కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19) తీరుతెన్నులను కనుగొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలకు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సౌమ్యలిప్సా రాత్, డాక్టర్ కిషాంత్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య, కిషాంత్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కరోనాపై పరిశోధనలు చేపట్టేందుకు వారం క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థకు మా ఆలోచనలపై పరిశోధనా పత్రం సమర్పించాం. ఆ సంస్థ మా పత్రాలను ఎంపిక చేసింది’అని తెలిపారు. అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసేందుకు అనువుగా ల్యాబ్‌లు ఉన్న నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లోనే పరిశోధనలు చేయాల్సి ఉండగా నిట్ ప్రొఫెసర్లు శనివారం తమ ప్రాజెక్టును ప్రారంభించారు. వివిధ ఉష్ణోగ్రతల్లో వైరస్ ప్రభావం, దానిని అంతం చేసే అవకాశాలపై పరిశోధనలు చేశాక వ్యాక్సిన్ రూపొందించేందుకు అవకాశాలు సులువవుతాయి. ఏడాది పాటు ఈ పరిశోధనలు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment