హైదరాబాద్: ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వందమంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్శిటీ అయిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాతన వైద్య చికిత్స పద్ధతులు వంటి వాటిపై గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో 100 మంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైద్య విద్యా సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.
ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. సుమారు 1900 ఎంబీబీఎస్ విద్యార్థులు, వెయ్యి మందివరకూ పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలల్లో ఇన్నొవేటివ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు, సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రాంలు నిర్వహించేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అంగీకరించింది. ఇందులో భాగంగానే ముందుగా వివిధ స్పెషాలిటీలకు చెందిన ప్రొఫెసర్లను ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్నట్టు వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి.
మెడికల్ ప్రొఫెసర్లకు 'హార్వర్డ్' శిక్షణ
Published Thu, Jul 7 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM
Advertisement