
ఓయూ పాలనాభవనం ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేస్తున్న ప్రొఫెసర్లు. చిత్రంలో కోదండరాం
- వీసీలను, పాలక మండలి సభ్యులను నియమించాలి
- ఓయూ ప్రొఫెసర్ల ధర్నాలో ప్రొ.కోదండరామ్
హైదరాబాద్: ఉన్నత విద్య అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజకీయ జేఏసీ చైర్మన్, ఓయూ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఎఫ్‌యూటీఏ) పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పాలనా భవనాల ఎదుట అధ్యాపకులు ధర్నా చేశారు. ఓయూ పాలనాభవనం ప్రవేశ ద్వారం ఎదుట ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇందులో ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు.
సాధించుకున్న రాష్ట్రంలో ఉన్నత విద్యకు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పర్యావరణ వేత్త ప్రొ.పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి ఓయూలోనే బీజాలు పడ్డాయని, టీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ముందుకు నడిపింది తొలుత వర్సిటీ అధ్యాపకులే అని అన్నారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ (ఐపీఎస్‌ఏ) అఖిల భారత అధ్యక్షులు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా వీసీలు లేకుండా మనుగడ సాగించడం ఓయూకే చెల్లిందని అన్నారు.
ఎఫ్‌యూటీఏ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహర్ మాట్లాడుతూ వర్సిటీలకు రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్లను, పాలక మండలి సభ్యులను నియమించాలని, అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించాలని అధ్యాపకులు చేస్తున్న ఆందోళనను సీఎం కేసీఆర్ పట్టించుకోకుంటే ఆందోళనను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.రవీంద్రనాథ్, ప్రొ.కృష్ణయ్య, ప్రొ.రాములు, ప్రొ.చెన్నకృష్ణారెడ్డి, ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొని ప్రసంగించారు.