ఇలా చేస్తేనే బంగారు తెలంగాణ
జగద్గిరిగుట్ట: ప్రభుత్వాధినేతలు పదేపదే చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిపోవాలంటే తమ ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనన్నారు ఐద్వా నాయకురాళ్లు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్‌లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో వివరించారు.
తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించడంతోపాటు మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నివారించగలిగినప్పుడే బంగారు తెలంగాణ వైపు అడుగులు పడినట్లని స్వరాజ్యం అన్నారు. మద్యం మహమ్మారిని తరిమేందుకు, మహిళలపై దాడులను నియంత్రించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు.
ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవరపల్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కనీసం అక్కడయినా జ్ఞానం తెచ్చుకుని ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటున్నారని ఆవేదన చెందారు.
ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు కొత్తగా చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలల హక్కుల ఉద్యమకారిణి శాంతాసిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఇందిర, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి సహా పలువురు మహిళలు హాజరయ్యారు.