నాంపల్లి: ప్రముఖ నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య కొట్లాట జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియతో ఈ వైరం మొదలైంది. సూపరింటెండెంట్ పోస్ట్ నీదా... నాదా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
దీంతో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్‌కు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడాది కూడా పూర్తికాక ముందే తనపై బదిలీ వేటు వేశారని, అక్రమ బదిలీని నిలుపుదల చేయాలంటూ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్‌కు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, న్యాయస్థానంలో డాక్టర్ ఉషారాణికి అనుకూలంగా తీర్పు వచి్చంది. కోర్టు ఆదేశాలతో డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే అక్కడ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ రవికుమార్ ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించారు. చెక్కుబుక్స్, సెల్‌ఫోన్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రొఫెసర్ పోస్టులో కొనసాగుతున్నారు.
ఇద్దరూ ఉడుంపట్టు...
అన్యాయంగా, అక్రమంగా తన పోస్టులో కొనసాగుతున్నారని డాక్టర్ ఉషారాణి ఆరోపిస్తుండగా, కాదు తనకే బాధ్యతలు ఇచ్చారంటూ డాక్టర్ రవి కుమార్ అంటున్నారు. ఇద్దరూ ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. డాక్టర్ రవికుమార్ పూర్తిస్థాయి బాధ్యతల కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాను దళితుడినని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దళితుడేనని, ఎలాగైనా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అయితే ఈ వివాదాన్ని డీఎంఈ కార్యాలయం కూడా ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పడేసింది.
మరోవైపు నిలోఫర్‌లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వైరల్ జ్వరాలు సోకి బాధితులతో కిక్కిరిసిపోతోంది. నిలోఫర్‌లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌తో కలిపి మొత్తం 1,300 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ పడకలు ఎటూ సరిపోవడం లేదు. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేనికారణంగా నెల రోజులుగా పాలనంతా అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా నిలోఫర్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని రోగులు, రోగి సహాయకులు, ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment