సుందరకృష్ణకు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియామక పత్రాన్ని అందజేస్తున్న వీసీ చంద్రశేఖర్
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తూ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో గురువారం రాత్రి ఇన్‌చార్జి రిజిస్ట్రార్ వైకే సుందరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురు ప్రొఫెసర్లు ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఉత్తర్వులను వారి వ్యక్తిగత మెయిల్‌కు పంపడంతో పాటు శుక్రవారం వాటిని సొంత ఊరు అడ్రస్‌కు పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు పోయినట్లే. అయితే వాటిని కాపాడుకునేందుకు సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతపురం జేఎన్‌టీయూ మాదిరే తమకు కూడా హైకోర్టు ధర్మాసనం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు.
ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా సుందరకృష్ణ
కృష్ణా యూనివర్సిటీ నుంచి సాగనంపే నలుగురు ప్రొఫెసర్లలో ఒకరైన టి. హైమావతి ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, తొలగింపు... రిజిస్ట్రార్ సంతకంతోనే జరగాల్సి ఉంది. ఇది చిక్కు తెచ్చిపెట్టింది. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ దీనిపై తీవ్ర తర్జన భర్జన అనంతరం వైకే సుందరకృష్ణను ఇన్‌చార్ట్ రిజిస్ట్రార్‌గా నియమించి, అతనితో ఆ నలుగురు ప్రొఫెసర్లకు తొలగింపు ఉత్తర్వులు ఇప్పించారు.
తొలగించిన వారు వీరే..
♦డాక్టర్ తాళ్ల హైమావతి, అప్లైడ్ మాథమెటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు)
♦డాక్టర్ వి. వెంకట్రాము, ఫిజిక్స్ డిపార్ట్‌మెంటు, అసిస్టెంట్ ప్రొఫెసర్, యోగి వేమన యూనివర్సిటీ (నూజివీడు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్‌గా, వర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ బాధ్యతలు చూస్తున్నారు.)
♦డాక్టర్ ఈదర దిలీప్, ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడన్ యూనివర్సిటీ (ఇంగ్లిష్ డిపార్ట్ట్‌మెంట్ హెచ్‌ఓడీగా, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా ఉన్నారు.)
♦డాక్టర్ వైఏవీఏఎస్‌ఎన్ మారుతి బయోసైన్స్ అండ్ బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ ( కాలేజీ అభివృద్ధి కమిటీ (సీడీసీ) డీన్‌తో పాటు క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు).
ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే
కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాము. నిపుణుల సలహాలు తీసుకొనే ఆ నలుగురు ప్రొఫెసర్లును రిలీవ్ చేశాము. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ నియామకం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే.
– కేబీ చంద్రశేఖర్, వైస్ చాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ
చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్
తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు
Comments
Please login to add a commentAdd a comment