విద్యార్థులకు, వర్సిటీలకు ఇద్దరికీ లాభమే. వర్సిటీల సమాచార సేకరణకు విద్యార్థులు, విద్యార్థుల ప్రొఫైల్స్‌తో నేరుగా వారినే సంప్రదించటానికి వర్సిటీలు దీన్ని ఉపయోగిస్తున్నాయి.
త్వరలోనే దరఖాస్తు కూడా..
వర్సిటీల సమాచారంతో పాటూ విదేశీ విద్య, ఉద్యోగ సంబంధమైన వార్తలు, కథనాలను బ్లాగ్స్, ఫోరమ్స్‌లో అందిస్తున్నాం. ప్రస్తుతం ఆరుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే అప్లైవిజ్ ద్వారా నేరుగా కళాశాలలు, వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నాం. ప్రవేశ పరీక్షల మెటీరియల్‌ను కూడా విక్రయిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...