ఐఐఎఫ్‌టి క్యాంపస్‌ను ప్రారంభిస్తున్న నిర్మలా సీతారామన్. చిత్రంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, రాష్ట్ర మంత్రులు బుగ్గన, అప్పలరాజు, కారుమూరి, ఎంపీలు గీత, బోస్, భరత్ తదితరులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. సముద్రతీర ప్రాంతంతో ఏపీ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా నిలిచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మెరైన్, రైస్, ఫ్రూట్స్ వంటి ఎగుమతుల్లో ద్విగుణీకృతమైన ప్రగతిని ఏపీ సాధిస్తోందని.. విదేశీ వాణిజ్యానికి అన్ని అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయని ఆమె కొనియాడారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మకమైన ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) మూడో క్యాంపస్‌ను శుక్రవారం కేంద్ర ఆర్థిక, వాణిజ్యశాఖా మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ ప్రారంభించారు.
చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థికవ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుంద న్నారు. విశాలమైన సముద్రతీరం ఉన్న ఏపీలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను అర్థంచేసుకుని, ఇక్కడి ఎగుమతిదారులు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకున్నారన్నారు. అదే ఈ రోజు విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందువరసలో నిలిపిం దని ఆమె ప్రశంసించారు.
రాష్ట్రంలో ఒక్కో జిల్లా ఒక్కో విశిష్ట ఉత్పత్తికి కేంద్రంగా ఉందన్నారు. ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా దేశ, విదేశాల్లో జరుగుతున్న వాణిజ్యాన్ని ఆకళింపు చేసుకుని వాటిపై పూర్తి పట్టు సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి చొరవతో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐటీ, ఐఐఎఫ్‌టీ, ఐఐటీ తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని సీతారామన్ వెల్లడించారు.
రాజకీయ సుస్థిరతతోనే ఆర్థిక శక్తిగా భారత్
మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో మరింతగా అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మానవ వనరులు అవసరమన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత, సమష్టి కృషి ఫలితంగానే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌టీ ఏర్పాటుతో కాకినాడ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు.
దేశీయ ఎగుమతుల్లో 5.8% (దాదాపు 16.8 బిలియన్ యూఎస్ డాలర్లు) ఏపీ నుంచి జరుగుతున్నాయన్నారు. గతంలో 20వ స్థానంలో ఉన్న ఈ ఎగుమతులు 2021 నాటికి 9వ స్థానానికి చేరుకున్నాయన్నారు. భారత్ ఆక్వాహబ్‌గా ఏపీ గుర్తింపు సాధించిందన్నారు. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, జీవీఎల్ నరసింహారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఐఐఎఫ్‌టీ వీసీ ప్రొ. మనోజ్‌పంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment