శాతవాహనయూనివర్సిటీ
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్‌డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్‌చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది.
ఇన్‌చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు నలుగురు
శాతవాహన యూనివర్సిటీకి కోమల్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్‌గా ఏ.వినాయక్‌రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
యూనివర్సిటీలో నుండే వస్తారా..?
వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్‌రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది.
ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం
ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం.
ప్రస్తుతం రిజిస్ట్రార్‌ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment