పీజీ మెడికల్‌ సీట్లపై కత్తి! | There is a chance of getting cut to 265 seats in Osmania and Gandhi Medical Colleges | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ సీట్లపై కత్తి!

Published Mon, Sep 23 2024 4:20 AM | Last Updated on Mon, Sep 23 2024 4:20 AM

There is a chance of getting cut to 265 seats in Osmania and Gandhi Medical Colleges

ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీల్లోనే 265 సీట్లకు కోత పడే చాన్స్‌ 

ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల బదిలీ ఫలితం 

కొత్తగా ఏర్పాటు చేస్తున్న కాలేజీలకు పంపించిన డీఎంఈ 

ఖాళీలను భర్తీ చేయకపోవడంతో సీట్ల సంఖ్యపై ప్రభావం చూపించే అవకాశం

ప్రతిష్టాత్మక కాలేజీల్లో ప్రొఫెసర్లు లేకపోవడం ఏమిటంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మెడికల్‌ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్‌ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్‌ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్‌ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు 
ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్‌ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్‌ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. 

కాకతీయ మెడికల్‌ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్, జన రల్‌ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. 

బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్‌ఎంసీ సమీక్ష 
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్‌ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్‌ఎంసీ సమీక్షిస్తుంది. 

అంతేకాదు బయోమెట్రిక్‌ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే టీచింగ్‌ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 481 పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్‌ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఇక 178 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్‌ కాలేజీలో 213 పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్‌ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. 

ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.

సీట్లు కోల్పోయే అవకాశం లేదు 
పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్‌ వాణి, డీఎంఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement