Bangaru Telangana
-
బంగారు తెలంగాణను నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చా రు. ఈ మేరకు ఆదివారం ఓ లేఖ విడుదల చేశా రు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమై న పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను తన సందేశంలో ప్రస్తావించారు. గవర్నర్ సందేశం ఆమె మాటల్లో.. ‘తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా..! గణేశ్ ఉత్సవాల తోపాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగు తున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతని స్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గం గాజమునా తెహజీబ్‌ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోంది. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు, వ్యవసాయానికి గోదావరి జలాల తరలింపు సాధ్యమవుతుంది. సముద్రంలో వృథాగా కలిసే 575 టీఎంసీ ల నీటిని అదనంగా పొలాలకు మళ్లించడంతోపాటు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలు, పాలన రంగాల్లో ఐటీ, సాంకేతికతను వినియోగిస్తున్న తీరు బాగుంది. చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయం. గతంలో రూ.52 వేల కోట్ల మేర ఉన్న ఐటీ ఎగుమతులను రూ.1.10 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం బలమైన పునాదులు పవిత్రమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడంతోపాటు రాష్ట్ర పునర్మిర్మాణం, పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ ఈ రోజు దేశం ముంగిట ఒక నమూనా రాష్ట్రంగా సగర్వంగా తలెత్తి నిలబడింది. అన్ని రకాలైన రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి.. దృఢమైన దేశాన్ని నిర్మించడంలో భాగంగా దృఢమైన రాష్ట్రంగా నా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. జైహింద్.. జై తెలంగాణ’అంటూ గవర్నర్ తన సందేశాన్ని ముగించారు. సంస్కరణలో ప్రభుత్వ చొరవ భేష్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 14.84 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని సాధించడం ద్వారా రాష్ట్ర సంపదలో ఎంతో వృద్ధి కనిపించింది. 2014లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సం పద ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్న ట్లు తెలిసింది. సుపరిపాలనలో భాగంగా అధికా ర వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వపాలన, సంక్షేమ ఫలాలను గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజల ముంగిటకు చేరేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ విధమైన సంస్కరణలు దోహదం చే స్తాయి. గ్రామాల అభివృద్ధిలో 30 రోజుల ప్రణాళిక అమలే గీటురాయిగా నిలువబోతున్నది. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ ఉత్పత్తి, రైతుబం ధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీర థ వంటి విశిష్ట కార్యక్రమాలు అమలవుతున్నా యి. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశం లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. -
చాలా గర్వంగా ఉంది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. కేసీఆర్ పాత్రలో నటుడు నాజర్ నటిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాజర్ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి.. గెలిచిన కేసీఆర్‌గారి పాత్రలో నటించడం చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. కేసీఆర్‌గారి వీడియోలు చాలా చూశా. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా’’ అన్నారు. ‘‘కేసీఆర్‌గారు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం నుంచి బంగారు తెలంగాణ వరకు ఈ సినిమా ఉంటుంది. నవంబర్ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్రావు. ‘‘కేసీఆర్‌గారి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. నాజర్గారైతే పర్ఫెక్ట్గా ఉంటుందని ఆయన్ని తీసుకున్నాం’’ అన్నారు కృష్ణంరాజు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి, సహ నిర్మాత: మేకా రాఘవేంద్ర. -
బంగారు తెలంగాణ ఏదీ?
కొండాపూర్(సంగారెడ్డి): బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు.దివారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఆయన పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా నేటికీ చాలా గ్రామాలలో మురికి కాల్వలు, రహదారులు, మంచి నీటికి కూడా నోచుకోకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం సామాజిక అంశాలపై కాలాయాపన చేయకుండా అర్హులైన దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి దళితుల సమస్యలను పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టాలనీ ప్రభుత్వాన్ని కోరారు.ఎస్సీ, ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలను అందించాలన్నారు. విద్యా , వైద్యం సామాన్యుడికి అందడంలేదని, విద్యా, వైద్యం ప్రతీ పేదవాడికి అందినప్పుడే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందనీ తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనీ ఆశించిన యువతకు నిరాశే మిగిలిందనీ, రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, యాదగిరి, మండల నాయకులు రాజయ్య, రాంచెందర్, పవీణ్,ఎల్లేశ్,చంద్రయ్య, రాజు,సత్య తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మండలంలోని శ్రీనివాసపురంలో ఆదివారం ఆమె సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీపీ కాసగళ్ల అనసూయ, ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, పరుశురాములు, ఎల్లయ్య, మహేశ్, భాస్కర్ పాల్గొన్నారు. బొమ్మలరామారంలో.. బొమ్మలరామారం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో 300 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. మాజీ ఎంపీటీసీ యంజాల సత్యనారాయణ, ఎంపీపీ తిరుపతిరెడ్డి, సల్ల రవి పాల్గొన్నారు. పాఠశాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ రాజాపేట : మండలంలోని రేణికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న గదుల సంఖ్యను తెలు సుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయడం కోసం స్కూల్‌ను పరిశీలించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కోరె లలిత, మండల ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, నాయకులు చింతలాపురి వెంకట్రాంరెడ్డి, బోళ్ల రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాతయ్య, చామకూరు గోపాల్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, దాచపల్లి శ్రీను పాల్గొన్నారు. -
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి నిరంతర కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ అమ్మ వారి గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ భవన్‌లోనూ.. రాష్ట్రావతరణ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ద అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని, సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
బంగారు తెలంగాణ టీఆర్ఎస్తోనే సాధ్యం
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తగూడెంలో వివిధ పార్టీల నాయకులు లింగంపల్లి రమణ, పెద్ది శంకర్, పాక గోవర్ధన్, పెద్ది నాగయ్య, రావుల రఘు, ఎల్. సుమన్, మేడి నరేష్, సత్యనారాయణ, ఎం. చంటి, కె. రాజు, ఎం. రాంమ్మూర్తి, ఎం. నర్సయ్య, నవీన్‌లతో పాటు కొంత మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంట పెట్టుబడి కింద సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం సాయమందిస్తుందని చెప్పారు. ఈపథకాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్, మొరిశెట్టి ఉపేందర్, మండల అధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, దేవస్థాన ఛైర్మన్ బొడ్డు రామలింగయ్య, కందుల తిరుమల్‌రావు, కళెట్లపల్లి శోభన్‌బాబు, సర్పంచ్‌లు మన్నె లక్ష్మినర్సయ్య, జీడి వీరస్వామి, వల్లపు గంగయ్య, పద్మ, ఎంపీటీసీ రేఖల రాణి, సోమిరెడ్డి, పొట్టెపాక సైదులు, రేఖల సైదులు, దండ వీరారెడ్డి, మేడిపల్లి వేణు, లింగంపల్లి రాములు, వి. సుధాకర్, చిర్రబోయిన వెంకన్న, రాంబాబు, వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆయనతోనే..బంగారు తెలంగాణ సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్, పేద ప్రజల సంక్షేమానికి షాదిముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం తదితర సంక్షేమ పథకాలుప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఏ రాజకీయపార్టీ తరం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండాతీర్చిన ఘనతతో పాటు అనేక సంక్షేమ పథకాలుప్రవేశ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీపీ సర్వయ్య, సుధీర్‌రెడ్డి, నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, ఎండి. ఖాలెక్, చంద్రశేఖర్, నరేందర్‌రావు, బిజె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చందంపేట (దేవరకొండ) : సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్రహోంశాఖ, కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిండి నుంచి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి కాలువల ద్వారా చెరువులు నింపేందుకు వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా శనివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి జల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో 70 ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలకు పుర్వ వైభవం వచ్చిందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని సుమారు 40 చెరువులు, కుంటలు డిండి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో జలకళను సంతరించుకున్నాయని, గ్రామాల్లో ప్రజ లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కమల పరుశురాములు, ఎంపీటీసీ గిరియాదగిరి, గడ్డం వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్‌రెడ్డి, రాంరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మేకల శ్రీను, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీను, ఆరెకంటి రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 28 శాతం ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని టీఆర్ఎస్ సభ్యుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనుసరిస్తున్న తీరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు పెద్ద సంఖ్యలో వలస వచ్చారని, కాని వారికి అక్కడా జీవనోపాధి సరిగ్గా దొరక్క మురికివాడలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. జాతీయ సగటు (37 శాతం) కంటే ప్రస్తుతం తెలంగాణ పట్టణా జనాభా (39 శాతం) ఎక్కువగా ఉందని, కొత్త నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు ఆవిర్భవిస్తే అది 45 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. -
గెలుపు మాదే
నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ ప్రధాన కారణం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. రానున్న రోజుల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల భారీ మెజార్టీతో గెలు స్తుంది. మరో నాలుగింట్లో గట్టి పోటీ ఇస్తుంద ని ఏఐసీసీ సభ్యుడు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మాధవరెడ్డి నర్సంపేటకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగింది సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోరికను తీర్చింది. గత ఎన్నికల సమయంలో సోనియాగాంధీ కృషిని ప్రజలు గ్రహించకుండా తీర్పును ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేయకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయి, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోంది. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. అప్పులు తీసుకువచ్చి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కానీ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లేదు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి సీనియర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుకుసాగుతా. 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. సీనియర్ నాయకులు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా. గొంతు నొక్కుతున్నారు.. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని గొంతు నొక్కేస్తోంది. ఎలాంటి తప్పు చేయకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. సమస్యలను ప్రస్తావించకుండా గొంతు నొక్కేసే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెప్పే సమయం సైతం ఆసన్నమైంది. నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక కృషి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయా ంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు కేటాయించారు. కానీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిధులు సక్రమంగా మంజూరు చేయకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి ఇబ్బందిగా మారింది. వచ్చిన కొద్దిపాటి నిధులను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నా. రాజకీయ కోణంలో ప్రతిపక్ష పార్టీలకు ని«ధుల కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నరు. నాడు ఉద్యమం గుర్తు లేదా? 1969లో తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చింది. ఆ తర్వాత 1977లోనే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కేసీఆర్‌కు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది గుర్తులేదు. పదవి ఊడిపోయిన తర్వాత రాజకీయంగా భవిష్యత్ లేదనే కారణంతోనే తెలంగాణ రాష్ట్రం కావాలని నినాదంతో ఉద్యమం చేపట్టారు. అయితే 1977లో ఎందుకు ఉద్యమించలేదు. కేవలం కేసీఆర్ ఉద్యమిస్తేనే కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయా పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాయి. సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నేడు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది. -
బంగారు కాదు.. అప్పుల తెలంగాణ
నల్లగొండ టౌన్ : ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పుల తెలంగాణగా మార్చాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని బొడ్డుపల్లి రామశర్మ ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ నల్లగొండ జిల్లా 21వ మహాసభలను ఆయన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం లో అసమర్ధత, ఆహంకార పూరిత పాలన సాగుతుం దని విమర్శించారు. ప్రభుత్వం అక్రమార్కులు భూ ములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాల ఊసే లేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి ముఖ్యమంత్రి ప్రగతిభవన్, ఫాంహౌజ్‌కు మాత్రమే పరిమితమయ్యాదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడిని తేవడానికి సీపీఐ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. వ్యవసాయ సంక్షోభంపై పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించి.. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ప్రజలతో చర్చించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బలమైన పునాదులను వేయాలని.. ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేయాలని అన్నారు. నల్లగొండకు ఉద్యమ నేపథ్యం ఉందని.. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ జిల్లా మహాసభలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తొలుత ఇటీవల జిల్లాలో మృతిచెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. అనంతరం జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి తన నివేదకను ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ 27 మండలాల మహాసభలు, కమిటీల నివేదికను రాష్ట్ర కార్యదర్శికి అందజేశారు. మహాసభకు నెల్లికంటి సత్యం, పల్లా దేవేందర్‌రెడ్డి, ఎల్.శ్రవన్‌కుమార్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, సృజన, ఉజ్జిని యాదగిరిరావు, గుజ్జ రామచంద్రం, నర్సింహారెడ్డి, వీరస్వామి, అంజిరెడ్డి, అంజా నాయక్, పొదిలి శ్రీనివాస్, పి.వెంకటేశ్వర్లు, బరిగల వెంకటేశ్, నూనె రామస్వామి పాల్గొన్నారు. పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ.. మహాసభల సందర్భంగా సీపీఐ కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బొడ్డుపల్లి రామశర్మ ప్రాం గణం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, రామగిరి ప్రకాశం బ జార్, భాస్కర్టాకీస్, దేవరకొండ రో డ్డుమీదుగా మహాసభల ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనపదం..భూమేశ్ గళం
ఆయన పాట పల్లె ప్రజానీకాన్ని తట్టిలేపుతుంది.. వారిలో స్ఫూర్తి నింపుతుంది.. జనపదమే గళంగా పాటలు రాస్తూ, పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాడు జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌కు చెందిన కొత్తపల్లి భూమేశ్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తన పాటల ద్వారా ఆంధ్ర పాలకులు మనకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు. అలాగే ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘ఇది మన తెలంగాణ’ పేరుతో పాటలు రాశారు. ఇలా జనపదాన్నే తన గళంగా మార్చుకుని అందరి మన్ననలు పొందుతున్నారు. జక్రాన్‌పల్లి(నిజామాబాద్ రూరల్): కొత్తపల్లి భూమేశ్‌కు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి, అదే అందరిలో అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. అతని పాటంటే చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మిక్కిలి ప్రీతి. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ఎందరో ప్రముఖుల మెప్పు పొందారు. తెలంగాణ సాధనోద్యమంలో ధూంధాం వేదికగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేశారు. తెలంగాణ ఉద్య మంలో తనవంతు కృషి చేస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్రను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘బంగారు తెలంగాణ’ కోసం పాటలు రాస్తూ స్వీయ ప్రదర్శనలు ఇస్తున్నారు. జన పదమే తన పాటగా.. జానపద గాయకుడు భూమేశ్ పల్లెటూరిలో పుట్టడంతో పాడి పంటల మధ్య ఆయన జీవనం సాగింది. రైతుల కన్నీరు చూసిన ఆయన భావం పాటగా మారింది. ఇలా ప్రజా సమస్యలపై జానపద పాటలు రాయడం మొదలుపెట్టాడు. 1997–98 సంవత్సరం నుంచి జానపద పాటలు పాడటం ప్రారంభించాడు. అప్పుడే ప్రస్తుత మనోహరాబాద్ సర్పంచ్ పాట్కురి తిరుపతిరెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం వైపు తొలి అడుగులు వేశాడు. గద్దర్ పాటలకు ఆకర్షితుడై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. అక్కడ ప్రముఖ కళాకారుడు రాజానర్సింహ, బెల్లి లలితతో కలిసి బృందంలో సభ్యుడిగా పాటలు పాడారు. ధూంధాంతో దుమ్మురేపారు.. తెలంగాణ సాధనలో భాగంగా రసమయి బాల్కిషన్ ఏర్పాటు చేసిన ‘ధూంధాం’లో తన పాటల ద్వారా జనల్లో చైతన్యం తీసుకువచ్చారు. ధూంధాం జక్రాన్‌పల్లి మండలాధ్యక్షుడిగా ఉంటూ అనేక స్టేజ్ షోలు ఇచ్చారు. ఆంధ్ర పాలకుల దోపిడి, మన సంస్కృతి, సాంప్రదాయాలపై పాటలు పాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో తెలంగాణ ఆవశ్యకతను పాటల రూపంలో వివరించారు. ఊరూరా ప్రజా చైతన్య యాత్రలు జిల్లాలో ఊరూరా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కావద్దంటూ, ఆర్మూర్ ప్రాంతంలోని రైతులకు ఎర్ర జొన్న బకాయిలు, పసుపు పంటకు గిట్టుబాగు ధర ఇవ్వాలని తన ప్రదర్శనలు పాటల ద్వారా డిమాండ్ చేశారు. తదితర పోరాటాల సభలలో జానపద గాయకుడిగా ఎలుగెత్తి చాటారు. నల్గొండ జిల్లాలో కొత్తపల్లి భూమేశ్ ఆధ్వర్యంలో 80 మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. స్వీయ రచనలో సీడీ ఆవిష్కరణ స్వయంగా తాను రాసిన పాటలతో ‘ఇది ఇది మన తెలంగాణ’ అనే పేరుతో సీడీని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇది ఇది మన తెలంగాణ, అమ్మమ్మో కేసీఆర్, మన ఊరు మన చెరువు, పించినోచ్చనమ్మ పించినోచ్చన మ్మ, చేయి చేయి కలిపితే, పంపిద్దాము మనము పంపిద్దాము, తన స్వీయ రచనలో ఆరు పాటలు పాడి సీడీలను విడుదల చేశారు. ఇప్పటి వరకు 50కి పైగా పాటలు రాశారు. సామాజిక చైతన్యం, అభ్యుదయ భావాలతో కూడిన పాటలు రాస్తూ ప్రజలను చైతన్య వంతం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యమైన కొన్ని పాటలు ఇంకుడు గుంతల ఏర్పాటు, మిషన్‌కాకతీయ, హరితహారం, స్వచ్ఛభారత్, అవయవ దానం, భారత సైనికుల త్యాగం, ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత, తెలంగాణ అమరవీరులు, సీఎం కేసీఆర్ పరిపాలన గురించి పాటలు రాశారు. పది నిమిషాల్లో పాటలు రచించడంలో భూమేశ్ దిట్ట. ఏదేని అంశం చెబితే చాలు దానికి సంబంధించిన పాటను సిద్ధం చేస్తారు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటలు పాడిన కొత్తపల్లి భూమేశ్‌ను సీఎం కేసీఆర్, రసమయి బాల్కిషన్, ఎమ్మెల్యే గోవర్ధన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఎంపీ కవితలు ప్రశంసించారు. బంగారు తెలంగాణ కోసం పాటల అల్బమ్ చేస్తా బంగారు తెలంగాణ వైపు అడుగులు అంటూ జానపద గేయాలతో ఒక అల్బమ్‌ను పూర్తి చేస్తా. జానపద గాయకుడిగా పాటలు పాడుతూ తెలంగాణోద్యమంలోనే ఎక్కువ సమయం కేటాయించాను. ప్రస్తుతం బంగారు తెలంగాణలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తన పాటలతో వినిపిస్తాను. జాన పదంతో మంచి గాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందడానికి అహర్నిషలు శ్రమిస్తాను. – కొత్తపల్లి భూమేశ్, రచయిత, గాయకుడు -
బంగారు తెలంగాణ బాటలు కనిపిస్తలేవా?
సాక్షి, హైదరాబాద్: ‘బంగారు తెలంగాణ’పై గురువారం శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది. గురుకుల పాఠశాలలపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుడు వివేకానంద మాట్లాడారు. తన ప్రసంగంలో పలుమార్లు ‘బంగారు తెలంగాణ’పదాన్ని ఉచ్ఛరించారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇందాక వివేకానంద తన ప్రసంగంలో 20 సార్లు బంగారు తెలంగాణ పదాన్ని వాడారు. అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది..’’అని వ్యాఖ్యానించారు. అసలు మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధర ఉండటమే తన దృష్టిలో బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ‘‘బంగారు తెలంగాణ వారాలు, నెలల్లో ఆవిష్కృతం కాదు.. దాని కోసం నిర్మాణాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించాం. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు కానన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినం. వారు బంగారు మంచాలేస్తే మేం పీకి పాడుచేసినమా?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, అప్పులు.. ఇలా కాం గ్రెసోళ్లకు రెండు మూడు అంశాలు ఉన్నాయని, ఎప్పుడు చూసినా వాటినే చెప్తుంటారని, ఈ తీరు చూసి జనం నవ్వుతున్నారన్నారు. వారు రాష్ట్రాన్ని కారు చీకట్లు చేస్తే, తాము వెలుగులు తేలేదా, బంగారు తెలంగాణ దిశగా వేస్తున్న బాటలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, రెండు మూడు చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
విద్యార్థి శక్తి.. తెలంగాణ శక్తిగా మారాలి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి శక్తి.. తెలంగాణ శక్తిగా మారాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు సీఎం కేసీఆర్ వెంట నిలవాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. దేశం మొత్తంలో విద్యార్థులు, యువకులను ప్రోత్సహించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. తెలంగాణ భవన్లో సోమవారం టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ రాష్ట్ర సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి టీఆర్ఎస్వీ నాయకులు తీసుకుపోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా?
సందర్భం కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేయాలని అనేక సంవత్సరా లుగా వేరు వేరు రూపాలలో పాలకులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పాలకులు నడుంకట్టారు. టీఆర్ఎస్ అధి కారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల భూములు గుంజుకుని నిర్వాసితులను చేయడానికి వెనకడుగు వేయని విషయాలలో ‘కొత్తగూడెం ఎయి ర్పోర్టు’ ఒకటి. ఈ ఎయిర్‌పోర్టును కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతి పరిధిలో ఉన్న 1,600 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. దీని పరిధి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బంగారు చేలుక, పును మడు చేలుక, తోకబండల, మర్రిగూడెం, గోల్లగూడెం, ఎర్రం చెలక, పాయవాల గుంపు మెుదలగు గ్రామాల ప్రజలు భూనిర్వా సితులు కానున్నారు. ఈ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఉన్న ప్రాంతమంతా 5వ షెడ్యూల్ పరిధిలోనిదే. ఆదివాసీలు జనాభా 90 శాతం నివసి స్తున్నారు. 5వ షెడ్యూల్డు ప్రాంతం అయినప్పటికీ ఆదివాసీలకున్న రాజ్యాంగ రక్షణలను ఏ మాత్రం పట్టించుకోకుండా 1/70, పెసాలాంటి చట్టాలను అమలు చేయకుండా ప్రజలనూ బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనవి. ఎయిర్ ఇండియా అథా రిటి ఇప్పటికే అనుమతినిచ్చింది. భారీ ఎత్తున పోలీసుల మెుహ రింపు చేసి, రెయిడ్స్ బృందంవారు గ్రామాలలో సర్వే నిర్వహిం చారు. ప్రజలందరూ ఒకే మాటతో మాకొద్దు ఈ ఎయిర్‌పోర్టు అని వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిపై అణచివేతను ప్రయోగిస్తూ వారి భూములు లాక్కొనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ అభివృద్ధి ముసుగులో ఏజెన్సీలోనీ సహజ సంపదను బహుళజాతి సంస్థ లకు కట్టబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నంగా విమానాశ్రయం ముందుకువచ్చింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలను అణచివేసేందుకు సైనిక స్థావరాలను అనుసంధానం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందనేది మరో రహస్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. ఇది సైనిక స్థావరం కాదని ప్రజల సౌకర్యం కోసమేనని ప్రభుత్వం చెపుతూ వస్తోంది. కానీ దీని నిర్మాణం వెనుక ప్రకటిత లక్ష్యాలు ఏమిటి, అసలు లక్ష్యాలు ఏమిటి? అక్కడ విమానాశ్రయాన్ని నిర్మాణం చేయడానికి కానున్న వ్యయం ఎంత? దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఇప్పటి వరకు ప్రజలు విమానాశ్రయం కావాలని పాలకులకు నివేదించారా? ఏ హక్కుతో ఆదివాసీ ప్రజలను చట్ట విరుద్ధంగా బయటకు పంపాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు లేదు. పాలకుల తప్పుడు విధానాలను విమర్శించి ప్రజలను మేల్కొలిపితే వారిని అభివృద్ధి నిరోధకులు అనడం మామూలై పోయింది. విధ్వంసాన్ని ఆపమంటే అన్నింటికీ ఒకేS జవాబు. బంగారు తెలంగాణకు ఆటంకంగా ఉన్నారనో లేదా భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారని అనటం పాలకులకు ఒక సాధారణ పద్ధతిగా అలవాటైంది. ఇంతకు ఏది అభివృద్ధి? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకునే పాలకులు ఏనాడైనా అట్టడుగు ఆదివాసీ, దళిత పీడిత ప్రజల బాగోగులు చూశారా? విమానాలలో తిర గండి. ఇదిగో అభివృద్ధి వెలిగిపోతుందనే వారు కొత్తగూడెం జిల్లా ఆదివాసుల, ఇతర దళిత పేద వర్గాలకు విద్యా, వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదు. కానీ ఆదివాసీ ప్రజలను విమానం ఎక్కిస్తామని మన పాలకులంటున్నారు. దీనిని గట్టిగా విమర్శించలేని ప్రతిపక్ష పార్టీలు పైకో మాట లోపల మరో మాటతో కాలం వెళ్లదీస్తున్నారు. సరైన నష్ట పరిహారం, స్థల మార్పిడి లాంటి పనికిరాని అర్థంలేని ప్రతిపాదనలు పెడుతు న్నారు. పాలకులు నిర్దయగా అమలుచేసే సామ్రాజ్యవాద ‘అభి వృద్ధి’ని విధ్వంసంగా చెప్పే స్పష్టమైన రాజకీయ అవగాహన లేని విధానాలు అవలంభించే పార్టీల వల్ల ప్రజల పోరాటాలకు తగిన ఫలితం దక్కకుండా పోవడం కనిపిస్తూనే ఉంది. మ«ధ్యతరగతి బుద్ధిజీవులలో కూడా కొందరు విమానాశ్ర యాన్ని కడితే ప్రయోజనమే కదా... అని అంటున్నారు. ఇది రాజ కీయ పార్టీలకు బలాన్ని ఇచ్చేవాదనే. నిజానికి దోపిడి వర్గ రాజ కీయ పార్టీల బలమంతా దానిలోనే ఉన్నది. వాస్తవంగా ఆ ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏమిటంటే విమానాశ్రయం పేరుతో నిర్మించేది సైనిక స్థావరం అయినప్పుడు దానిని కావాలని కోరు కోవడం వల్ల అంతిమంగా లాభం పొందేదెవరు? ఒకవేళ దానిలో కొంత భాగం పౌర విమానయానికి కేటాయించినప్పటికీ ఆ విమా నాలలో తిరిగే వారెవరు? ఇప్పటికీ గ్రామాలకు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని మైలారం గ్రామ పంచాయతిలోని ఏడు గ్రామాల ఆది వాసీ ప్రజలా? మూడు పూటలా తిండి కూడా దొరకని, వైద్యంలేక చచ్చే పేదలా? కొత్తగూడెం జిల్లాలోని ఆర్థిక సామాజిక స్థితి అధ్య యనం చేశారా? జిల్లా కేంద్రమైన కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఎఫ్ఓ మెుదలగు జిల్లా ప్రధాన కార్యాలయాలకు పావు కిలోమీటరు దూరం కూడా ఉండదు. ఆ జిల్లా బస్టాండులో కనీసం తాగడానికి నీరే కాదు.. మూత్రశాలలు కంపు వాసనతో రోత పుట్టిస్తాయి. ఇటువంటి చోట కాసిన్ని నీళ్ళూ, నాలుగు ఫినాయిల్ బాటిళ్ళూ సప్లై చేయలేని అసమర్థ పాలకులు బంగారు తెలం గాణలో విమానాలు మీ కోసమేనని ప్రజలకు ఊదరగొడితే నమ్మే దెవరని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. (ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడేదెవరో స్పష్టంగా చెప్పాలంటే... జలగం వెంగళ రావు కుమారుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు). మన పాలకులు నిత్యం రాజ్యాంగాన్ని చట్టాలను వందల వేల లక్షలసార్లు ఉల్లంఘిస్తారు. కానీ పేదలు కడుపు మండి చావ లేక బతకడానికి ప్రతిఘటిస్తే మాత్రం చట్టాలు ప్రజలకు వ్యతి రేకంగా అమలవుతాయి. శాంతి భద్రతలు గుర్తుకొస్తాయి. లాఠీలు లేస్తాయి. తుపాకులు గర్జిస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ శ్రేణులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ప్రభుత్వ కుట్రలను అభి వృద్ధి పేరుతో కొనసాగుతున్న విధ్వంసాన్ని ప్రతిఘటించాలని కోరుతున్నాము. ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విమానాశ్రయాన్ని/సైనిక స్థావరాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆదివాసీ ప్రజల నుంచి నిర్బంధంగా భూములు ఆక్రమించుకోవడాన్ని ఆపివేయాలి. ఆదివాసీ చట్టా లను, రాజ్యాంగ రక్షణలను అమలు చేయాలని ప్రతి తెలంగాణ వాదీ, రాజకీయ పార్టీలూ నినదించాలనీ మనవి చేస్తున్నాము. (కొత్తగూడెం ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా...) - నలమాస క్రిష్ణ వ్యాసకర్త తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 98499 96300 -
గ్రామాలతోనే 'బంగారు'బాట
-
గ్రామాలతోనే 'బంగారు'బాట
పల్లెలను పటిష్టపర్చడమే బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్ - అద్భుత మానవ వనరులే మన అసలైన సంపద - దూరదృష్టితో వృత్తి పనులకు చేయూతనిస్తున్నాం - రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం - రాష్ట్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దడం నా లక్ష్యం - 4 లక్షల యాదవ కుటుంబాలకు సబ్సిడీపై 88 లక్షల గొర్రెలిస్తాం.. - గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు - ‘జనహిత’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ దేశంలో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బంగారు తెలంగాణ ఎక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడంలోనే ఉందని చెప్పారు. అపార నైపుణ్యమున్న మానవ వనరులే అసలైన సంపద అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం. కొందరికి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా అన్న ఆలోచన ఉంటుంది. నా ఆలోచన వేరు. ప్రజలకు అధికారం రావాలి. అదే నాకు ప్రాధాన్యం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపూర్ణంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి చిల్లర మల్లర రాజకీయాల కోసం చేసేటివి కావు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నా. భవిష్యత్తును దర్శించి పేదరిక నిర్మూలనకు, వృత్తి పనివాళ్ల కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం..’’అని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఆర్థిక పురోగతిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఆర్థిక వనరులతో వచ్చే ఆదాయంలో 19.5 శాతం వృద్ధి సాధించింది. దేశంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళుతోంది. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం. గతంలో ఉన్న అరాచకల్లేవు. రాష్ట్ర ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంది. రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు కావొస్తుంది. దేశంలో ఇప్పుడు ధనిక రాష్ట్రం మనదే’’అని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఏడాదిన్నర తర్వాత అవగాహన వచ్చింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలినాళ్లలో పరిస్థితి అంతా గందరగోళంగా ఉండేది. ఏడాదిన్నర తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకెళుతున్నాం. టీఎస్ఐపాస్ పెట్టుకున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. తాగునీటి సమస్య శాశ్వతంగా దూరం చేసేందుకు మిషన్ భగీరథ అమలు చేశాం. ఇంటింటికీ మంచినీటిని అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుంది. రోగాలు దరిచేరవు. ఆ నీరు వచ్చాక ఇప్పుడున్న భోజనం, కూరల రుచి మారుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. రైతులకు కులం లేదు. భూమి ఉన్న వారందరూ రైతులే. సాగునీరుంటేనే రైతులు బాగుపడుతారు. ఇప్పుడు కరెంటు పోతే వార్త తెలంగాణ వస్తే ఆగమై పోతారు.. కరెంటు ఉండదు.. అంధకారమేనని ఆఖరి సీఎం కట్టె పట్టుకుని చెప్పిండు. కానీ ఇప్పడు కరెంటు పుష్కలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కరెంటు ఉంటే కాదు.. కరెంటు పోతే వార్త. విద్యుత్ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించుకున్నాం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పర్చేందుకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాల వారీగా మానవ వనరులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని కలెక్టర్లకు చెప్పా. కానీ చాలా మంది కలెక్టర్లకు అది అర్థమైనట్లు లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులకు సైతం అర్థం కాలేదు. నా లెక్క ప్రకారం మానవ వనరులంటే మన వృత్తి పనివాళ్లు. అద్భుతమైన నైపుణ్యమైన తెలంగాణ బిడ్డలు. గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు తెలంగాణలో మత్స్య కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. వారితో చేపల పరిశ్రమను అభివృద్ధి చేయాలి. చేపల ఉత్పత్తి పెంచి మార్కెట్ చేయగలిగితే అదే తెలంగాణ మానవ వనరుగా నా లెక్క. అసెంబ్లీలో చేపల గురించి నేను మాట్లాడినందుకు ఏపీకి చెందిన నేతలు సైతం అభినందనలు తెలిపారు. గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు. అలాగే రాష్ట్రంలో 25.50 లక్షల మంది యాదవులున్నారు. ఇంతమంది ఉన్నా సమైక్య పాలనలో వీళ్లను పట్టించుకోలేదు. వీరికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 600 గొర్రెల లారీలు వస్తున్నాయి. రామ్‌నగర్ చేపల మార్కెట్‌కు 35 నుంచి 40 లారీల్లో చేపలు దిగుమతి అవుతున్నాయి. యాదవ, ముదిరాజ్ సోదరులను అద్భుత నైపుణ్యమైన, గొçప్పగా పని చేసే జాతి రత్నాలుగా వీరిని నేను గుర్తిస్తా. తెలంగాణ సంపద అంటే వీళ్లే. 4 లక్షల యాదవ కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం సబ్సిడీపై 88 లక్షల గొర్రెలు సరఫరా చేస్తాం. అంతకంతకు ఆ సంపద రెట్టింపవుతుంది. దిసీజ్ బంగారు తెలంగాణ.. ఇప్పుడున్న 50 లక్షల గొర్రెలు కాకుండా.. రెండేళ్లలో దాదాపు 4 కోట్ల గొర్రెలు తయారవుతాయి. ఒక్కో గొర్రెకు రూ.5 వేలు లెక్కేసినా.. ఒక తెలంగాణ యాదవ కులం దగ్గర రూ.20 వేల కోట్ల సంపద సమకూరుతుంది. దిసీజ్ తెలంగాణ. ఇదీ బంగారు తెలంగాణ. ఆ దార్శనికత కావాలి. కాల్పనికత కావాలి. చేరుకునే ధృతి ఉధృతి కావాలి. ఆ ఉధృతితో చేరుకుంటే నూరు శాతం ఫలితం వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు. నేను బతికున్న కాలంలోనే ఇది సాధించి చూపిస్తా. అదేవిధంగా కుమ్మరులు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో కుండలు తయారు చేసే కార్యక్రమాలపై ఆలోచిస్తున్నాం. అనాగరిక పద్ధతులకు భిన్నంగా ప్రతి గ్రామంలో నవీన క్షౌ రశాలలు( హైజెనిక్ సెలూన్) పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ధనిక రాష్ట్రంలో పేదరికం ఎందుకుండాలె? గుడ్డి లెక్కన చెప్పాలంటే.. తెలంగాణ ఆదాయంలో ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల నగదు పెరుగుదల ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత ఆదాయం లేదు. ఇంత డబ్బున్నప్పుడు పేదరికమెందుకుండాలె? ఇక్కడ వృత్తి పనివాళ్లు ఎందుకు చిన్నబోవాలె? అలా ఉండటానికి వీల్లేదు. అదే దిశగా కార్యచరణ చేపడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అవగాహన వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలతో అద్భుతంగా పురోగమిస్తాం. ఎర్రవల్లి ఆదర్శం నోట్ల రద్దు తర్వాత నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే.. అక్కడ ప్రజలు రూ.75 లక్షలు డిపాజిట్ చేశారు. ఇంత డబ్బు ఎక్కడిదని ఒక ముసలావిడను నేను అడిగినా.. ‘పించన్ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తలేం.. దాచుకుంటున్నాం..’అని నాతో చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ఆదాయం విస్తరిస్తే.. అన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అందరికీ పని దొరుకుతుంది. డబ్బు సర్క్యులేట్ అవుతుంది. ఇది గ్రామ సంపద. గామీణ వృత్తులు.. గ్రామీణ ఆదాయం పెరిగితే ప్రతి గ్రామం ధనిక గ్రామం అవుతుంది. ఆపదలు ఎదుర్కొనే స్తోమత సమకూరుతుంది. -
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు రాగా, తాజాగా ‘బంగారు తెలంగాణ’ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. బిపిన్ , రమ్య జంటగా బిపిన్ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై డా. లయన్ ఏవీ స్వామి నిర్మించి, కీలక పాత్ర చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘1969లో వివేకవర్ధిని కళాశాలలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆమరణ నిరాహారదీక్షతో పాటు ఎంతో మంది ఉద్యమాలు చేయడంతో బంగారు తెలంగాణ సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే మా చిత్రం ఉంటుంది. ఇందులో నేను లాయర్ పాత్ర చేశా. కేసీఆర్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘బంగారు తెలంగాణ’ పాటలు, మార్చి రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, కో–ప్రొడ్యూసర్: కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, సమర్పణ: రమ్య. -
'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి'
హైదరాబాద్ : బంగారు తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, భరత్‌నగర్, బర్షిపేట ప్రాంతాలలో 29.80 లక్షల నిధులతో ఆట స్ధలం, భూగర్భ డ్రైనేజి పనులకు స్ధానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్‌తో కలసి ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కెజి టు పిజి, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎంపీ కొనియాడారు. -
సీఎం ఆలోచనలు ఆకాశంలో : చాడ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేల విడిచి సాము చేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం ఆలోచనలు ఆకాశంలో విహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు 7,8 స్థానాలు కూడా రావని ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచి, ప్రతిపక్షాలను కించపరిచారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలన తీరుతో బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. గురువారం పార్టీ నాయకుడు అజీజ్‌పాషాతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయ-వ్యయాలు, బడ్జెట్ వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలి బూటులో రాయి తీయలేని వారు ఏట్లో రాయి తీస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బడ్జెట్ ఫ్రీజింగ్‌తో బడుగు, బలహీనవర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోయిందన్నారు. అర్థరాత్రి నోటిఫికేషన్లతో ఆగమేఘాలపై కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. ఆగస్టు 20న నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం ఇచ్చిన అజెండాలో 27 జిల్లాలు, కొత్తగా 9 రెవెన్యూ మండలాలు, 29 రెవెన్యూ మండలాలను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే చివరకు 31 జిల్లాలతో పాటు కొత్తగా 25 రెవెన్యూ మండలాలు, 125 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొత్తగా కలిపిన 4 జిల్లాలకు సంబంధించి గతం నుంచి ప్రజా ఆందోళనలు, డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని, మళ్లీ వాటినే ఎలా పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటు బ్రహ్మాండంగా ఉందని మిమ్మల్ని మీరే అభినందించుకుంటే దానిని అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడంతో పాటు ప్రతిపక్షాలకు ఇచ్చిన మాటను కూడా సీఎం నిలబెట్టుకోలేదన్నారు. -
సీఎం.. మాటకు కట్టుబడి ఉండాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యమైతే, నిజంగానే రైతుల అభివృద్ధిని కోరుకుంటే ఇదివరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణలో రైతులు కోరిన పద్ధతిలో పరిహారం చెల్లించాలన్నారు. ఒక్క మల్లన్న సాగర్ వ్యవహారంలోనే కాకుండా, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరిపే ప్రతీ చోటా 2013 చట్టాన్ని అమలు చేసి నిరుపేదలకు ఆదుకోవాలని లేఖలో కోరారు. జీఓ 123 అమలు ద్వారా బడుగు, బలహీన వర్గాలను బలి ఇస్తామంటే సహకరించడానికి తాము సిద్ధంగా లేమని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
బూడిద తెలంగాణగా మారుస్తున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ అడ్డగోలు విధానాలతో బూడిద తెలంగాణగా మారుస్తున్నారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కోదండరాంను ఒంటరివాడిని చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం వల్ల యూజీసీ నిధులు రావడం లేదని, దీంతో వర్సిటీలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు రీడిజైన్ల పేరుతో పెంచిన నిధులలో సీఎం కేసీఆర్‌కు ఎన్ని ముడుపులు ముడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. -
కాళేశ్వరం.. దేశంలోనే అతిపెద్ద స్కాం
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి ఆరోపణ - రూ. 83 వేల కోట్ల ప్రజాధనం లూటీ - సీఎం కుటుంబీకులు దోచుకుంటున్నారు - దళారులు, దోపిడీదారులు, కాంట్రాక్టర్ల ముఠాకు ముఖ్యమంత్రే నాయకుడు - ప్రాజెక్టులకే లక్షల కోట్లు పెడితే సంక్షేమ పథకాలకు నిధులెక్కడ్నుంచి తెస్తారు? - మల్లన్నసాగర్లో సర్కారే దళారీలా మారింది - బంగారు తెలంగాణ కాదు.. తాగుబోతుల తెలంగాణ చేశారు: వీహెచ్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కాంగా మారబోతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ.26 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరుతో రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం చేపట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం నాయకత్వంలో దళారులు, దోపిడీదారులు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు ముఠాగా ఏర్పడ్డారు. దీనికి బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అని ముసుగేసుకున్నారు. భూ దందాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకే కొందరు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారు. రానున్న మూడేళ్ల కాలంలో ప్రాజెక్టులకు రూ.1.50 లక్షల కోట్లు, మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు వెచ్చిస్తే... పేదల డబుల్ బెడ్రూం ఇళ్లకు, దళితులకు మూడెకరాల భూమి పథకం, కేజీ టు పీజీ పథకం, ఇంటికో ఉద్యోగం వంటి వాటికి నిధులెక్కడ్నుంచి తెస్తారో చెప్పాలి’’ అని భట్టి డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ సేకరణ చేయడం లేదని, దళారీగా మారి భూములు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. నిర్వాసితులకు జీవో 123 ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంతో పక్క రాష్ట్రాల్లో ప్రకటనలా?: వీహెచ్ బంగారు తెలంగాణగా మారుస్తామంటున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు దుయ్యబట్టారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాల పత్రికలకు ప్రకటనలిచ్చి గొప్పలు పోతున్నారని విమర్శించారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. నాలుగు గ్రామాల రైతులపై నాలుగు వేల గ్రామాలను ఏకం చేస్తామని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. ఆయన రైతుల మధ్య కోట్లాట పెడుతున్నారన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించి, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఆక్టోపస్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ మంత్రి సబిత అన్నారు. -
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన మున్నూరు కాపులు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటారని పలువురు నేతలు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల ఎంపీగా ఎన్నికైన డి.శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంపీ కె. కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాకుండా వేరే ఎవరు ఆ స్థానంలో ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, కేసీఆర్ కాకుండా మరెవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ అభివృద్ధి చెందేది కాదని అన్నారు. వెనుకబడ్డ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎంకు మున్నూరు కాపులు అండగా నిలవాలన్నా రు. జోగు రామన్న మాట్లాడుతూ మున్నూరు కాపులకు గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?..
హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో పోలీస్ రాజ్యం నడుస్తోందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడిమా సమావేశంలో మాట్లాడుతూ....'బంగారు తెలంగాణ అంటే ఇదేనా?. నిర్వాసితులకు ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలి. రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రజలను ముంచుతున్నారు. చట్టప్రకారం భూ సేకరణ జరపాలి. లేకుంటే నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తాం' అని తెలిపారు. కాగా మెదక్ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు భూసేకరణ కోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి… దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మలేషియా: కోలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ లో మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారుల తోపాటు భారీ సంఖ్యలో తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సంబరాల్లో భాగంగా మైట సభ్యులు కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని లోటస్ ఈ రేమిట్ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదమ్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోప్పరిస్ సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు స్టాలిన్, హజారి శ్రీధర్, కృష్ణవర్మ, బురెడ్డి మోహన్ రెడ్డి, అమర్నాధ్, చిట్టి, రవీందర్ రెడ్డి, రఘు, శాంతి, రవి చంద్ర , అజయ్, కార్తీక్, రవివర్మ, ఏబినిజేర్, లక్ష్మికాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైట ఈ సంవత్సరానికీగాను క్రింది నూతన కార్యవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటించింది. ప్రెసిడెంట్ : సైదమ్ తిరుపతి వైస్ ప్రెసిడెంట్: సోపరిస్ సత్య సెక్రటరీ: రవి వర్మ జాయింట్ సెక్రటరీ: చిట్టి కోశాధికారి: రఘుపాల్ ముఖ్య కార్యవర్గ సభ్యులు: రవీందర్ రెడ్డి, బురెడ్డి మోహన్ రెడ్డి, రవిచంద్ర, కృష్ణ వర్మ యూత్ ప్రెసిడెంట్ : స్టాలిన్ యూత్ వైస్ ప్రెసిడెంట్: చందు ఈవెంట్: ప్రభాకర్, శ్రీకాంత్, రమణ ,శివ, కృష్ణ వర్మ, రవి, అజయ్ రావు, శ్రీనివాస్, రంజిత్, వేణు గోపాల్, శశిధర్, కిరణ్ గౌడ్, అజయ్ కుమార్ ఉమెన్స్ ప్రెసిడెంట్ : కిరణ్మ్యి అడ్వైజరీ కమిటీ చైర్మెన్: ఎబ్బినిజేర్ అడ్వైజరీ కమిటీ : అమరనాథ్, అశోక్, సురేష్, శాంతి ప్రియ, శ్రీధర్ హజారి -
బంగారు తెలంగాణకు బలమైన పునాది
► రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ► ప్రజలందరినీ వికాసపు దారుల వైపు నడిపిస్తాం ► అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన కాదు ► ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి ► పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడతాం ► దసరా నుంచే కొత్త జిల్లాలు ► ఇక కరెంటు కోతలు ఉండవు.. త్వరలోనే సాగుకు 9 గంటల విద్యుత్ ► ప్రాజెక్టులకు ఏపీ మోకాలడ్డుతోంది.. ఎవరి ఆటలూ సాగనివ్వం ► కోటి ఎకరాలకు నీరిచ్చేలా 2022 నాటికి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం ► వందశాతం అక్షరాస్యతను సవాలుగా స్వీకరించాం సాక్షి, హైదరాబాద్ కొత్త రాష్ట్రానికి ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరతరాల వారి భవిష్యత్తు అంత ఉజ్జ్వలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. మనిషి జీవితకాలం పెరగాలి. కడుపు నిండా తిండి, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యోగ్యమైన నివాసం, పరిశుభ్రమైన పరిసరాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం.. ఇవే నిజమైన మానవాభివృద్ధి సూచికలు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చెప్పినట్లు మానవాభివృద్ధికి నిధులు వెచ్చించకుండా సాధించే ఆర్థిక వృద్ధి అస్థిరమైనది.. అనైతికమైనది...’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. ‘‘ప్రజా బలంతో అజేయంగా పురోగమిస్తాం. అన్ని వర్గాల ప్రజలను వికాసపు దారుల వైపు నడిపించి తీరుతాం.. బంగారు తెలంగాణకు అర్థం పరమార్థం అదే....’’ అని ఉద్ఘాటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించే పనులు చేస్తున్నాం. సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. రాబోయే నాలుగైదేళ్లలో వీటికి నిర్వహణ వ్యయం తప్ప నిర్మాణ వ్యయం ఉండదు. ప్రాజెక్టులతోపాటు మేజర్ పనులు పూర్తవుతాయి. రాష్ట్ర ఆదాయం పెద్దఎత్తున పెరుగుతుంది. అప్పుడు పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం. పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడతాం. ఆ మూడు అంశాలే కొత్త జిల్లాలకు గీటురాళ్లు దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు కొలువుదీరుతాయి. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా 14–15 జిల్లాల ఏర్పాటు అవసరమవుతుందని భావిస్తున్నాం. జిల్లాల ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలన సౌలభ్యం అనే మూడు అంశాలు గీటురాయిగా జిల్లాల ఏర్పాటు జరగాలని నిర్ణయించాం. 598 అమరుల కుటుంబీకులకు ఉద్యోగాలు అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాం. రెండేళ్లలో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తాం. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తెలంగాణలో జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా చోట్ల నిర్మిస్తాం. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా.. దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ.. ఇలా సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ త్వరలోనే వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అయిదో నెల నుంచే కోతల్లేని విద్యుత్ అందించాం. ఇక కరెంటు కోత ఉండదు. రాబోయే మూడేళ్లలో కొత్త విద్యుత్ ప్లాంట్ల ద్వారా 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తాం. వచ్చే ఏడాది చివరి నాటికి 90 శాతం గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో నీరందిస్తాం. ఎవరి ఆటలు సాగనివ్వం కృష్ణా గోదావరిలో మన వాటాలో చుక్కనీటిని కూడా వదిలే సమస్య లేదు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు మహారాష్ట్ర, కృష్ణాపై తలపెట్టిన ప్రాజెక్టులకు కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఎవరి ఆటలు సాగనివ్వం. కోటి ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టులు రీడిజైన్ చేశాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయి. 2022 వరకు ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఖరీఫ్ నుంచే ఆయకట్టుకు నీరు ఖరీఫ్‌లో కల్వకుర్తి ద్వారా 1.5 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షలు, బీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌లోని కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా 25 వేల ఎకరాలు, నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి కొమురం భీమ్, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టును ఈ ఆగస్టు నాటికే పూర్తి చేసి పాలేరు, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలను సస్యశ్యామలం చేస్తాం. కరీంనగర్ మిడ్‌మానేరులో ఈ వర్షాకాలంలో మూడు టీఎంసీలు నిల్వ చేసి ఎల్ఎండీ ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని వదులుతాం. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం. దీంతో హైదరాబాద్ మంచినీటికి ఢోకా ఉండదు. ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టులో 30 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందిస్తాం. మంథని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా పది వేల ఎకరాలకు నీరందుతోంది. మెదక్‌లో సింగూరు ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు, ఘన్పూర్ ఆనకట్ట ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మిషన్ కాకతీయ తొలి దశలో ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరించాం. రెండో దశలో మరో 9 వేల చెరువుల పనులు చేస్తున్నాం. సిటీ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తవుతోంది. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్ మీదుగా మరో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించే ప్రణాళిక సిద్ధం చేశాం. అసైన్డ్ ల్యాండ్ డెవలప్మెంట్కు కార్పొరేషన్ అసైన్డ్ భూముల పంపిణీ ప్రహసనంగా మారింది. 25 లక్షల ఎకరాలు పంచినట్లు రికార్డులున్నా అవన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు. అసైన్డ్ భూముల నిగ్గు తేల్చడానికి సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అన్యాక్రాంతమైనవి స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి పంచి పెట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. వీటిని సాగుకు యోగ్యంగా మార్చేందుకు అసైన్డ్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. జూలైలో హరితహరం వానలు వాపస్ రావాలే.. కోతులు వాపస్ పోవాలె.. అనే నినాదంతో ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున 40 కోట్ల మొక్కలు నాటుతాం. హైదరాబాద్‌లో మరో 10 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చని తెలంగాణ సాధిద్దాం. వచ్చే జూలైలో జరిగే హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఉద్యమస్ఫూర్తితో విరివిగా మొక్కలు నాటాలి. బక్క రైతులకు బంగారు కానుక రైతుల ఇబ్బందులు తొలిగించేలా భూపరిపాలనలో సంస్కరణలు తెస్తున్నాం. సాదా బైనామాలపై జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించాం. సాదాబైనామాలపై గ్రామాల్లో ఐదెకరాల లోపు జరిగిన లావాదేవీలకు ఆర్వోఆర్ చేస్తాం. ఈ రోజు(జూన్ 2) నుంచి పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. వారసత్వంగా వచ్చిన భూముల మ్యుటేషన్ పది రోజుల్లో, రిజిస్ట్రేషన్ అయిన భూముల మ్యుటేషన్ 15 రోజుల్లో చేసే విధానం అమలు చేస్తాం. చిన్న కమతాలన్నీ ఒకేచోట చేర్చేందుకు కమతాల ఏకీకరణ కార్యక్రమం చేపడతాం. అక్షరాస్యతను సవాలుగా స్వీకరిస్తాం అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశ సగటు 72 శాతమయితే.. తెలంగాణలో 67 శాతమే ఉంది. వంద శాతం అక్షరాస్యత సాధించడాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుంది. ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70.. వీటిలో 30 రెసిడెన్షియల్ కాలేజీలతోపాటు మొత్తం 250 రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం. అద్దంలా రోడ్లు.. ఆరోగ్యంగా ఆసుపత్రులు.. సమగ్ర రహదారుల విధానంతో రెండేళ్లలోనే రహదారులు బాగుపడ్డాయి. రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలోని రోడ్లను అద్దంలా నిర్మిస్తున్నాం. హాస్పిటళ్లలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సీటీ స్కాన్, ఎంఆర్ఐ, మామ్మోగ్రామ్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరికరాలను సమకూరుస్తున్నాం. చికిత్స పొందుతూ మరణించిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించిన గుడుంబా తయారీని అరికట్టాం. గుడుంబా తయారీ దారులను శిక్షించడమే కాకుండా వారికి జీవనోపాధి మార్గం చూపించడంపై దృష్టి సారించాం. క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలు నూతన పారిశ్రామిక విధానానికి విశేష స్పందన వచ్చింది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి క్యూ కడుతున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్‌బ్యాంక్ మన దగ్గర ఉంది. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. అనతి కాలంలోనే 1,300 యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత ఏడాది ఐటీ సేవల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. -
మా పాలనకు ప్రజామోదం
- పాలేరు ఫలితంపై సీఎం కేసీఆర్ - పార్టీలన్నీ ముఠా కట్టినా ప్రజలు మమ్మల్నే ఆశీర్వదించారు - బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం సాక్షి, హైదరాబాద్: ‘‘పాలేరు ఉప ఎన్నిక ఫలితం ప్రజలు ఆషామాషీగా ఇచ్చిన తీర్పు కాదు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలనను పరిశీలించి, సమీక్షించి... మా విధానాలు కరెక్టంటూ వారు తెలిపిన ఆమోదం (ఎండార్స్మెంట్). ఇది మా పాలనకు ప్రజల ఆమోదం. మేమిదే పద్ధతిలో పనిచేయాలని, మీ వెంట మేమున్నామని.. ప్రజలు తేల్చి చెప్పారు. వారిచ్చిన ఈ అపురూపమైన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, ఆరోపణలు మాని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పాలేరులో టీఆర్ఎస్ రికార్డు మెజారిటీతో అపురూపమైన విజయం సాధించింది.నియోజకవర్గ చరిత్రలో 1972లో వచ్చిన 25,452 ఓట్ల మెజారిటీ యే ఇప్పటిదాకా అత్యధికం. మా పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పుడు ఏకంగా 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ సాధించారు. విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు. విజేతకు, విజయానికి పాటుపడ్డ పార్టీ శ్రేణులుకు అభినందనలు తెలిపారు. ఈ విజయం మరింత బాధ్యత పెంచిందన్న సీఎం, పొగరుకు పోవద్దని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘ప్రజలు టీఆర్ఎస్ను ఏకపక్షంగా గెలిపిస్తున్నరు. బ్రహ్మరథం పడుతున్నరు. ఈ ఫలితం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం. నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వి. ఉప ఎన్నికల్లో వారి అభ్యర్థుల పట్ల సానుభూతి ఉండాలి. అయినా దాన్ని కూడా పక్కనపెట్టారు. సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అసాధారణ తీర్పు ఇచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే 24 రెట్లు ఓట్లు పెరిగాయి. దీన్ని ప్రజలిచ్చిన ప్రోగ్రెస్ రికార్డుగా భావిస్తున్నాం. వారు కోరుకున్న విధంగా ముందుకు పోతాం’’ అని స్పష్టం చేశారు. విపక్షాలు ఇప్పటికైనా అవాకులు, చవాకులు పేలడం మానాలని సూచించారు. ఇలాంటి మాటల వల్ల వారి గౌరవంతో పాటు ప్రజల గౌరవం కూడా పోతోందన్నారు. తాము పూర్తి అవినీతిరహితంగా, పైరవీకారులకు అవకాశం లేకుండా పని చేస్తున్నామన్నారు. ప్రజల తీర్పునూ అవమానిస్తరా? విపక్షాల తీరుపై సీఎం ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మా పార్టీ అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయిన ఐదో రోజు నుంచే ఎవరికి వారుగా, సమూహంగా అర్ధసత్యాలతో ఆరోపణలు చేస్తున్నరు. తెలంగాణలో అవినీతిరహిత పాలన సాగుతోందని ప్రధాని సహా వివిధ సంస్థలు, అధికారులు కితాబిచ్చారు. విపక్షాలు మాత్రం ఉన్మాద దాడికి దిగుతున్నయి. అవినీతి జరుగుతోందంటరు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటరు. వ్యక్తిగత దాడికి దిగుతున్నరు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నరు’’ అంటూ విమర్శించారు. విపక్షాల ఆరోపణల్లో పసలేద న్నారు. చివరకు ప్రజల తీర్పునూ అవమానిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పాలేరు ఫలితంతోనైనా వారికి కనువిప్పు కలగాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసిందని, కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులపైనా ఆరోపణలు చేసిందని, చివరకు ఓటింగ్ యంత్రాలను కూడా వివాదాస్పదంచేసిందని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ అధికారిగా ఎన్నికల సంఘమే ప్రకటించిన లోకేశ్‌కుమార్ వంటి ఐఎఎస్ అధికారినీ శంకించారని, ఈ తీర్పు తర్వాత వారేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సిద్ధాంతాలు గాలికొదిలారు... అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు సిద్ధాంతాలను గాలికొదిలి మహాకూటమి కట్టారని, అన్ని పార్టీలూ కలసి పోటీ చేసినా టీఆర్ఎస్ ఏకంగా 20 వార్డులు గెలుచుకుందని సీఎం అన్నారు. పాలేరులోనూ ఇలాగే ముఠా కట్టారని ఆరోపించారు. అయినా కాంగ్రెస్‌కు అక్కడ గతంలో వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారని, గుడ్డిగా కాకుండా ఆలోచించి ఓటేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఇంకా 1947 నాటి పాలిటిక్స్ చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటమేమిటి, హాస్యాస్పదం కాకపోతే! ప్రజా సమస్యలపై పోరాడండి. పంథా మార్చుకోండి’’ అని సూచించారు. రెండేళ్ల కాలంలో ఏడాది పాటు అధికారులే లేరు. విడిపోయిన ఏపీ సమస్యలు సృష్టిస్తూనే ఉంది. అనేక సమస్యలున్నాయి. ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదు. కొందరు వారి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నరు. చంద్రబాబు ఢిలీల్లో మాట్లాడుతూ, రూ.60వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను వదులుకున్నామన్నడు. అంత ఆదాయమెక్కడిది? ఈసారి రాష్ట్ర బడ్జెట్లో కమర్షియల్ ట్యాక్సు ద్వారా రాష్ట్రమంతటా కలిపి విధించుకున్న పన్నుల వసూలు లక్ష్యమే రూ.42 వేల కోట్లు! ఇలాంటి అబద్ధాలు, అసత్యాల మీద రాజకీయాలు నడిచే కాలం పోయిం ది. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉంటే వారి మద్దతుంటది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వరుసగా గెలిచారు. మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో సీఎంలు రెండోసారి గెలిచారు. మంచి పని చేస్తే ప్రజలు హత్తుకుంటున్నరు’ అని సీఎం పేర్కొన్నారు. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం రాష్ట్రంలో ఏమీ జరుగుతలేదని విపక్ష నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. ‘‘సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఉన్నం. మంత్రుల పేషీల దగ్గర ఎదురు చూపుల్లేకుండా, పైరవీలు, లంచాలు లేకుండా నిర్ణీత వ్యవధిలోనే 1,700 పరిశ్రమలకు టిఎస్ఐపాస్ ద్వారా అనుమతులిచ్చినం. అమెజాన్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాల రెండో అతిపెద్ద క్యాంపస్‌లు మన రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి. రాష్ట్రానికి ఫేస్బుక్ వచ్చింది. యాపిల్ వచ్చింది. ఈ ఏడాది రూ.68 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులతో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. మంచి పనులను అభినందించండి. నిర్మాణాత్మక సూచనలు చేయండి. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నం. మీ వ్యూహాలు మార్చుకోండి’’ అని సూచించారు. విపక్షాలు నిర్మాణాత్మక పంథాలోకి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. లక్ష్మణ్ది కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందం కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ‘‘కేంద్రం కరువు నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపిస్తున్నరు. మరి తెలిసి మాట్లాడుతున్నరో, తెలియకనో అర్థం కావడం లేదు. కేంద్రం ఇచ్చింది కేవలం రూ.74 కోట్లే. రాష్ట్రం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇన్పుట్ సబ్సిడీ రూ.1,300 కోట్లు కావాలని కోరాం. కరువు సాయం పెంచాలని ప్రధానిని కోరాం. కరువు నుంచి శాశ్వతంగా బయట పడటానికి చేపట్టిన మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ పథకాలకు సహకరించాలని, ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. లక్ష్మణ్‌కు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సోయి ఉంటే రాష్ట్రానికి ఒక్కటన్నా కేంద్ర పథకం సాధించుకురావాలి. ఏమైతరో, ఏం పోతరో కానీ, 2019లో తామే ప్రత్యామ్నాయమంటున్నరు. మాపై విషం చిమ్ముతున్నరు’’ అంటూ దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలపై పరువు నష్టం దావా ‘మా ప్రభుత్వంపై ఇన్నాళ్లూ లేనిపోని ఆరోపణలు చేశారు. అవాకులు చవాకులు పేలారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు, నిందలు మానుకోవాలి. ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం కానీ, ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటం. అనవసర విమర్శలు, వెకిలి ఆరోపణలు చేస్తే కేసులు పెడతం. పరువు నష్టం దావా వేస్తం. అవినీతి ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ప్రయత్నిం చి పట్టుబడింది ఎవరో ప్రజలకు తెలుసు. అరకిరా పనులు చేసి అవాకులు, చవాకులు పేలితే బా గుండదు’ అంటూ విపక్షాలను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. -
రూ.1.10 లక్షల కోట్లతో బడ్జెట్
* సుదీర్ఘంగా కసరత్తు చేశాం: సీఎం కేసీఆర్ * టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేరిక సందర్భంగా రాజేంద్రనగర్‌లో భారీ బహిరంగ సభ * రాజకీయ ఏకీకరణ ద్వారా బంగారు తెలంగాణ * అందుకే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నాం హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండబోవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మార్చి 31 నుంచి తెలుపు రేషన్ కార్డున్న పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని, బీసీలు, ఓసీ వర్గాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 2016-17 వార్షిక బడ్జెట్‌ను రూ. 1.10లక్షల కోట్లతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా శుక్రవారంరాత్రి 7 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడం, అన్ని పార్టీల రాజకీయ నేతలను కలుపుకొని వెళ్లి బంగారు తెలంగాణ నిర్మించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామన్నారు. ఇండియా టుడే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని తేల్చిందని, ఇదంతా తెలంగాణ ప్రజల గెలుపు మాత్రమేనని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఏదైనా హామీ ఇస్తే అది కచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పేదలున్నా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహిస్తానని, సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లో ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా అవసరమైన గ్రామాల్లోనే 111 నంబర్ జీవో అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్‌పై పదిహేను రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశామని, రూ.1.10 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్-రంగారెడ్డి త్వరలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బడ్జెట్లో తెలంగాణకు 50 శాతం కేటాయింపులు చూపేవారని, కానీ పదిశాతమే వాస్తవంగా కేటాయించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. వెటర్నరీ విద్యార్థుల ఆందోళన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో చివరన ఉన్న వెటర్నరీ కళాశాల విద్యార్థులు తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ బ్యానర్ ప్రదర్శించి, నినాదాలు చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. సభలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే యాద య్య, సంజీవరావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు. -
అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: అధికారులు అహం వీడి పనిచేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు సత్వర సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలకం కావాలన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం నూతన డైరీ-2016ని మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ‘గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని జనం మా వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే వెబ్‌ల్యాండ్ ద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే బంగారు తెలంగాణ
కేసీఆర్ కుటుంబమే తప్ప.. ఎవరూ సంతోషంగా లేరు : కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఇది రుజువవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ నేతలకు పూనకం వస్తుందని, నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ఇష్టం వచ్చిన హామీలివ్వడం, ప్రజలను విభజించడానికి రెచ్చగొట్టేలా మాట్లాడటం టీఆర్ఎస్ నేతలకు అలవాటు అని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబమే తప్ప.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేస్తున్నదని, సచివాలయాన్ని తెలంగాణభవన్గా మార్చిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక స్తోమత లేనివారు ప్రచారం చేసుకోవడానికి కూడా టీఆర్ఎస్ నేతలు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామనే ధైర్యంలేక మున్సిపల్ చట్టానికి సవరణలు చేస్తూ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని కిషన్‌రెడ్డి విమర్శించారు. డ్రైపోర్టు, విశ్వవిద్యాలయాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, విద్యుత్‌ప్లాంట్లు, జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 41 వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ ప్రకటన చేయడం ద్వారా.. కేంద్రం లోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందనే విషయం రుజువవుతోందన్నారు. ఈ నెల 7న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఉద్యానవన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ వస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. -
విరక్తి గానం
వెలుగులోకి వచ్చామనే భ్రమే తప్ప ఎటు పోతున్నామో తెలియని చీకట్లు అలుముకున్న మాట నిజం! నిజంగా మనం ఎటుపోతున్నాం? బంగారు తెలంగాణ బాట ఎప్పుడో తప్పింది స్వచ్ఛభారత్ తీయటి నినాదంగా మారింది అమరావతి.. అమీరులకే కానీ మనకోసం కాదని తేలిపోయింది మొత్తం మీద జనం కీకారణ్యంలో చిక్కుకున్నారు జంతువుల మధ్య రాత్రి మధ్య భయంకర నినాదాల మధ్య తుఫాను నిశ్శబ్దం మధ్య ఒక చేతికి బెత్తమిస్తే కొంత ఊరటగా ఉంటుందని కొంత బెదిరింపు కొంత ఆదరింపు జాతిని కొత్త దారిలోకి నెట్టుతుందని జనంలో ఎన్నో ఆశలు - ప్రజాస్వామ్యంలో నియంతృత్వమెక్కడిదనే భ్రమ సంకీర్ణంలో ప్రశ్నలేదు జవాబు లేదని విరక్తి ఎన్నెన్నో ఆశలు అన్నీ ఆశలు నేలకూలి రాళ్ల దెబ్బలు మిగిలాయి శోకం కుప్ప మిగిలింది. సిహెచ్. మధు మొబైల్: 99494 86122 -
ఆహ్వానిస్తే వెళతాం: కేటీఆర్
హైదరాబాద్ : బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత నర్సింహ యాదవ్ బుధవారం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేశారని, అయితే విభజన జరిగి ఏడాది అయినా ఒక్క సంఘటన కూడా జరగలేదని, హైదారాబాద్‌లో శాంతిభద్రతలకు ఢోకా లేదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం వస్తే తప్పకుండా వెళ్లి ఆశీర్వదిస్తానని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను స్వయంగా ఆహ్వానిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. -
అనారోగ్యాలతో తెలంగాణ అల్లాడుతోంది
సాక్షి,హైదరాబాద్: ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆర్నెల్లలో బంగారు తెలంగాణ చేసి చూపెడతామన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా.. జ్వరం వస్తే రూ.ఐదారు లక్షల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. డబ్బులు లేని అట్టడుగువర్గాలకు చావే దిక్కవుతోంది. ప్రభుత్వ ముందుచూపు లోపం, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యాలతో తెలంగాణ అల్లాడుతోంది. ముఖ్యమంత్రి తక్షణం స్పందించాల్సిందే’నంటూ పీసీసీ ముఖ్యనేతలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్,బండారి రాజిరెడ్డి, క్యామ మల్లేశ్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డుల్లో పరిస్థితిని పరిశీలించారు. వైద్యులు,రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రోగులు తమకు మేలైన వైద్యం అందడం లేదని, పరీక్షల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, కొన్ని రకాల మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి,శ్రీశైలంగౌడ్‌లు విలేకరులతో మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించాలని లేనట్లయితే రాష్ట్రంలో డెంగీ,స్వైన్‌ఫ్లూతో సాధారణ జనం ఇబ్బందిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కేసీఆర్ పథకాలు ఇవేనా!
బంగారు తెలంగాణ కోసం కలగన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడు అంతా సంతోషించారు. తరువాత అర్థమైంది. నిజానికి ఆయన బంగారు తెలంగాణకు అసలు అర్థం వేరు. ‘కె’ అంటే కవిత, ‘సి’ అంటే చంద్రశేఖ రరావు, ‘ఆర్’ అంటే రామారావు. బంగారు తెలంగాణకు ఇవే సంకేతాక్షరాల య్యాయి. ఆయన పాలనంతా నియంతృత్వమే. ఏ ఒక్క మంత్రికీ స్వేచ్ఛ లేదు. ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఇక మహిళా సాధి కారత అనే మాటకు కేసీఆర్ రాజ్యంలో సార్థకత ఎక్కడ ఉంది? సమగ్ర సర్వే అన్నారు. అది కూడా సగం సగమే. మన ఊరు మన ప్రణాళిక అన్నారు. ఏమీ ఒరగలేదు. మిషన్ కాకతీయ అన్నారు. కమీషన్లు కార్యకర్తల కర్త వ్యంగా మార్చేశారు. ఆహార భద్రత కార్డులని చెప్పారు. హరితహారం అన్నారు. ఇదంతా హంగామాగా మిగిలిపోతోంది. కల్యాణలక్ష్మి పథకం అన్నారు. బంగారుతల్లులను మరచిపోయారు. ఆసరా పథకం అంటూనే అసలుకే ఎసరు పెట్టారు. డబుల్ బెడ్రూం ఇళ్లన్నారు. వాటి చిరునామాయే లేదు. రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. వారికి అదీ ఒరగలేదు. సరి కదా, కార్పొరేట్లకు రాయితీలు కురిపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, హోం గార్డులకు, ఔట్సోర్సింగ్ వారికి వేతనాలు లేవన్నారు. జెడ్పీ చైర్మన్ల జీతాలు మాత్రం లక్ష రూపాయలు చేశారు. ఇదంతా చూస్తే బంగారు తెలంగాణ అం టేనే భయపడే రీతిలో ఉంది. కాబట్టి కొత్త రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దితే అదే పదివేలు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే గుర్తించాలి. మలపరాజు అనిత బమ్మెర, వరంగల్ జిల్లా -
'పంచె కట్టినంత మాత్రాన ఆయన రైతు అవుతాడా?'
కరీంనగర్(రాయకల్): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ డ్డి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా సార్తవాయి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగరాజం కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతిష్ట ఎక్కడ మసకబారుతుందోనని కరవు మండలాలను ప్రకటించడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రహోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 17 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాననని చెప్పి ఆత్మహత్యల తెలంగాణాగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. -
ఇలా చేస్తేనే బంగారు తెలంగాణ
జగద్గిరిగుట్ట: ప్రభుత్వాధినేతలు పదేపదే చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిపోవాలంటే తమ ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనన్నారు ఐద్వా నాయకురాళ్లు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్‌లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించడంతోపాటు మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నివారించగలిగినప్పుడే బంగారు తెలంగాణ వైపు అడుగులు పడినట్లని స్వరాజ్యం అన్నారు. మద్యం మహమ్మారిని తరిమేందుకు, మహిళలపై దాడులను నియంత్రించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవరపల్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కనీసం అక్కడయినా జ్ఞానం తెచ్చుకుని ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటున్నారని ఆవేదన చెందారు. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు కొత్తగా చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలల హక్కుల ఉద్యమకారిణి శాంతాసిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఇందిర, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి సహా పలువురు మహిళలు హాజరయ్యారు. -
బంగారు తెలంగాణ కల సాకారం చేద్దాం
- ఆ కల సర్పంచ్లతోనే సాధ్యం - ఆన్లైన్లో జీపీ నిధుల వివరాలు - గ్రామీణాభివృద్ధి శాఖప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ - ఘనంగా సర్పంచ్ల సంఘం ద్వితీయ వార్షికోత్సవం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీఎం కలలు కంటున్న బంగారు తె లంగాణ గ్రామ సర్పంచ్లతోనే సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అన్నారు. హరితహారం కార్యక్ర మం వారి సహకారంతోనే విజయవంతమైందని కితాబిచ్చారు. సర్పంచ్ల 21 స మస్యలను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. స్థా నిక బృందావన్‌గార్డెన్‌లో ఆదివారం స ర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంఘం ద్వితీయ వార్షికోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ రాజ్యం బలపడాలని సీఎం భావిస్తున్నట్లు చె ప్పారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. పంచాయతీలకు నిధుల వివరాలను ఇకనుంచి ఆన్లైన్లో పొందుపరుస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. రా ష్ట్రంలోని 5,700 గ్రామాలను క్లస్టర్లుగా గు ర్తించి వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చే యనున్నట్లు చెప్పారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవంతం చేయాలని సర్పంచ్‌లను కోరారు. గ్రామాలకు పేరు తేవాలి ప్రతి సర్పంచ్ తమ గ్రామపంచాయతీని ఉత్తమగ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రాం చంద్రన్ కోరారు. సర్పంచ్‌లు తమ విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 92శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని అభినందించారు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. సీఎం సహాయనిధికి విరాళం సర్పంచ్‌లకు పెరిగిన ఒకనెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి ప్రకటించారు. సర్పంచ్ సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా ప్ర ధాన కార్యదర్శులు మోదిపూర్ రవి, వెం కట్స్వామి, వెంకటేశ్వర్లుగౌడ్ పాల్గొన్నారు. -
‘తలసాని’ రాజీనామాపై మల్లగుల్లాలు!
రాజీనామా లేఖ అందలేదన్న అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఇరకాటంలో అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ప్రజల్లో పలుచనవుతామని శ్రేణుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ‘బంగారు తెలంగాణ’.. ‘తెలంగాణ పునర్నిర్మాణం’ నినాదాలతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలను టీఆర్ఎస్ తన గూటికి చేర్చుకుంది. వలస వచ్చిన నేతలకు పదవులూ కట్టబెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇదే తరహాలో గులాబీ గూటికి చేరారు. అందరిలా ఆయన కూడా ఎమ్మెల్యేగా కొనసాగి ఉంటే అధికార పార్టీ ఇరుకున పడేది కాదు. కానీ తలసానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఇప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు తలసాని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా లేఖను చూపించారు. ఆ లేఖను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ తన రాజీ నామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పేవారు. కానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక సమాచారం మేరకు అసలు తలసాని ఎలాంటి రాజీ నామా లేఖ రాయలేదని తేలింది. ఈ మేర కు శాసనసభ కార్యదర్శి కార్యాలయం త మకు తలసాని లేఖ అందలేదని ప్రకటిం చింది. దీంతో తలసానితో పాటు, ఆయనను చేర్చుకుని అందలం ఎక్కించిన టీఆర్ఎస్ కూ డా ఇరుకునపడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తలసాని లక్ష్యంగానే విపక్షాలు అధికార పార్టీపై ధ్వజమెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మం త్రివర్గంలో ఎలా కొనసాగుతారని నిలదీశాయి. అయినా, అధికార పార్టీ పెద్దల నుంచి స్పందన లేకుండా పోయింది. ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు హైదరాబాద్‌లో విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికి సైతం ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా స్పీకర్‌తో తలసాని రాజీనామా ఆమోదంపై మాట్లాడారని, దీనిపై త్వరలో ని ర్ణయం వెలువడకుంటే, తానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ పేర్కొన్నారని సమాచారం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. తలసాని అసలు రాజీనామా చేయలేదని తేలడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ విమర్శలకు మరింత పదును పెట్టాయి. గవర్నర్, స్పీకర్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తలసాని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్ఎస్ నాయకత్వానికి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నా రు. దీనిపై నిర్ణయం ఆలస్యమయ్యేకొద్దీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరగడంతో పాటు.. ప్రజల్లో పలుచనైపోతామన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో అధి నేత కేసీఆర్ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తలసాని విషయంలో వీలైనంత త్వరలోనే ఏదో ఒక చర్య తప్పక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. ఆమోదింపజేసి సనత్‌నగర్‌లో ఉపఎన్నికకు వెళతారా? లేక తాత్కాలికంగా ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? అన్నదానిపైనే నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?
హైదరాబాద్ : వేతనాలు పెంపుతో పాటు, తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ అంటే ఇదేనా, పంతానికి వెళ్లి.. కార్మికులను చర్చలకు కూడా పిలవరా...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, తన కుమారుడు వద్ద ఉన్న శాఖల్లోనే ఇంత నిర్లక్ష్యమా అని వారు ధ్వజమెత్తారు. కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. -
ఉన్నత విద్యతోనే బంగారు తెలంగాణ
- వీసీలను, పాలక మండలి సభ్యులను నియమించాలి - ఓయూ ప్రొఫెసర్ల ధర్నాలో ప్రొ.కోదండరామ్ హైదరాబాద్: ఉన్నత విద్య అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజకీయ జేఏసీ చైర్మన్, ఓయూ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఎఫ్‌యూటీఏ) పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పాలనా భవనాల ఎదుట అధ్యాపకులు ధర్నా చేశారు. ఓయూ పాలనాభవనం ప్రవేశ ద్వారం ఎదుట ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇందులో ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో ఉన్నత విద్యకు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పర్యావరణ వేత్త ప్రొ.పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి ఓయూలోనే బీజాలు పడ్డాయని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ముందుకు నడిపింది తొలుత వర్సిటీ అధ్యాపకులే అని అన్నారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ (ఐపీఎస్‌ఏ) అఖిల భారత అధ్యక్షులు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా వీసీలు లేకుండా మనుగడ సాగించడం ఓయూకే చెల్లిందని అన్నారు. ఎఫ్‌యూటీఏ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహర్ మాట్లాడుతూ వర్సిటీలకు రెగ్యులర్ వైస్ చాన్స్లర్లను, పాలక మండలి సభ్యులను నియమించాలని, అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించాలని అధ్యాపకులు చేస్తున్న ఆందోళనను సీఎం కేసీఆర్ పట్టించుకోకుంటే ఆందోళనను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.రవీంద్రనాథ్, ప్రొ.కృష్ణయ్య, ప్రొ.రాములు, ప్రొ.చెన్నకృష్ణారెడ్డి, ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొని ప్రసంగించారు. -
‘బీటీ’ బ్యాచ్‌తో గులాబీ నేతల బెంబేలు
గులాబీ దళంలో చేరిపోతున్న నాయకుల సంఖ్యను చూసి ఆ పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న నాయకులు బెంబేలు పడిపోతున్నారు. బంగారు తెలంగాణ కోసం వస్తున్నామంటున్న వీరందరికీ ‘బీటీ’ బ్యాచ్ అని పేరు ఇప్పటికే స్థిరపడిపోయింది. వీరి రాకవల్ల తమ అవకాశాలకు ఎక్కడ గండిపడుతుందో అన్న ఆందోళన వారిది. కాంగ్రెస్ నుంచి క్యూ కడుతున్న సీనియర్లలో కొందరికి రెడ్ సిగ్నల్ పడినా, మరికొందరికి మాత్రం రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. ‘సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేశాం. లెక్కకు మించి డబ్బులు ఖర్చు చేశాం. ఇంకా, అందివచ్చిన పదవే లేదు. ఇపుడు కొత్తగా పార్టీ గడప తొక్కుతున్న వారికి మాత్రం పిలిచి పీటేస్తున్నారు. మరి మా గతేం కాను!’ అంటూ వీరంతా మథనపడుతున్నారు. పదవుల గోల ఒక్కటే కాదు, మరీ సీనియర్లను ఆహ్వానిస్తే, తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని ఇదై పోతున్న వారిలో ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇక ఎవరూ వద్దంటూ కొందరు పోరు పెడుతున్నా, వీరి మాటను చెవికి ఎక్కించుకునే వారే లేకుండా పోయారు. గులాబీ గూటిలో ఇపుడు అంతా పాత-కొత్తల గోల జోరుగా సాగుతోంది. -
'బంగారు తెలంగాణలో యువత ముందుండాలి'
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిముక్కల పద్మారావు అన్నారు. ఆదివారం మోతీనగర్ డివిజన్‌కు చెందిన పలువురు విద్యార్థి నాయకులు టీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆర్.రమేష్‌నాయక్ ఆధ్వర్యంలో పద్మారావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పద్మారావు వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో యువత ముందుండాలని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. -
బీటీ బ్యాచ్... ఆ ఐదుగురు వారే..!
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లోకి ఇటీవల కొత్తగా చేరిన పదం ‘బీటీ’ బ్యాచ్. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నమాట. తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ‘బంగారు తెలంగాణ’ కోసం గులాబీ గూటికి చేరిన బ్యాచ్ అన్నమాట. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను, ఆపార్టీ నేత కేసీఆర్‌ను దూషించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్ద మార్కులు కొట్టేసిన వారు... సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందని గంటలు భజాయించి మరీ చెప్పిన వారు... కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ‘బంగారు తెలంగాణ కోసం’ టీఆర్ఎస్లో చేరిన నేతలను ఎద్దేవా చేస్తూ పెట్టిన పేరు ఇది. టీఆర్ఎస్లో ఇప్పుడు బీటీ బ్యాచ్‌దే హవా. మంత్రి వర్గంలో కీలక పదవులు పొందిన నేతలు వారే! ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు పొందిన ఐదుగురు కూడా బీటీ బ్యాచే నని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న తుమ్మల, కడియం శ్రీహరిలను ఎమ్మెల్సీలుగా చేయడం తప్పనిసరి కావడంతో వారికి సీట్లిచ్చిన కేసీఆర్... కౌన్సిల్లో స్వామి గౌడ్ చెర్మైన్ కావడానికి పార్టీ మారిన మాజీ టీడీపీ నేత బి. వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డిలకు అవకాశం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల సమయంలో జిల్లాల వారీగా టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ఉద్యమ టీఆర్ఎస్ నేతలకు అప్పట్లో ఎమ్మెల్సీల ఆశ చూపిన కేసీఆర్ బీటీ బ్యాచ్‌కే అవకాశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఫిరాయింపుదారులతోనే బంగారు తెలంగాణా?
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారితోనే బంగారు తెలంగాణను నిర్మిస్తారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరుపై.. బీజేపీ శాసనసభాపక్ష నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వీ.ఎస్.ఎస్.ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు తదితరులతో కలిసి బుధవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమంతా చూస్తున్నదని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్.. నియంతృత్వం, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సీఎం స్వయంగా, అధికారికంగా పాల్గొంటున్నా ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదనేలా, అణిచివేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో చేరితేనే నిధులు, పనులు, అభివృద్ధి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ ఒక్కటే పోరాడిందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజల్లో ఓడిపోయినవారు, ప్రజలు ఛీకొట్టినవారే మంత్రులవుతున్నారని, వారికి ప్రొటోకాల్‌తోపాటు, ప్రజల సొమ్ముతో వారు విలాసాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఆ నియోజకవర్గంలో ఇళ్లు మంజూరుచేశారే తప్ప.. రాష్ట్రంలో మిగతాచోట్ల ఇవ్వలేదన్నారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గర సచివాలయం నిర్మిస్తామని చెప్పి.. ఇప్పుడేమో సికింద్రాబాద్‌లో సచివాలయం అంటూ రోజుకో కొత్త మాటతో ప్రజలను మోసం చేస్తున్నాడని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
బంగారు తెలంగాణలో నిరుద్యోగులకు ఏదీ భరోసా?
తోట రాజేష్ రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కో సం తీవ్ర నిరాశతో ఎదు రుచూస్తున్నారు. నిరుద్యో గుల కోసం ఎన్నికల ముందు కె.సి.ఆర్. హామీ ల వర్షం కురిపించాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి రాగానే కొలు వుల జాతర అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజ లకు హామీల వరాల జల్లులు కురిపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నిరుద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వా నికి అధికారం కట్టబెట్టారు. నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969 లోను, నిన్న పోరాడి సాధించుకున్న (2009) తెలంగాణ ఉద్యమం వరకు పోరాడింది తెలంగాణ విద్యార్థి యువకులే. చివరికి వారు ప్రాణాలు కూడా అర్పించారు. ఈ యువత తెలం గాణ ఉద్యమానికి ప్రాణవాయువు అయింది. తెలంగాణ ఉద్యమానికి భౌతిక పునాది నిరు ద్యోగ సమస్య. మా తెలంగాణ మాకు వస్తే, మా ఉద్యోగాలు మాకు వస్తాయని యువత భావించిం ది. ఉద్యమ సమయంలో రాజకీయ పక్షాలు యువ తకు పూర్తి భరోసా ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలోని వివక్షత, అన్యాయం, ఆకలి, ఆర్తనాదాలు ఇక ఉం డవు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ తాయని వారు అనడంతో తెలంగాణ విద్యార్థులకు నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు రేపటి తెలంగాణలో ఉం డరని మాట ఇచ్చాడు. దీనితో ఏళ్ల తరబడి గొడ్డు చాకిరి చేస్తున్న వయసు మీద పడినవారు కొత్త కలలు కన్నారు. సింగరేణి, మున్సిపాలిటీ ఇంకా ఇతర రంగాలలో ఉన్న వారు కూడా తమ జీవితా లకు కొత్త వెలుగులు వస్తాయని ఆశించారు. తెలంగాణ రాష్ట్రమంటే ఉద్యోగాల జాతర అన్న కేసీఆర్ నేటికీ వాటి ఊసెత్తడం లేదు. మరో 2 నెల లైతే ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. కాని ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పైగా టీపీటీఎస్పీ ఏర్పర్చినా ము ఇక నోటిఫికేషన్లే అన్నారు. తరువాత హరగోపా ల్తో కమిటీ వేశామన్నారు. హరగోపాల్ నెల రోజు లలోనే ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించి, త్వరగా ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని సూచించారు. తరువాత వివిధ రాష్ట్రాల ఉద్యోగ నియామకాల గురించి టీపీఎస్సీ అధ్యయనానికి మరికొన్ని రోజులు వాయిదా వేశారు. కొద్ది రోజుల కిందట గవ ర్నర్ ఆవిష్కరించిన ప్రభుత్వ ఉద్యోగ వెబ్‌సైట్‌ని లక్షా యాభై వేల మంది నిరుద్యోగులు వీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆశ తో ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు అసెంబ్లీ సమావేశాల్లో నిండు సభలో కేసీఆర్ లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఉన్నా యని చెప్పారు. కానీ ఆచరణలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కనీస ప్రయత్నం చేయడం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి స్థాయి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ఖాళీ పోస్టు కూడా ఉండకూడదు. ఈ చట్టాన్నీ తెలంగాణ ప్రభు త్వం లెక్కించే స్థితిలో లేదు. కాగా హేతుబద్ధీకరణ పేరుతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసే ప్రయ త్నం చేస్తున్నారు. పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోటు బడ్జెట్‌తోనే 3 నెలల క్రితమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభు త్వం డీఎస్సీ నోటిఫికేషన్‌తో దోబూచులాడుతోంది. విద్యారంగంలో అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు 17,000లకు పైనే ఉన్నాయని ప్రభుత్వమే చెబుతోంది. ఇవి కాక గ్రూప్1, గ్రూప్2 ఇంకా ఇతర ప్రభుత్వరంగాలలో కొన్ని వేలలో ఖాళీలు ఉన్నా యని ఆర్థికశాఖ లెక్క తీసింది. 17,000 ఉపాధ్యాయ పోస్టులకుగాను దాదాపుగా 5 లక్షల మంది ఉపాధ్యా య వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి ఎదురు చూస్తు న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగుల గురించి ఆలోచించడం మానేసి రాష్ట్రంలో ఉన్న నిరు ద్యోగుల గురించి ఆలోచించాలి. తెలంగాణలో నిరు ద్యోగులకు భరోసా లేకపోతే నిన్న జరిగిన పట్టభ ద్రుల ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు పునరావృతం అవు తుంది. ప్రభుత్వంచే ఉద్యోగ నియామకాల ప్రకటన వచ్చేంత వరకు తెలంగాణ నిరుద్యోగులు పోరాటం చేయక తప్పదు. వ్యాసకర్త ప్రగతిశీల యువజన సంఘం మొబైల్: 9440195160 -
కార్యకర్తలకు పదవుల హారం
సాక్షి, హైదరాబాద్: ‘ఈసారన్నా నన్ను విముక్తి చేస్తారేమో అనుకుంటే.. ప్రభుత్వం వచ్చినంక విడిచిపెడుతమన్నరు. మళ్లీ ఈసారి కూడా నన్నే పెట్టిండ్రు. మంచిది, సంతోషం. అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలే. అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. అనేక త్యాగాలు, నిర్బంధాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలతో తెలంగాణ సాకారమైంది. ఈ ఘనత అంతా టీఆర్ఎస్ కార్యకర్తలదే. ఇది చరిత్రలో సుస్థిరం. కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులు అంతా మీరే’ అని కేసీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలో సుదీర్ఘ ప్రసంగంలో ముందుగా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ అమరుల త్యాగాలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘సాంస్కృతిక సారథి వేదికపై రసమయి బాలకిషన్ ఏడ్చిండు. కళ్ల నీళ్లు పెట్టుకున్నాం. 14 ఏళ్ల జ్ఞాపకాలు రీలుగా గిర్రున తిరిగాయి. గులాబీ కండువాలు వేసుకొని వెళితే ఎన్నో అపహాస్యాలు... ఎక్కడా మడమ తిప్పలే. నేను చిన్నబోతే ‘నాయిని’ వచ్చి మేమున్నామని ఉత్సాహ పరిచేవాడు. మనం జెండా కింద పెడితే జన్మలో తెలంగాణ రాదని నా వెంట ఉన్న అక్కాచెల్లెళ్లు వెన్నుతట్టారు. శ్రీకాంతాచారి, స్వర్ణ, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్, యాదగిరిరెడ్డి వంటి ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటాం.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే రెండుమూడు నెలల్లో మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతామని, అందరికీ పదవులు వస్తాయని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ‘మీరు చేసిన సభ్యత్వం చూసి గర్వ పడుతున్నా. ఊహించని విధంగా 50 లక్షల మంది పార్టీలో చేరారు. రూ.10 కోట్ల సభ్యత్వ రుసుం వచ్చింది. రూ. 4.50 కోట్లు కార్యకర్తల పేరిట బీమా ప్రీమియం చెల్లించినం. ఎవరికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా రూ.2 లక్షల ఆర్థికసాయం అందుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. -
ప్రజలే మా బాసులు
* మా మదిలో, గుండెల్లో వాళ్లే * టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం * వారి కల నెరవేర్చేందుకే అహర్నిశలు శ్రమిస్తాం * రాష్ర్ట ప్రజలకే నా జీవితం అంకితం * బంగారు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తాం * రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ * ఐకేపీ సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం * నాలుగేళ్లలో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి * వాటర్‌గ్రిడ్ పూర్తి కాకుంటే ఓట్లు అడగబోం * మూడేళ్లలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి * వచ్చే నెలలో పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని వెల్లడి * 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. - సీఎం కేసీఆర్ ‘టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం’ అని అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ర్ట ప్రజలకే తన జీవితం అంకితమని, బంగారు తెలంగాణ గమ్యం ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి.. ఆనాటి జల దృశ్యం నుంచి ఈనాటి జన దృశ్యం వరకు అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని కొనియాడారు. ఎనిమిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. కార్యసాధకులుగా నిలవాలని, బంగారు తెలంగాణ లక్ష్యాన్ని చేరే వరకు పోరాడాలంటూ పార్టీ కార్యకర్తలు, కళాకారుల్లో కొత్త ఉత్తేజం నింపారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... - సాక్షి, హైదరాబాద్ కల నెరవేరుస్తాం అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రాబోయే రెండేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ సోదరులు నిరాశకు గురవుతున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. నిరాశ పడకండి. త్వరలోనే మీ కలలు కూడా నెరవేరుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంద శాతం చేస్తాం. ఉద్యోగుల విభజన అయిపోయిన తెల్లారే ఆ ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. ఐకేపీ, డ్వాక్రా ఉద్యోగులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐకేపీ సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం. కేజీ టు పీజీని వచ్చే ఏడాది అమలు చేస్తాం. ప్రాణహితకు మార్పులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎత్తివేయట్లేదు. మార్పులు చేసుకుంటున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటాం. దిగువకు అవసరమున్న నీటిని ప్రాణహిత గోదావరిలో కలిశాక.. కాళేశ్వరం నుంచి తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మిడ్‌మానేరుకు అక్కణ్నుంచి నీరు తీసుకుంటాం. ఎవడు అడ్డమొస్తడో నేను చూస్తా. ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానని గతంలో చెప్పిన. రాబోయే నాలుగేళ్లలో ఇటు పాలమూరు.. అటు ప్రాణహిత ప్రాజెక్టులను నిజంగానే కుర్చీ వేసి కట్టించి తీరుతా. ఏడాదిన్నర వ్యవధిలో దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్ఎల్బీసీలను పూర్తి చేస్తాం. హామీ నెరవేర్చకుంటే ఓట్లు అడగం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రాబోయే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని ఇవ్వకపోతే ఓట్లు అడగమని ఇప్పటికే చెప్పిన. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మనం పట్టుబట్టి తెలంగాణ తెచ్చినట్లుగా అపర భగీరథుల్లా ఈ పథకం చేపట్టాలి. పది జిల్లాల్లో దాదాపు 20 వేల చోట్ల రైల్వే లైన్లు, వాగులు, ఒర్రెలు, కెనాల్స్, హైవేలు, రోడ్లు దాటుతూ పైపులైన్లు వేయాలి. ఎక్కడ ఏం గ్రామంలో ఈ పని వచ్చినా కార్యకర్తలు శివంగి బిడ్డల్లా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ పనుల్లో పాలుపంచుకోవాలి. రోడ్లు, రహదారులకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్లు, బ్రిడ్జి పనులన్నీ కథానాయకులై ముందుకు తీసుకుపోవాలి. మెట్రో రైలు నిర్మాణం అశాస్త్రీయంగా ఉంది. అటు ఎయిర్‌పోర్టు, ఇటు ఇబ్రహీంపట్నం, రాంచంద్రాపురం వరకు పొడిగించాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంస విక్రయ మార్కెట్లు, శ్మశానవాటికలు, డంప్‌యార్డులను అభివృద్ధి చేస్తాం. యాదగిరి నర్సన్న పవర్ ప్లాంట్ ప్రస్తుతం రాష్ర్టంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉంది. అదనంగా రూ. 91,500 కోట్ల నిధులు సమకూర్చుకున్నాం. రాబోయే మూడేళ్లలో 24 వేల మెగావాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. అసెంబ్లీలో నేనీ విషయం చెబితే.. ‘ఇదేం మాయా మశ్చీంద్రనా.. ఇదేమన్నా అద్భుతమా..’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో మీరు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వాళ్ల కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. నల్లగొండ జిల్లా దామరచర్లలో 6,600 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతాం. ఈ ‘యాదగిరి నర్సన్న’ పవర్ ప్లాంట్‌కు పది రోజుల్లో శంకుస్థాపన చేస్తా. తెలంగాణకు కరెంటు పీడ పోయింది. ఇక కరెంటు కోతలుండవ్. ఇప్పుడు పంటలను ఎండకుండా కాపాడుకున్నాం. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. పువ్వు పుట్టంగనే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లా పని చేస్తుందో చెప్పడానికి కరెంటు సరఫరానే నిదర్శనం. పరిశ్రమలకు తగినన్ని భూములు, నీళ్లు ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానం ఉంది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలిరావాలి. ధర్మపురిలో మొక్కు తీరుస్తా తెలంగాణలో గోదావరి ఐదారు వందల కిలోమీటర్లు పారితే.. ఆంధ్రప్రదేశ్‌లో యాభై అరవై కిలోమీటర్లు పారుతుంది. కానీ గోదావరి అంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరమంటే విజయవాడ.. అన్నట్లుగా మారింది. మనం కూడా అక్కడికిపోయి గుండు కొట్టించుకొని స్నానం చేసి వచ్చేటోళ్లం. బాసర సరస్వతి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వరంలో మహాశివుడు, భద్రాద్రిలో రాముడు కొలువు దీరి ఉన్నాడు. ఒక్క పుణ్యక్షేత్రం లేని రాజమండ్రిలో ఎందుకు పుష్కరాలు పెడుతారని అప్పుడు అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలతో వాదించాను. అప్పుడు తెలంగాణ సమాజం మేలుకున్నది. అప్పటి పుష్కరాల్లో నేను ధర్మపురిలో మునిగిన. మళ్లీ పుష్కరంలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్లీ వస్తానని, ధర్మపురి నర్సన్నకు పాదాభిషేకం, పాలాభిషేకం చేస్తానని, తల్లీ గోదావరీ.. నీ ఒడిలో మునిగి.. నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తానని ఆ రోజే మొక్కుకున్నా. అందుకే ఈ పుష్కరాల్లోనూ ధర్మపురికే వెళ్తా. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. సన్నబియ్యం ఆలోచన ఈటలదే గత ప్రభుత్వం రేషన్ బియ్యంపై రూ. 900 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. సీలింగ్ లేకుండా పేద కుటుంబాలకు కడుపు నిండా తిండి పెడుతున్నాం. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు. వాళ్లకెప్పుడు హాస్టళ్లలో సదివే పిల్లలకు సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన రాలేదు. ఈటల రాజేందర్, నేను సన్నగనే ఉంటాం. నేను స్వయంగా హాస్టళ్లనే సదువుకున్నా.. పిల్లలకు సన్న బియ్యం పెడుతామని ఈటల చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వమన్నా. కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినా.. నన్ను సముదాయించి ఇలా మంచి పనులు చేయించే బిడ్డలు టీఆర్ఎస్లో ఉన్నారు. సన్న బియ్యం ఘనత ఈటలదే. గోల్కొండ కోటపై జెండా ఎగరేశాం ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగరేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చారిత్రక వైభవానికి చిహ్నమైన గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరేసినం. గత పాలకులకు ఆ సోయి లేదు. కొమురం భీం విగ్రహం ప్రతిష్ఠించేందుకు వెళితే కాంగ్రెస్ పాలనలో ఆ విగ్రహాలను పోలీస్ స్టేషన్లో పెట్టిన్రు. నేనే స్వయంగా వెళ్లి జోడెఘాట్‌లో కొమురం భీం విగ్రహం పెట్టా. తెలంగాణ గడ్డ గర్వపడే బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పాలకులే గౌరవించలేదు. పీవీని గౌరవించేందుకు అధికారిక ఉత్సవాలు నిర్వహించాం. అన్ని వర్గాలకు అండాదండ! ఇక ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మరోసారి ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే భరోసా ఇస్తున్నా. ఈ వర్గం, ఆ వర్గం అని లేదు. అందరికీ అండదండగా ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలే అయ్యింది. కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చాం. ముందు ముందు అనేక కార్యక్రమాలు వస్తాయి’ అని స్పష్టంచేశారు. పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. లండన్, అమెరికాలోని పార్టీ శాఖల నిర్వాహకులకూ ధన్యవాదాలు చెప్పారు. ‘కార్మిక వర్గానికి అండగా ఉంటాం. సిర్పూర్ పేపర్ మిల్లును మూత పడనీయం. వరంగల్ జిల్లాలోని ఏపీ రేయాన్స్ మూతపడితే డిప్యూటీ సీఎం కడియం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తీసుకువచ్చి కొన్ని రాయితీలు అడిగారు. వెంటనే ఇచ్చాం. ఏ పరిశ్రమనూ మూతపడనీయం. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఓ గేయం.. ఓ పద్యం.. నూతనోత్తేజం ప్లీనరీలో ప్రసంగం సందర్భంగా కేసీఆర్ ఉత్సాహంగా పాట పాడారు. మరో పద్యంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ‘ఎన్నో కలలు కని తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు నేనే ఒక పాట రాసిన.. మనందరం పాడుకున్నాం’ అంటూ తన ప్రసంగం చివర్లో ఆ గేయంలోని ఓ చరణం అందుకున్నారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలె.. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె.. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె’ అని కేసీఆర్ పాటెత్తుకున్నారు. అదే తీరుగా స్వర్ణయుగంవైపు.. బంగారు తెలంగాణ వైపు.. రాష్ట్రం అడుగులు వేస్తుందని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మరోసారి టీఆర్ఎస్ కార్యకర్తలను కార్యసాధకులుగా కొనియాడుతూ ఓ పద్యాన్ని వల్లెవేశారు. ‘కొందరిని మండలాల్లో బ్రిగేడియర్‌గా వేస్తే కాలినడకన వెళ్లారు. వెనుకటికో కవి రాశారు.. ఒకచో నేలను బవ్వళించు.. నొకచో నొప్పారు బూసెజ్జపై.. నొకచో శాఖములారగించు.. నొకచో నుత్కృష్టశాల్యోదనం.. అంటే కార్యసాధకులు.. నేల మీద పడుకున్నమా.. పరుపు మీద పడుకున్నమా.. అన్నం తిన్నమా.. గంజి తాగినమా.. అని ఆలోచించకుండా ముం దుకుసాగుతరు’ అని కేసీఆర్ ఉత్తేజపరిచారు. ప్రతీ రైతుకు నష్ట పరిహారం ‘పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. మనసు చిన్న చేసుకోకండి. నష్టపోయిన ప్రతీ ఎకరాకు, ప్రతీ రైతుకు సాయం చేస్తాం. కలెక్టర్ల నుంచి నివేదికలు అందగానే సాయమందిస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు కొన్ని తీర్మానాలు చేశారని, భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించారని పేర్కొన్నారు. మరికొన్ని విషయాలు 27వ తేదీన జరిగే బహిరంగ సభలో చెప్పుకుందామన్నారు. ఆ సభకు పది లక్షల మంది తరలిరానున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఎజెండా తెలంగాణ రాష్ట్రమే బలహీనవర్గాల రాష్ట్రం. వారి సంక్షేమానికే పెద్దపీట వేసినం. 34 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినం. ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించినం. రాష్ట్రంలో 32 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. 3.75 లక్షల మంది బీడీ కార్మికులు జీవన భృతి పొందుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల వేతనాలను పెంచాం. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, కడుపు నిండా అన్నం, పౌష్టికాహారం అందిస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్‌కు 50 శాతం కోత పెట్టినా రూ.700 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. రూ.6,500 కోట్ల భారం పడ్డప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సోదరులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ముస్లిం మైనారిటీలకు రూ.1033 కోట్లు పెట్టాం. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టులకు రూ.10 కోట్లు కేటాయించామని కేసీఆర్ వివరించారు. -
ఆదివాసీల ప్రాణరక్షణే ‘బంగారు తెలంగాణ’
సందర్భం ఆదివాసులకు టీఆర్ ఎస్ పార్టీ చేసిన ‘హెలికాప్టర్ అంబులెన్స్’ వాగ్దానం ఎటు పోయిందో కానీ, గూడేల్లో అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అవుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసాగుతోంది. అత్యంత వెనుకబడ్డ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ -గిరిజ నుల దారిద్య్రాన్ని నిర్మూలించే లక్ష్యంతో అనేక సామాజిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వా లు 68 ఏళ్లుగా అమలు చేస్తు న్నాయి. అయినా ఆదివాసీ - గిరిజనుల జీవితాల్లో ఏవిధమై న మార్పులేదు. ఆఫ్రికాలో అత్యంత వెనుకబడ్డ దేశాల ప్రజల కంటే, ఆదిలాబాద్ ఆదివాసీలు మరింత దుస్థితి లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. నిజమైన స్వేచ్ఛకొరకు రాంజీగోండ్ పోరాటం, కొమురంభీమ్ నాయకత్వంలో ఆదివాసీల సామూహిక పోరాటం, ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన పోరాటం తర్వాత కూడా ఆదివాసుల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. చెలిమల్లో వాగుల్లో నీళ్లుతాగుతూ, పోష కాహారం కరువై శరీరంలో రక్తం లోపించి, చిన్నారులు, బాలింతలు మలే రియా, విష జ్వరాలతో ఏటా వందల మంది మర ణిస్తూ, జీవన్మరణ పోరాటం నేటికీ సాగిస్తూనే ఉన్నారు. గొంతెండితే గుక్కెడు నీళ్ల కోసం 68ఏళ్ల అనంతరం 6కిలోమీటర్లకుపైగా తాగు నీటి కుండలతో నడుస్తున్నా రంటే అభివృద్ధి అందమేమిటో అర్థం అవుతుంది. ఇటీవలి ప్రణాళికా సంఘం సభ్యుల నిశిత సర్వే నివేదిక ఆదివాసీ గిరిజనుల దుస్థితికి అద్దంపడుతోంది. ఆరున్నర దశాబ్దాల ప్రణాళికల అనంతరం కూడా దేశం లో అసమానత్వం, అభివృద్ధి పక్క పక్కనే కొనసాగి తిష్టవేసిన వైనాన్ని యువప్రణాళికా సంఘ ఆర్థికశాస్త్ర నిపుణులు ఆర్థిక రాజకీయ వారపత్రిక(ఈ.పీ.డబ్ల్యూ) జనవరి -2015 సంచికలో విశ్లేషించారు. దేశంలోని 640 జిల్లాలు, 5955 ఉప జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో అభివృద్ధి అనేది సహజంగానే ఒకే రకంగాలేదు. ఈ విశ్లేషణలో అభివృద్ధి అంశంలో జిల్లాల మధ్య అవధుల్లేని అంతరాలను ఎత్తిచూపుతూనే, ఒకే జిల్లాలోని ఉప జిల్లాలు/ రెవెన్యూ డివిజన్ల మధ్య తర గని అంతరాలున్నాయని పేర్కొన్నారు. 27 జిల్లాల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న 10 శాతం రెవెన్యూ డివిజన్లు, వాటి సరసన అభివృద్ధిలో అట్టడుగున ఉన్న 10 శాతం రెవెన్యూ సబ్డివిజన్లలో దారుణ దుస్థితిలో ప్రజలు మగ్గుతున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన గ్రామాలు, ప్రజలు దారుణ దుస్థితిలో బతు కులీడుస్తు న్నారని ఆ నివేదిక సారాంశం. దేశంలోనే తొలి వరుసన ఉన్న 166 జిల్లాల్లో ఉచ్ఛస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్ డివిజన్లు, అధమస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్డివిజన్లు కలగలిసి ఉన్నాయి. ఈ అధ్యయనంలో ముఖ్యాంశం ఏమిటంటే : ఏ జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయో, ఆయా జిల్లాల్లో గిరిజనులు ఆదివాసుల జనాభా అత్యధికంగా ఉంది. ఈ డివిజన్లలోని అపార మైన సహజ వనరుల ఆధారంగా వెలసిన పరిశ్రమలు ఒక జిల్లాలోని ఒక సబ్ డివిజన్లో అపారమైన సంప దను సృష్టిస్తే అదే జిల్లాలోని మిగతా ప్రాంతాలు, వాటి లో ఉన్న గిరిజనుల జనాభా కటిక దారిద్య్రంలో మగ్గి పోతోంది. నిండు యవ్వనంలోనే అనారోగ్య మరణాల తో వీరి జనాభా తగ్గుతోంది. ప్రముఖంగా గిరిజనులు అధికంగా ఉన్న అనేక రెవెన్యూ డివిజన్లు అపారమైన ఖనిజసంపదతో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్న ప్పటికీ, వీటి ఫలితమైన ఆర్థికోత్పత్తి సంపదల భాగ స్వామ్యం నుంచి ఆ గిరిజన ఆదివాసీ ప్రాంత ప్రజలను బలవంతంగా కట్టుబట్టలతో బయటకు గెంటివేసేలా నేటి అభివృద్ధి విధానం సాగుతోంది. ఆ వనరులపై అన్నివిధాల ఆధిపత్యం నెరిపే కొద్ది ప్రాంతపు పట్టణా నికే అభివృద్ధి పరిమితమైంది. ఈ జిల్లాలో ఉన్న అత్యధి క శాతం గిరిజనులు ఆదివాసీలు కడు పేదరికంలో మగ్గుతుంటే, పట్టణాల్లో సంపద పోగు కావడం కాకతాళీ యం కాదని ఆ నివేదిక తెలిపింది. పెట్టుబడిదారీ విధానం దానికనుగుణమెన అభివృ ద్ధిని దారుణ అసమానత్వాన్ని ప్రజల దుస్థితులను పక్క పక్కనే నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో నయం చేయగల సాధారణ మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచ నాలు, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో వంద లాది ఆదివాసులు మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి వీసమంత ప్రయత్నమైనా వివక్ష లేకుం డా నేటికీ ఎందుకు జరగడంలేదు? 68 ఏళ్ల స్వాతంత్య్రం ఈనాటికీ ఆదివాసీలకు రోడ్లు రహదారులను, గుక్కెడు నీటిని ఎందుకందించటం లేదు? ఎక్కడ తప్పనిసరిగా వైద్య వసతులు కల్పించాలో అక్కడే అవి నేటికీ ఎందుకు కల్పించలేదు? ఆదివాసుల ఆయువులను కాపాడుతా మని టీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన హెలికాప్టర్ అంబులెన్స్ వాగ్దానం ఎక్కడికెళ్లింది? హెలికాప్టర్ అం బులెన్స్ ఎటుపోయిందో కానీ, ఆదివాసీ గూడేల్లో ఎడ్ల బండ్లు నడవకపోతే, అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అయి ఈనాటికీ కొనసాగుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసా గుతోంది. 2008-09లో మూడువేల మంది ఆదివా సీలు- గిరిజనులు పోషకాహార లోపంతో రోగ నిరోధక శక్తి తగ్గి, తీవ్ర అనారోగ్యంతో మరణించారు. నాటి నుం డి ప్రతి ఏటా 200-500 మంది చనిపోతూనే ఉన్నారు. వెనుకబాటుతనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఉట్నూ ర్, బోథ్ ఆదివాసీ ప్రాంతాలకు త్వరలో వస్తోన్న ప్రపం చ బ్యాంకు బృందం ఈ అంశాన్ని తీవ్రంగా ఆలోచిం చాలి. ఎన్ని ప్రణాళికలు వేసినా దారిద్య్ర నిర్మూలన మాట అటుంచి, దాని నీడను కూడా చెరపని ప్రణాళిక లకు పడ్డ పందికొక్కుల గురించి మథనం చేయాలిప్పు డు. ఆదివాసీ గిరిజన దారిద్య్ర సమూల నిర్మూలనే నేటి విధానం కావాలి. (ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాల ను ప్రపంచబ్యాంక్ సందర్శించనున్న సందర్భంగా) వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నేత మొబైల్ 97013 81799 -
కేసీఆర్‌కు అండగా నిలుద్దాం: తుమ్మల
గజ్వేల్ (మెదక్): ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో కమ్మ కులస్తులు కీలక పాత్రను పోషించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన నియోజకవర్గ కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి కేసీఆర్ తగు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్ చేస్తే చాలు స్పందించి అండగా నిలబడతానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల కమ్మ సంఘం కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, పరుచూరి రాజు, వెంకటేశ్వర్రావు, నల్లా భాస్కర్‌రావు, పాలేటి నర్సింహారావు, నల్లా శ్రీధర్, చేకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
'అమరవీరులే నిజమైన హీరోలు'
కరీంనగర్: అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అమరవీరులే నిజమైన హీరోలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో 132 మంది అమరవీరుల కుటుంబాలకు సోమవారం మంత్రి రూ. 13.20 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. ఆకలికేకలు,ఆత్మహత్యలులేని బంగారు తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో కలసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. -
భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు
భూతద్దంలో ‘బంగారు తెలంగాణ’ * రూ. 1.15 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ * తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈటెల * ఆదాయ అంచనాలను భారీగా చూపిన సర్కారు * పన్నుల మోత.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే మార్గాలు * వ్యాట్ ద్వారా రూ. 11,116 కోట్ల అదనపు రాబడి అంచనా * భూముల విక్రయం, క్రమబద్ధీకరణతో రూ. 13,500 కోట్లు * అప్పులు, మద్యం అమ్మకాలు, కేంద్ర ప్యాకేజీపై ఆశలు * ఊసే లేని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ సాక్షి, హైదరాబాద్: మరోసారి లక్ష కోట్లకుపైగా బడ్జెట్. స్వేచ్ఛా రెక్కలు విచ్చుకున్న తెలంగాణ రాష్ర్ట ప్రజల ఆశలు, ఆకాంక్షలను పేర్చుతూ అప్పుల మూలాలు, రాబడుల స్తంభాలు, లక్ష్యాల మెట్లతో టీఆర్ఎస్ సర్కారు భారీ బడ్జెట్ కోటను నిర్మించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ. 1,15,689 కోట్లతో అసెంబ్లీ సాక్షిగా బుధవారం దీన్ని ఆవిష్కరించింది. సంక్షేమం, ఇతర ప్రతిష్టాత్మక పథకాలకు ఘనంగా నిధులు కేటాయించింది. నిరుటితో పోల్చితే ఆదాయ అంచనాలను అనూహ్యంగా పెంచేసింది. కేంద్ర ఆర్థిక సంఘం అంచనాల మేరకు ఖాతా పుస్తకంలో రూ. 531 కోట్ల మిగులును కూడా రాష్ర్ట ప్రభుత్వం చూపించింది. అయితే కేంద్ర, రాష్ర్ట పన్నులు పోను దాదాపు రూ. 22 వేల కోట్లను పన్నేతర ఆదాయంగా పేర్కొంది. పన్నుల ఆదాయాన్నీ భారీగా పెంచి చూపింది. ‘బడ్జెట్ కోట’ను బలోపేతం చేసుకోవాలంటే సర్కారు ముందున్న మార్గాలేమిటో ఆర్థిక మంత్రి ఈటెల చెప్పకనే చెప్పారు. ‘కొత్త రాష్ట్రంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చడానికి పన్నులు పెంచక తప్పదు. ప్రభుత్వానికి ఆదాయం గాలి నుంచి ఊడిపడదు’ అని మీడియాకు సెలవిచ్చారు. అంటే, ప్రజలపై పన్నుల మోత, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, అప్పులపై ఆధారపడే వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకోనుంది. కేంద్ర ప్యాకేజీపై కూడా ఆశలు పెట్టుకుంది. ఈ సవాళ్లను స్వీకరిస్తూనే ‘బంగారు తెలంగాణ’ బాటలో వడివడిగా అడుగులు వేయాలని చూస్తోంది. మొత్తానికి కేసీఆర్ సర్కారు తొలి బడ్జెట్లో వేసుకున్న రూట్‌మ్యాప్‌ను, అందులో కన్న కలలనే భూతద్దంలో చూసినట్లుగా ఈసారి కూడా అంచనాలు వేసుకుం ది. అయితే కేజీ టు పీజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, వంటి ఎన్నికల హామీలను మాత్రం ఈసారి పూర్తిగా పక్కనబెట్టింది. కోటలోకి ఎన్నెన్ని మార్గాలో..! రాష్ట్రంలో పన్నుల ద్వారా మొత్తం రూ. 46,494.75 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసింది. నిరుటితో పోల్చితే వ్యాట్ ద్వారా రూ. 11,116 కోట్ల అదనపు రాబడిని లక్షంగా పెట్టుకుంది. ఈ లెక్కన ప్రజలపై ప్రతి నెలా రూ. వెయ్యి కోట్లకుపైగా పన్నుల భారం మోపేందుకు సర్కారు ద్వారాలు తెరువనుంది. మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం రాబట్టుకునేందుకు జనాన్ని మత్తులో ముంచే ఆలోచన చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, గనులు, ఖనిజాల ద్వారా భారీ ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. ఇసుక క్వారీలు, విక్రయాల ద్వారా రూ. 1500 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దీంతో పాటు భూములు, ఆస్తుల అమ్మకం, క్రమబద్ధీకరణ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని సర్కారు ఆశపడుతోంది. గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ. 6,500 కోట్లు వస్తుందని అంచనా వేసుకుంది. కానీ క్రమబద్ధీకరణతో కేవలం రూ. వెయ్యి కోట్ల రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా రూ. 13,500 కోట్ల ఆదాయాన్ని అశిస్తోంది. దీంతో భూములు అమ్మకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి నిధులు తగ్గినందుకే 2014-15 ఆదాయ అంచనాల్లో రూ. 20,227 కోట్ల లోటు ఏర్పడిందన్న సర్కారు.. ఈసారి కూడా అదే ఊహల పల్లకీలో విహరించడం విచిత్రం. గతేడాది కేంద్రం నుంచి రూ. 5,000 కోట్ల ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అదేమీ జరగలేదు. పైగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ర్టంగా 14వ ఆర్థిక సంఘం గుర్తించడంతో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. సంక్షేమానికి పెద్దపీట బడ్జెట్టు కేటాయింపుల్లో టీఆర్ఎస్ సర్కారు సంక్షేమ కోణాన్నే ఎంచుకుంది. నీటిపారుదల, వ్యవసాయం, విద్య, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆహార భద్రత, ఆసరా, కళ్యాణలక్ష్మి, రైతు రుణాల మాఫీ పథకాలకు సముచిత నిధులు కేటాయించింది. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాల పెంపు, బీడి కార్మికులకు పించన్లు ఈసారి బడ్జెట్లో కొత్త అంశాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ విద్య, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పనను బడ్జెట్లో ప్రభుత్వం విస్మరించింది. పెరిగిన ప్రణాళికేతర వ్యయం రాష్ర్ట తొలి బడ్జెట్‌తో పోల్చితే ప్రణాళిక వ్యయంలో పెద్ద తేడా లేకున్నా.. ప్రణాళికేతర వ్యయాన్ని భారీగా పెరిగింది. ఈసారి ప్రణాళిక వ్యయం కింద రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.63,306 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. తొలి బడ్జెట్లో రూ.301.02 కోట్ల మిగులు చూపించిన ప్రభుత్వం.. ఈసారి అంతకంటే ఎక్కువే మిగులు చూపించింది. ఆర్థిక మిగులు రూ.531 కోట్లు ఉంటుందని.. ద్రవ్యలోటు రూ.16,969 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)లో ఈ ద్రవ్యలోటును 3.49 శాతంగా అంచనా వేసింది. అంటే ద్రవ్య పరిమితికి మించి అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉద్యోగుల జీతభత్యాల పెంపు వల్ల ఈ ఏడాది ప్రణాళికేతర వ్యయం గతంలో కంటే పెరిగిందని ఈటెల ప్రకటించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గినప్పటికీ అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని పొందుపరిచినట్లు చెప్పారు. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రాబడుల్లో వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. కానీ తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అందుకే ప్రణాళిక వ్యయం పెంచడానికి రాష్ర్టం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడి రూ. 12,823 కోట్లు మాత్రమే. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని భారీగా తగ్గించింది. దీంతో గత ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రణాళిక నిధులు రూ. 11,781 కోట్లతో పోల్చితే.. ఈసారి రూ. 6,497 కోట్లు మాత్రమే వస్తాయని అంచనా. అయినా రాష్ర్ట ప్రణాళిక వ్యయాన్ని అధికంగానే ప్రతిపాదించాం’ అని ఈటెల పేర్కొనడం కొసమెరుపు. -
'బంగారు తెలంగాణతో మమేకమవుతాం'
హైదరాబాద్: ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రాభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచడం ద్వారా, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేయడం ద్వారా సీఎం కేసీఆర్ అందరి కడుపులు నింపారని అన్నారు. -
చేస్తున్నది తక్కువ.. చేయాల్సింది ఎక్కువ!
రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ నుంచి వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు అంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 46 వేల చెరువులకు జలకళ తెచ్చేందుకు మిషన్ కాకతీయ మొదలు పెట్టాం. దేశంలో మంచి రహదార్లు అంటే తెలంగాణలోనే ఉన్నాయన్న రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు చేస్తున్నది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ ఉంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ మంగళవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వెనుక బడిన నల్లగొండ నుంచే వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం చుడతానని, త్వరలోనే జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని తెలిపారు. ‘‘తెలంగాణది సంక్షేమ రాజ్యం. రెండున్నరేళ్లలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తాం. ఇప్పటికే పెన్షన్లు పెంచాం. తం డాలను పంచాయతీలుగా మార్తుస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా బాలూనాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటిం టికీ ప్రచారం చేయాలని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రసంగిస్తూ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గతంలో టీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉండేదని, ఇప్పుడు పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. బాలూనాయక్‌తో పాటు చింతపల్లి, రామన్నపేట, గుర్రం పోడు, అర్వపల్లి, నూతనకల్లు మండలాలకు చెందిన అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు, చింతపల్లి, చందంపేట, దేవరకొండ, మఠంపల్లి, నేరేడుచర్ల ఎంపీపీలు, 39 మంది ఎంపీటీసీ సభ్యులు, 45 మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ ఇలా?
బంగారు తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత తహసిల్దార్లపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం వాస్తవం. ప్రజల కోసం పనిచేసే అధికార్లలో తహసిల్దార్లదే ప్రథమస్థానం. ఎందుకంటే ప్రభు త్వ పథకాలు ఠంచనుగా ప్రజల చేతికి అందాలంటే తహసిల్దార్ల పాత్ర ను ఎవరూ తక్కువ చేయకూడదు. 2012లో ఒక తహసి ల్దారిణి సింగరేణి ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నా యని తెలిసి వంద రేషన్ కార్డులను ఏరివేశారు. తన కార్యాలయాన్ని అవినీతికి ఆమడదూరంలో ఉంచారు. 2013 జనవరిలో ఈమె తాండూరు తహసిల్దారుగా నిత్యావసర వస్తువుల అక్రమ సరఫరాను అడ్డుకుని 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనపర్చుకుని భారత ఆహార కార్పొరేషన్ -ఎఫ్‌సీఐ-కి పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిజాయితీపరులైన అధి కారుల సేవలను, అంకితభావాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఆహార భద్రత పథకం నిజమైన అర్హులకు మాత్రమే అంది పేదల కడుపు నిండుతుం ది. వీలైతే ఉత్తరప్రదేశ్‌లో గుత్తేదార్ల అవినీతిని అడ్డుకుని విశేష ప్రచారం పొందిన ఈ గడ్డకు చెందిన ఉన్నతాధికారిణి చంద్రకళను డిప్యుటేషన్‌పై తెలంగాణకు రప్పించాలి. నిజాయితీ ఉన్న అధికారులను కాపాడుకు నేలా, ప్రోత్సహించేలా కేసీఆర్ తగు చర్యలు చేపట్టాలని విన్నపం. -
బంగారు తెలంగాణే బడ్జెట్ లక్ష్యం
అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల వివరణ బడ్జెట్‌పై చర్చలో విపక్షాల విమర్శలకు సమాధానం * భారీ కసరత్తు తర్వాతే సమగ్ర బడ్జెట్‌ను రూపొందించాం * పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుతాం * ఇక తెలంగాణలో ఆకలి పాటలకు కాలం చెల్లినట్టే * ప్రతి అర్హుడికీ ఆహారభద్రత కార్డు అందే వరకూ నిద్రపోం * తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రాభివృద్ధిలో ప్రదర్శిస్తాం సాక్షి, హైదరాబాద్: ‘నిన్నటి వరకు ఆకలి పాటలు పాడుకున్నం. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో వాటిని ఊరూరా వినిపించినం, ఇక ఆ పరిస్థితులు ఉండయ్. ఆకలి పాటలకు కాలంజెల్లింది. ఇకముందు కడుపులు నింపే పాటలే. మన తెలంగాణ కోసం ఎంత తీవ్రమైన ఉద్యమం చేసినమో.. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అంతే స్ఫూర్తితో ముందుకు సాగుతం. అందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. లక్ష కోట్లకుపైగా బడ్జెట్‌ను రూపొందించే క్రమంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశామని చెప్పారు. కొన్ని విషయాల్లో అధికారులు నిబంధనలను ఉటంకించినప్పుడు.. కావాలంటే వంద సార్లు చర్చిద్దాం, పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారని తెలిపారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలకు శుక్రవారం అసెంబ్లీలో ఈటెల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివరాలను సభ ముందుంచి విశదీకరించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూనే అడుగడుగునా గత ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు.. ఆహార భద్రత కార్డుల జారీపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించిన క్రమంలో సభలో ఆర్థికమంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ర్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేవరకు తమ ప్రభుత్వం నిద్రపోదన్నారు. అయితే గతంలో ‘సర్వరోగ నివారణి’ తరహాలో తెల్ల రేషన్ కార్డును అన్నింటికీ ఉపయోగించే పద్ధతి ఉండేదని, ఇకపై మూస పద్ధతిలో ఉండరాదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇక పింఛన్ల కోసం భారీ స్థాయిలో రూ. 4 వేల కోట్లు కేటాయించిన ఘనత తమదేనన్నారు. కుటుంబంలో ఎంతమంది వికలాంగులున్నా అందరికీ పింఛన్ అందుతుందని, వికలాంగులను గుర్తించేందుకు అవసరమైతే సదరం క్యాంపులను విస్తృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన చెరువుల వ్యవస్థ గతంలో దెబ్బతిన్నదని, ఇప్పుడు కాకతీయుల స్ఫూర్తితో వాటిని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడత 9 వేల చెరువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన జలయజ్ఞంలోని కీలక ప్రాజెక్టులను కొలిక్కి తెచ్చేలా ఈ బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లున్నా కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రాలో ఏర్పాటు చేసిన నాటి పాలకుల వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలొచ్చాయని, దీన్ని అధిగమించేందుకు రామగుండం ఎన్టీపీసీతోపాటు ఇతర విద్యుత్ కేంద్రాలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉత్పత్తి వ్యయం తగ్గేలా ప్లాంట్లను ఆధునీకరిస్తామన్నారు. ఇక హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ‘ఐటీ, ఫార్మా, సినిమా సిటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ వెలుగొందుతుంది. విభజనకు ముందు విశాఖపట్నం తరలించుకుపోయిన ఫార్మాసిటీ.. ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నామని ఫార్మా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి’ అని ఈటెల పేర్కొన్నారు. మండలిలోనూ సుదీర్ఘ సమాధానం శాసనమండలిలోనూ బడ్జెట్‌పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి దాదాపు గంటన్నరపాటు సమాధానమిచ్చారు. నవ్వేవారి ముందు జారిపడొద్దన్న లక్ష్యం తో భారీ కసరత్తు చేసి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించామన్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద దాదాపు సమాన స్థాయిలో వ్యయం చూపడం అభివృద్ధికి సూచిక అని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ. 27 వేల కోట్లను అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ రూ. ఐదు వేల కోట్ల రుణాలకే పరిమితమయ్యామని చెప్పారు. బడ్జెట్లో పద్దులను ఆయన మరోసారి చదివి విని పించారు. ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాత నిరుద్యోగుల ఆకాంక్షలు ఫలించేలా త్వరలో సర్వీసు కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే నాటికే రాష్ట్రం బంగారు తెలంగాణగా ఉందని ఈ రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని మండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్ అన్నారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ అమలుపై సందేహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలు, చానళ్లను నమ్మొద్దు తెలంగాణపై విషం చిమ్మే కొన్ని పత్రికల రాతలు, కొన్ని చానళ్ల మాటలను నమ్మొద్దని ఆర్థిక మంత్రి సభను కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసిన ఆ పత్రికలు, చానళ్లు ఇప్పుడు తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఆవిర్భావం అసాధ్యం అని ఊదరగొట్టారు. మా ఉద్యమాన్ని ఉద్దేశించి.. తమ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో అంతరిస్తుందన్నరు. కానీ మేం తెలంగాణ తెచ్చి చూపెట్టినం. ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా మా పనితీరును విమర్శిస్తూనే ఉన్నాయి. వాటిని నమ్మి అపోహలకు గురికావద్దని సభ్యులను కోరుతున్నా’ అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మా.. కాదు.. మన ముఖ్యమంత్రి బడ్జెట్‌పై విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానాలు చెప్పిన ఈటెల ఓ విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాట్లాడిన ప్రతీసారి ‘మా ముఖ్యమంత్రి ఇలా’.. అంటూ పేర్కొనడాన్ని సమావేశాలు మొదలైనప్పటి నుంచే కాంగ్రెస్ సభ్యులు ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. ఈటెల ‘మా ముఖ్యమంత్రి’ అన్నప్పుడల్లా రాష్ట్రమంతటికీ ఒకరే ముఖ్యమంత్రిగా ఉంటారని, ‘మన ముఖ్యమంత్రి’ అనాలంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ‘మా ముఖ్యమంత్రి’ అనడాన్ని దాదాపు ఊతపదంలా మార్చుకున్న ఈటెల శుక్రవారం నాటి సుదీర్ఘ ప్రసంగంలో దాన్ని సరిదిద్దుకోడానికి ఇబ్బందిపడ్డారు. ‘మా ముఖ్యమంత్రి’ అని అన్న వెంటనే ‘మనముఖ్యమంత్రి’ అని అనాల్సి వచ్చింది. -
రేపు కారెక్కుతున్నా..
వికారాబాద్: గులాబీ దళంలో చేరే విషయంలో ఇన్ని రోజులూ ఊగిసలాటలో ఉన్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. నియోజవర్గ అభివృద్ధి కోసం తాను ఆదివారం టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సమక్షంలో ఆదివారం కారు ఎక్కుతున్నట్లు తెలిపారు. తన కంటే ముందు టీఆర్ఎస్లో ఎంతమంది నాయకులున్నప్పటికీ పార్టీలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో కేసీఆర్‌కు తెలుసని ఆయన చెప్పారు. చేవెళ్ల నియోజవర్గం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారందరినీ కలుపుకొని వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. భవిష్యత్‌లో తనకు కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాలను అప్పగించినా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని యాదయ్య స్పష్టంచేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషి అమోఘమైనదని తెలిపారు. ఆయన కృషి పలితంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ సాధ్యమని.. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నట్లు ఆయన కొనియాడారు. చేవెళ్ల నియోజవర్గంలో కారును స్పీడ్‌గా ముందుకు తోలుతానని తెలిపారు. తన అనుచరులు, నాయకులతో సంప్రదింపులు జరిపానని, అన్నీ ఆలోచించిన తర్వాతే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు యాదయ్య తెలిపారు. కేవలం చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే తాను కారెక్కుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. -
టీఆర్ఎస్ పాలనలో సంక్షేమం శూన్యం
ఖమ్మం అర్బన్: బంగారు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజా సంక్షేమం కోసం చేసింది శూన్యమని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ నిధుల నుంచి మంజూరైన రూ.10 లక్షలతో ఖమ్మంలోని యూపీహెచ్‌కాలనీ, ప్రశాంతి నగర్లో నిర్మించనున్న డ్రెయిన్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని రాష్ర్ట ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ సామాజిక వర్గాలు నివాసముంటున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లోపించాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డీఈ వెంకటశేషయ్య, ఏఈ రామన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, డివిజన్ ఇన్చార్జ్ వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, భీమా శ్రీధర్, దొడ్డా సీతారామయ్య, పత్తి శ్రీను, జిల్లేపల్లి సైదులు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, ఉపాధ్యాయ విభాగం నాయకురాలు షర్మిలా సంపత్, సకీనా, మల్లీదు జగన్, జంగాల శ్రీను, కోపెల దానయ్య, ఫెరోజ్, బాణాల లక్ష్మణ్, వి.శ్రీను, గురుమూర్తి, సుబ్బరాజు, లక్ష్మి, నూనే ఆరవింద్, గుంతేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బిషప్స్ హౌస్ చర్చిని సందర్శించిన ఎంపీ ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఖమ్మంలోని నాయుడుపేటలోని బిషప్స్హౌస్ చర్చిని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సందర్శించారు. పాస్టర్ బిషప్ మైపాన్ పాల్ మధ్యాహ్న విందుకు ఆహ్వానించడంతో ఎంపీ ఆతిథ్యాన్ని స్వీకరించారు. చర్చి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆకులమూర్తి, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా నాయకులు తుంబూరి దయాకర్‌రెడ్డి, పత్తి శ్రీను, చర్చి ఫాదర్లు జోష్, సుధాకర్ పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి పెనుబల్లి: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్ల శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు గురికాకుండా ఉత్తములుగా పేరుగడించాలన్నారు. లోతైన పరిజ్ఞాన్ని పెంపొందించుకుని చదువుల్లో రాణించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టి పేదలకు సైతం కార్పొరేట్ విద్యను అందించారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం ఆ పథకం అమలు కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఇ.వి.రమేష్, సెక్రటరీ చావా లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ టి.నరసింహారావు, వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, నాయకులు జె.నర్సింహారెడ్డి, కర్నాటి వీరభద్రారెడ్డి, శీలం వెంకటేశ్వరరెడ్డి, కీసర వెంకటేశ్వరరెడ్డి, ఏనుగు సత్యంబాబు, వర్దెబోయిన కాటం రాజు, ఉలాస రామారావు, నల్లపుల్లయ్య పాల్గొన్నారు. -
కారుకు ఓటేసి కష్టాల పాలు..
చెన్నూర్/కోటపల్లి : బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ మాయమాటలు విని కారు గుర్తుకు ఓటేస్తే కష్టాలు తీసుకొచ్చారని, ప్రజలు ఓటు వేసి గెలిపించిన కారు ప్రజలపై సవారీ చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా, రైతు ఆత్మహత్యలకు నిరసనగా చేపట్టిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రోజుకో నిబంధన పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. కరెంటు కోతలతో రైతులు పంటలు ఎండి తీవ్రంగా అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తామంతా కృషి చేశామని చెప్పారు. ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీల ధైర్యంతోనే కేసీఆర్ ముందడుగు వేశారని.. ఏనాడూ స్వయంగా పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ప్రజల బతుకులను బాగు చేసేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. కరెంటు లేకుంటే పరిశ్రమలెలా వస్తాయి.. తెలంగాణలో కరెంటు లేకుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కేసీఆర్ తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఛత్తీస్‌ఘడ్ నుంచి రెండున్నర నెలల్లో కరెంటు తెస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను ఈ సందర్బంగా ప్రజలకు చూపించారు. ప్రస్తుతం మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రోజుకో మాట మాట్లాడ్డం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు. జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల డెంగీ జ్వరంతో ఎమ్మెల్యే మనమరాలు మృతి చెందినా.. జిల్లాలో డెంగీ మరణాలు లేవనడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలంగాణ ఇప్పటివరకు రైతులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని, పదవీకాంక్షతోనే ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం కోసం ఊహకందని హామీలు ఇచ్చిందని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని మాజీ ఎంపీ బలరాం నాయక్ ఆరోపించారు. కేట్లు, డూప్లికేట్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా పాలకులు ఇసుక రిచ్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తాని హామీ ఇచ్చారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ముక్కుపోగులు, మూడు తులాల బంగారం ఇస్తామని కేసీఆర్ మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీని అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం
రాయికల్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైల పాత్ర చాలా కీలకమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధన దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వంద రోజుల పాలనపై టీఆర్ఎస్ ఎన్నారై సెల్ రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించినట్లు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ సోమవారం ఈ మెయిల్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. -
బంగారు తెలంగాణ ఫిల్మ్ కాంటెస్ట్ పోస్టర్ విడుదల
-
తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక 63,047 కోట్లు
* తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక ఆవిష్కరణ * బంగారు తెలంగాణలో భాగస్వాములమవుతామన్న ఎస్బీహెచ్ ఎండీ * సీఎం కేసీఆర్ గైర్హాజరు, మంత్రులూ దూరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొదటి పరపతి ప్రణాళిక విడుదలయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 63,047 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) రూపొందించిన పరపతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం విడుదల చేశారు. హోటల్ మారియట్‌లో తెలంగాణ ఎస్ఎల్బీసీ రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులూ గైర్హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, బీఆర్ మీనా, పూనం మాలకొండయ్యలు హాజరయ్యారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల కింద రూ. 18,717.95 కోట్లు, టర్మ్ రుణాల కింద రూ. 6238.48 కోట్లు మంజూరు చేస్తామని ఎస్ఎల్బీసీ ప్రకటించింది. మొత్తం ప్రాధాన్య రంగాలకు రూ. 40,546.51 కోట్లు, ఇతర రంగాలకు మరో రూ.22,501.11 కోట్లు కలిపి మొత్తం రూ. 63,047.62 కోట్ల మేర తెలంగాణ రాష్ట్రంలో రుణాలను ఈ ఏడాది మంజూరు చేయనున్నట్టు ఈ పరపతి ప్రణాళికలో వివరించారు. గత ఏడాది రూ. 55113.45 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 14.4 శాతం అధికం. పరపతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు... * వ్యవసాయ రంగానికి గత ఏడాదిరూ. 23,719 కోట్లు మంజూరు చేయగా, ఈసారి రూ.27,233.59 కోట్లను బ్యాంకులు మంజూరు చేస్తాయి. * నాబార్డు సూచనల మేరకు వ్యవసాయ రుణాల మొత్తాన్ని గత ఏడాది(రూ. 5,767 కోట్లు) ఇస్తే, ఈసారి రూ. 8.515.64 కోట్లకు పెంచారు. ఏడాదిలో అందరికీ బ్యాంకు అకౌంట్లు... వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు తెరవనున్నట్టు ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ తెలిపారు. ఈ నెల 15 న ప్రధానమంత్రి మిషన్మోడ్ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో పరపతి ప్రణాళిక ప్రకటించడం ఆలస్యమైందన్నా రు. ఎస్బీహెచ్ తొలిసారి లీడ్‌బ్యాంక్‌గా ఎస్ఎల్బీసీకి నేతృత్వం వహిస్తోందన్నారు. విభజన సమయంలో వివరాలు ఇవ్వలేదు: సీఎస్ రాజీవ్‌శర్మ ఈ సమావేశానికి సీఎం రావాల్సి ఉన్నప్పటికీ రాలేకపోయారు. ఆయన సందేశాన్ని మీకు తెలుపుతున్నాను. రాష్ర్ట విభజన సమయంలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోవడంతో పంట నష్టం వివరాలను అప్పట్లో ఆర్బీఐకి పంపలేకపోయారు. అదేవిధంగా రీ-షెడ్యూల్ చేయాలనీ కోరలేదు. దీంతో రీ-షెడ్యూల్ కాస్తా ఆలస్యమవుతోంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేయబోతున్నాం. సబ్సిడీ తదితర పథకాలను ఆధార్‌కు లింకు చేస్తాం. నిజమైన లబ్ధిదారులకే రుణాలు అందేవిధంగా చూడాలి. సర్వే సందర్భంగా బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ వివరాలను బ్యాంకర్లు కోరితే అందజేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి చెప్పారు. పత్రికా ప్రకటన ఇవ్వండి.. కేవలం పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తానని ప్రకటించినప్పటికీ స్వయం సహాయక సంఘాలు కూడా రుణాలు చెల్లిం చడం లేదని బ్యాంకర్లు వాపోయారు. అదేవిధంగా వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న బంగారు రుణాలను కూడా చెల్లించడం లేదని... పైగా వేలం పాటలను వచ్చి అడ్డుకుం టున్నారని సమావేశంలో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌జీలకు మొత్తం రూ. 2,600 కోట్ల రుణాలు ఇవ్వగా, ఇందులో 10 శాతం ఎన్పీఏలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పత్రికాప్రకటన ఇవ్వడంతో పాటు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, పీడీలు, ఐకేపీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఎస్ఎల్బీసీ స్టీరింగ్ కమిటీ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. కమిటీ ఏర్పాటుకు ఎస్ఎల్బీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీలో ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐ, డీజీబీ, ఆప్కాబ్లతో పాటు వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఉంటారు. రుణమాఫీతో పాటు ఎప్పటికప్పుడు తలెత్తే అంశాలపై చర్చించుకునేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అవసరమని ఎస్ఎల్బీసీ అభిప్రాయపడింది. తెలంగాణలో బ్యాంకుల వివరాలు! సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 4,526 బ్యాంకు శాఖలు ఉన్నాయి. 31 మార్చి 2014 నాటికి గ్రామాల్లో అత్యధికంగా 1,661 శాఖలు ఉండగా మెట్రో ప్రాంతాల్లో వివిధ బ్యాంకులకు చెందిన 1,317 శాఖలు పనిచేస్తున్నాయి. 31 మార్చి 2014 నాటికి వివిధ రంగాలకు బ్యాంకులు ఇచ్చిన అడ్వాన్సులు * తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో మొత్తం 2,85,879 కోట్ల డిపాజిట్లు ఉండగా... 3,24,964 కోట్ల అడ్వాన్సులున్నాయి. * మొత్తం ప్రాధాన్యరంగ అడ్వాన్సులు- 1,02,617 కోట్లు * ఇందులో వ్యవసాయరంగ అడ్వాన్సులు- 49,564 కోట్లు * వ్యవసాయేతర రంగ అడ్వాన్సులు- 29,301 కోట్లు -
గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి: కిషన్‌రెడ్డి
* ‘బంగారు తెలంగాణ’ మాతోనే సాధ్యం : కిషన్‌రెడ్డి * ఏడు ‘టీ’లతో ప్రగతిపథాన రాష్ట్రం * మోడీ విధానాల మేరకు మా ప్రణాళిక * భారీ హామీలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సాక్షి, హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా నిలిచి, ప్రగతి సాధించిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విధానాల సమాహారంగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించారు. ‘గత జనవరిలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ‘బ్రాండ్ ఇండియా’ నిర్మాణానికి మా ప్రధాని అభ్యర్థి మోడీ కొన్ని సూచనలు చేశారు. అందులో ఆయన ట్రెడిషన్ (సంప్రదాయం), టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం), టూరిజం (పర్యాటకం), ట్రేడ్ (వాణిజ్యం), టాలెంట్ (ప్రతిభ) ఇలా ఐదు ‘టీ’లను ప్రతిపాదించారు. వాటికి ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), తెలంగాణ అనే మరో రెండు ‘టీ’లను జోడించి మేం ఎన్నికల మేనిఫెస్టో రూ పొందించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు దీన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు దత్తాత్రేయ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాంచంద్రరావు, శేషగిరిరావు, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో వందకుపైగా అంశాలున్నాయి. ముఖ్యమైనవి.. తెలంగాణలో 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా. రైతులకు 85 శాతం రాయితీతో కమ్యూనిటీ సౌరవిద్యుత్తు పంపుసెట్ల సరఫరా. మండలానికి 2 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు. వీటితో రైతులకు పగటి వేళ ఉచితంగా విద్యుత్, ఐదేళ్లలో వాటి సామర్థ్యం 10 మెగావాట్లకు పెంపు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, తెలంగాణ వ్యవసాయ నిధి ఏర్పాటు. పంటల బీమా ఎకరానికి రూ.10 వేలు. రైతులకు ఆరోగ్య బీమా, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేల పింఛన్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా. నదులు, సరస్సులు, కుంటలు, రిజర్వాయర్ల అనుసంధానం. ఎండిపోయిన 30 వేల చెరువుల పునరుద్ధరణ. రెండు ల క్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 2 వేల చెరువుల నిర్మాణం. మూసీ ప్రక్షాళన, ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం. ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు నామకరణం. గిరిజన వర్సి టీ, గిరిజన కమిషన్ ఏర్పాటు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా 3 ఎకరాల భూమి లేదా హైదరాబాద్‌లో 200 గజాల స్థలం. దీంతోపాటు పెన్షన్. తెలంగాణ యోధుల చరిత్రను ప్రతిబింబించేలా వరంగల్‌లో ప్రత్యేక స్మారక నిర్మాణం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట. ఆరోతరగతి నుంచి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 25 వేల మందికి, మెడిసిన్, ఎంబీఏ సెట్లలో ఉత్తమ ర్యాంకులు సాధించిన 500 మందికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గర్భిణులకు తల్లిబిడ్డ పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున 21 నెలల పాటు పంపిణీ. -
బంగారు తెలంగాణ సాధిస్తాం
గన్‌పార్క్‌వద్ద టీ కాంగ్రెస్ నేతల ప్రతిజ్ఞ సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో పార్టీ టికెట్లు దక్కిన నేతలంతా మంగళవారం గన్‌పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. ‘సాధిస్తాం.. సాధిస్తాం.. పసిడి తెలంగాణ సాధిస్తాం..’ అని నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులందరితో ఈ మేరకు పొన్నాల ప్రమాణం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని, బీసీలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. గెలుపే ప్రధాన గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. వంద అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక నేతల ఒత్తిడి వల్ల టికెట్ల ఎంపికలో జేఏసీ నాయకులకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయామన్నారు. పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వినయ్‌కుమార్, భార్గవ్ దేశ్‌పాండే, ఒబేదుల్లా కొత్వాల్, సామకృష్ణారెడ్డి తదితరులు ధీమా వ్యక్తంచేశారు. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ
బీర్కూర్,న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, తెలంగాణ అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బీర్కూర్ మండలంలోని దామరంచ, రైతునగర్, అన్నారం తదితర గ్రామాల్లో ఆయన ఎంపీటీసీ, జడ్పిటీసీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీపులో గ్రామంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దామరంచ గ్రామంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన త ర్వాత వచ్చే మూడేళ్లలో రైతులకు 24గంటల కరెంటును అందిస్తామని తెలిపారు. ప్రతీ మండలంలోను గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు పెర్క శ్రీనివాస్, ద్రోణవల్లి సతీష్, తోట నారాయణ, అప్పారావ్, ఎంపీటీసీ అభ్యర్థి గంగారాం, జడ్పీటీసీ అభ్యర్థి కిషన్‌నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గెలుపోటములకు నాదే బాధ్యత: పొన్నాల
సామాజిక న్యాయానికి పెద్దపీట: పొన్నాల కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దనే చెప్పారు ‘బంగారు తెలంగాణ’ కోసమే ఇంకా తలుపులు తెరిచి ఉంచాం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, ఆ కోణంలో అంశంపైనే తొలి సంతకం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే తప్ప టీఆర్ఎస్తో కాదని అన్నారు. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దని ముక్తకంఠంతో చెప్పినా ‘బంగారు తెలంగాణ’ కోసమే కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం తలుపులు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. * తెలంగాణ ఏర్పాటుకు రెండు అంశాలే కారణం. అసువులు బాసిన అమరుల త్యాగాలవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడితే, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతోపాటు సోనియాగాంధీ చేసిన కృషివల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలో 27 కొత్త రాష్ట్రాలు కావాలనే డిమాండ్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాత్రం ఇచ్చింది. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఇద్దరు సభ్యులే ఉన్నారు. వారిద్దరిమధ్యా సమన్వయం లేదు, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబితే ఎవరు నమ్ముతారు? * తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతో పార్టీ పెట్టిన వాళ్లు ఇప్పుడు పునర్నిర్మాణం అంటున్నారు. పునర్నిర్మాణం అనే పదానికి అసలైన అర్థమేమిటో మీకు (మీడియా) తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో గత పదేళ్లలో మన రాష్ట్రం ఎంతో ముందుంది. జాతీయ సగటు ఆదాయంకంటే 20 శాతం పెరిగింది. ‘బంగారు తెలంగాణ’ సాధించే దిశగా కాంగ్రెస్ ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోంది. 25 ఏళ్ల కోసం ప్రణాళికను రూపొందిస్తున్నాం. 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా 15.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 50 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి. * రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీ పదేపదే రెచ్చగొడుతోంది. తద్వారా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. * కాంగ్రెస్ నుంచి ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లడం లేదు. కొండా సురేఖ దంపతులు పార్టీలు తిరిగి వచ్చారు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటామని రాసిచ్చారు. వారు కోరిన వెంటనే మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించి బి.ఫారాలు వారి చేతికిచ్చాం. ఆ తరువాత గంటకే టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా ఎక్కడా లేనివిధంగా 87.2 శాతం తెలంగాణలో ఉంది. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు సామాజిక కోణంతో ముడిపడి ఉంది. అధికారంలోకి వస్తే తప్పకుండా సామాజిక న్యాయం దిశగానే చర్యలు తీసుకుంటాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కృషిచేస్తాం. * ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో తెలంగాణ బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకు వ్యవహరిస్తాం. పోలవరం డిజైన్ మార్పు విషయంలోనూ అంతే. బిల్లులో ఆ రెండు అంశాలకు సంబంధించి పరిష్కార మార్గాలున్నాయి. పోలవరం మాదిరిగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం. * వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది.