విదేశీ విద్య.. తప్పుల ముప్పు తప్పేదెట్లా
టాప్ స్టోరీ: ఉద్యోగ మార్కెట్‌లో ఫారెన్ డిగ్రీకి ఉన్న డిమాండ్.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. బ్యాంకులు సైతం సులువుగా రుణాలను మంజూరు చేస్తుండటం.. వంటి సానుకూల పరిస్థితుల కారణంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే హైదరాబాద్ విద్యార్థుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొన్ని పొరపాట్ల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. విదేశీ వర్సిటీకి మార్గాన్ని మూసేస్తున్న దరఖాస్తుల్లో పొరపాట్లపై ఫోకస్..
ఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే.. మూడింట రెండొంతుల మంది భారతీయ విద్యార్థుల విదేశీ వర్సిటీ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇదే ధోరణి హైదరాబాద్ విద్యార్థుల విషయంలోనూ కనిపిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాలు దరఖాస్తులను తిరస్కరించడానికి గల కారణాల్లో ముఖ్యమైనది దరఖాస్తు అసంపూర్తిగా ఉండటం, నిర్దేశించిన ధ్రువపత్రాలను దరఖాస్తుతోపాటు పంపకపోవడాన్ని విశ్వవిద్యాలయాలు తీవ్రంగా పరిగణించి, అలాంటి వాటిని తిరస్కరిస్తున్నాయి. అందువల్ల ఔత్సాహిక విద్యార్థులు విశ్వవిద్యాలయం పేర్కొన్న అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా దరఖాస్తుతోపాటు జతపరిచి పంపించాలి.
సమగ్రంగా మార్కుల చిట్టాలు
విశ్వవిద్యాలయాలకు అర్హతలకు సంబంధించి కేవలం డిగ్రీ సర్టిఫికెట్‌ను మాత్రమే కాకుండా.. సెమిస్టర్ల వారీగా మార్కుల ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాలి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మార్కుల పూర్తి వివరాలను పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు, పరపతి లేఖ
ధ్రువీకరణ పత్రాలతో పాటు తప్పనిసరిగా పంపించాల్సింది దరఖాస్తు ఫీజు. చాలామంది విద్యార్థులు చేస్తున్న మరో పొరపాటు పరపతి లేఖ(సాల్వెన్సీ లెటర్) పంపకపోవడం. విద్యార్థి పేరిట ఉన్న లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ బ్యాంకులు ఇచ్చే లేఖే పరపతి లేఖ. ఉపకార వేతనంతో విదేశీ యూనివర్సిటీలో చదివే అవకాశం వచ్చింది కాబట్టి, పరపతి లేఖను సమర్పించాల్సిన అవసరం లేదని విద్యార్థులు భావిస్తుంటారు. ఇది సరికాదు. విదేశాల్లో వంద శాతం స్కాలర్‌షిప్‌తో చదివే అవకాశం వచ్చినా, ఈ లేఖను తప్పనిసరిగా సమర్పించాల్సిందే. విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతంలో నివసించేందుకు, చదువుతున్న కాలంలో ఇతర ఖర్చులను విద్యార్థి భరించగలడనేదానికి కొల్లేటరల్ రుజువుగా పరపతి లేఖను విశ్వవిద్యాలయం పరిగణిస్తుంది.
విద్యా రుణాలు
చాలామంది విద్యార్థులు తమ విదేశీ విద్యకు అవసరమైన మొత్తం ఖర్చును బ్యాంకులు రుణాల రూపంలో ఇస్తాయని భావిస్తారు. కానీ, సాధారణంగా బ్యాంకులు చదువుకయ్యే మొత్తం ఖర్చులో 2/3 వంతు మొత్తాన్ని మాత్రమే రుణాలుగా ఇస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, దరఖాస్తు చేసుకోవాలి. విదేశాల్లో విద్యాభ్యాసానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆయా విశ్వవిద్యాలయాలు విద్యా రుణాలను కూడా ఇప్పిస్తాయేమో కనుక్కోవాలి. మంచి పేరున్న విశ్వవిద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్స్ కూడా లభిస్తాయి. అలాంటి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.
తక్కువ పదాల్లో, అర్థవంతంగా
విదేశాల్లోని చాలా యూనివర్సిటీలు దరఖాస్తుతో పాటు పర్సనల్ స్టేట్‌మెంట్లు లేదా కామన్ ఎస్సేలను తప్పనిసరి చేశాయి. విద్యార్థి సమర్పించే ఈ సాధారణ వ్యాసం ఆధారంగా విద్యార్థి స్థితిగతులను యూనివర్సిటీ ప్రవేశాల కౌన్సెలర్ అంచనా వేస్తారు. విద్యార్థికి వర్సిటీలో ప్రవేశం కల్పించవచ్చా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. విద్యార్థి ఈ వ్యాసం ద్వారా తనను తాను నిజాయితీగా ఆవిష్కరించుకోవాలి. చాలామంది విద్యార్థులు ఎస్సే నిడివి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని భావిస్తారు. ఇది తప్పు. భావయుక్తంగా, క్లుప్తంగా ఉంటే సరిపోతుంది.