మేం రాం..మా ఇష్టం | Medical college professors, personal | Sakshi
Sakshi News home page

మేం రాం..మా ఇష్టం

Published Mon, Jan 6 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Medical college professors, personal

నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్: మెడికల్ కళాశాలకు ఎంసీఐ అనుమ తి లభించాలంటే ప్రొఫెసర్లు, సిబ్బంది ని యామకమే కీలకం. ఈ నేపథ్యంలో డీఎంఈ గతేడాది జిల్లాలోని మెడికల్ కళాశాలకు 123 మంది ప్రొఫెసర్లను నియమించింది. గతేడాది మే 15, 16 తేదీల్లో ఎంసీఐ బృందం కళాశాలను సదర్శించింది. ఆ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు, సిబ్బంది కళాశాలలో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులనుంచే ప్రొఫెసర్లు డుమ్మా కొట్టడం ప్రారంభించారు. ఏకంగా 90 మంది పత్తాలేకుండా పోయారు. దీంతో బోధించేవారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మంత్రి సుదర్శన్‌రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. దీంతో కొందరు ప్రొఫెసర్లు విధులకు హాజరవుతున్నారు. ఇంకా 48 మంది ప్రొఫెసర్లు అసలు కళాశాలకే రావడం లేదు. విధులకు డుమ్మా కొడుతున్నా వీరికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తుండడం గమనార్హం.
 
 బెదిరింపులు
 ఆస్పత్రికి రావాలని వైద్య విధాన పరిషత్ అధికారులు పలుమార్లు కోరినా ప్రొఫెసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రికి రాని ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని, వేతనాలు నిలిపివేయాలని అధికారులు భావించారు. అయితే వారు ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలిసింది. తమపై చర్యలు తీసుకుంటే ఆస్పత్రిలో ద్వితీయ సంవత్సరం కోర్సులకు అనుమతి రాకుండా చూస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్లు లేకపోతే కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి అనుమతి ఇవ్వరని పేర్కొంటున్నట్లు సమాచారం. కాగా డుమ్మాకొడుతున్న ప్రొఫెసర్లకు ఓ అధికారి అండగా ఉంటున్నారని తెలుస్తోంది. వారి వద్దనుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వేతనాలు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ విధులకు హాజరుకాని 48 మంది ప్రొఫెసర్లు పూర్తిస్థాయి వేతనం పొందుతున్నట్లు సమాచారం.
 
 నామమాత్రంగా బోధన
 ప్రొఫెసర్లు డుమ్మా కొట్టడంతో మెడికల్ కళాశాల మెదటి బ్యాచ్‌కు నామమాత్రంగానే తరగతులు నిర్వహించారు. ప్రొఫెసర్లు లేకపోవడంతో థియరీతోపాటు ప్రాక్టిక ల్స్ కూడా నిర్వహించలేకపోయారు. దీంతో ఇంటర్నల్ పరీక్షలను సైతం తూతూమంత్రంగా నిర్వహించినట్లు తెలిసింది.
 
 ఆస్పత్రితో
 మెడికల్ కళాశాల పరిధిలోకి జిల్లా ఆస్పత్రిని మార్చకపోవడం ప్రొఫెసర్ల డుమ్మాకు కారణంగా కనిపిస్తోంది. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులం.. వైద్యవిధాన పరిషత్‌లో ఎలా పని చేస్తామంటూ వారు పేర్కొంటున్నట్లు తెలిసింది. తమకంటే తక్కువ అయిన విభాగం వారి వద్ద మేం పనిచేయలేం అని ప్రొఫెసర్లు పేర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం కళాశాలకు చెందిన 23 మంది వైద్యులు మాత్రమే ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. కాగా వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు 200లోపే వచ్చే ఔట్ పేషెంట్లు ఇప్పుడు 650 వరకు వస్తున్నారు. గతంలో 130 మందిలోపే ఇన్‌పేషెంట్లుగా ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 380 దాటింది. దీంతో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 చర్యలు తప్పవు
 విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విధులకు హాజరు కావాలని ప్రొఫెసర్లందరినీ ఆదేశించాం. కళాశాలలో బోధనతోపాటు ఆస్పత్రిలో వీరి సేవలను వినియోగించుకుంటాం. ఎవరైనా రాకపోతే చర్యలు తీసుకుంటాం.
            -జిజియాబాయి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement