అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది.
ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది.