mallu swarajyam
-
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్‌లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్‌నగర్‌లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
మల్లు స్వరాజ్యానికి ఆత్మీయ నివాళి
రాయదుర్గం(హైదరాబాద్): భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం ఆయుధం చేతపట్టి రజాకార్లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకతీతంగా నేతలు ఘనమైన నివాళులు అర్పించారు. రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘అమ్మకు వందనం’పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ, రాంసుందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులు మల్లు స్వరాజ్యంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పేదల పక్షాన ఆమె జీవితాంతం చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఎదురుగా ఉంచిన పుస్తకంలో ఆమె గురించిన జ్ఞాపకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు నమోదు చేశారు. కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రజాగాయకుడు గద్దర్, ఆయా పార్టీల నాయకులు డాక్టర్ కె.నారాయణ, ఎన్.ఇంద్రసేనారెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జనారణ్యంలో గెరిల్లా
ఎర్ర పూల వనంలోని మరో పువ్వు రాలింది. ఆ పువ్వే మల్లు స్వరాజ్యం. తెరిచిన పుస్తకం వంటి ఆమె జీవితం ప్రతి మహిళకూ ఒక పాఠ్యాంశం. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళకూ ఆమె జిందగీ ఒక పాఠశాల. 92 సంవత్సరాల నిండు జీవితం ఆమెది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు తరాల ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా అనిపిస్తుంది. దేశ స్వాతంత్రోద్యమంలోనూ, దేశ చరిత్రను మలుపు తిప్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, మహిళా ఉద్యమాల్లోనూ పాల్గొన్న వారూ, నాయకత్వం వహించిన స్త్రీలూ అనేకమంది లేకపోలేదు. కానీ తుది శ్వాస వరకు (ఎనభై ఏళ్లపాటు) ఉద్యమాలలో కొనసాగినవారు బహు అరుదు. ఒక కళాకారిణి, ఒక విప్లవకారిణి, ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళా హక్కుల నేత, ఒక మాతృమూర్తి... ఇలా ప్రజా జీవితంలో ఆమె పాత్రలెన్నో! 11–12 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైన స్వరాజ్యం ప్రజా జీవన ప్రస్థా నంలో ఎన్నో ఘట్టాలున్నాయి. అతి చిన్న వయసులో వ్యవ సాయ కార్మికులను, ప్రత్యేకించి స్త్రీలను ప్రోత్సహించి సమ్మె చేయించారు. ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసి అత్తగారింటికి ఈడ్చుకు పోతుంటే పిల్లల గుంపును పోగుచేసి అడ్డుకున్నారు. ఫ్యూడల్ దొరల పెత్తనం కింద నలిగిపోయిన ఆనాటి తెలంగాణలో వ్యవసాయ కార్మిక స్త్రీల స్థితి కడు దయనీయం. పచ్చి బాలింత అయినా రోజుల పసికందుని వదిలి దొరల పొలాల్లో పనికి వెళ్లక తప్పేది కాదు. ‘పాలు చేపుకు వచ్చినాయి దొరా... చంటి బిడ్డకు పాలిచ్చి వస్తాను’ అని అన్నా వదలకుండా, ఏది చూపించు, అని చనుబాలు పిండించిన పైశాచికానందం నాటి దొరలది. ‘నాగళ్ల మీదున్న ఉయ్యాలో... నాయన్న లారా ఉయ్యాలో... చీమూ నెత్తురు లేదా ఉయ్యాలో... తిరగబడ రేమయ్యా ఉయ్యాలో...’ అంటూ మెదడు మొద్దుబారి పోయి అచేతనంగా ఉన్న అణగారిన పేదల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవనారి! ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి రగులుతున్న తెలంగాణ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. 1946 నాటికి సాయుధపోరాటం ఆరంభమయ్యింది. పోరాట కాలంలోనూ, విరమణ తరువాత కూడ ఏడేళ్లపాటు ఆమె పూర్తిగా జనంలోనే తిరిగారు. ఇంటి ముఖం చూడలేదు. 16 ఏళ్ల వయసు నుంచి 23వ ఏడు వరకు నల్లగొండ, వరంగల్, ఇప్పటి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ఉద్యమాన్ని విస్తరింపజేశారు. అటవీ ప్రాంతమే ఆమె నివాసం. ఒకా నొక దశలో ఆమే దళ కమాండర్. ఆమె తోటి దళసభ్యుల్లో ఒకరు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి (వీఎన్). పోరాట విరమణ అనంతరం ఆమె జీవిత భాగస్వామి అయ్యారాయన. స్వరాజ్యం జీవితం గురించి చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలు. కామ్రేడ్ వీఎన్ ఉద్యమ బాధ్యతలు ఒక తపస్సులా నిర్వహిస్తే... కుటుంబ బాధ్యతను తాను భుజాన వేసుకుని రైతు స్త్రీగా పొలం దున్ని, సాగుచేసి పిల్లల్ని సాకారు స్వరాజ్యం. అయినా రాజకీయాలు మరువ లేదు. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి ఉరుకుతూ, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ప్రజా ఉద్యమాలను కాపాడు కుంటూ వచ్చారు. హైదరాబాద్‌లో అప్పట్లో రమీజా అనే మహిళపై పోలీసులు అత్యాచారం చేసి... ‘ఆమె మంచిది కాదు’ అనే ప్రచారం చేస్తూ... తమ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. స్వరాజ్యం వారికి వ్యతిరేకంగా పోరాడి బాధితురాలికి అండగా నిలిచారు. పోరాట కాలంలో స్త్రీలకు కూడా ఆయుధ శిక్షణ ఇప్పించాలని పట్టుబట్టడం, దళ సభ్యురాలిగా ఉన్న కోయ మహిళ నాగమ్మలో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్స హించడం, దాంపత్య జీవితంలో స్త్రీల ఇష్టానికి విలువ ఇవ్వాలని, ఇష్టం లేని పెళ్లి నుండి బయట పడే హక్కు స్త్రీలకు ఉండాలని, ఆస్తి పంపకాలలో స్త్రీలకు కూడా వాటా అవసరమని పట్టుబట్టడం... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలోనూ స్వరాజ్యం స్త్రీల సమస్యలను వినిపించారు. శాసనసభను వేదికగా చేసుకొని ఎన్నో సమస్యలపై గళం విప్పి మాట్లాడారు. స్త్రీల మరుగుదొడ్ల సమస్యలు, మంచి నీటి సమస్యలు, ప్రసూతి సౌకర్యాల గురించి మాట్లాడి ‘మరుగుదొడ్ల స్వరాజ్యం’ అని వ్యంగ్యోక్తులు పడటానికి వెరవ లేదు. ఆమె జనారణ్యంలో గెరిల్లా. ఇక్కడ ఒక ఘటన చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక రైతు బ్యాంకుకు అప్పు పడ్డాడు. బ్యాంకు ఆయన ఎడ్ల బండిని ఎడ్లతో సహా జప్తు చేసింది. బండిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. రైతు వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న స్వరాజ్యం దగ్గర మొత్తుకున్నాడు. పోలీస్టేషన్‌కు పోయి ఘర్షణకు దిగారు. పోలీస్ డిపార్ట్మెంట్ వినదు కదా! ‘చట్టం తన పని తాను చేస్తుంది’ అని ముక్తాయిస్తుంది. ‘మంచిది. ప్రజా నాయకు రాలిగా నా పని నేను చేస్తున్న. నీ ఇష్టం వచ్చింది చేసుకో’ అని ఎడ్లతో సహా బండిని రైతుకు అప్పగించించారామె. ఇది స్వరాజ్యం గెరిల్లా తత్వం. ఇటువంటి అనుభవాలు ఎన్నో! స్త్రీలకు ఆస్తి హక్కు నిత్యం ఆమె నోట్లో నానుతూ ఉండే సమస్యల్లో ఒకటి. వారసత్వ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా వాటా కావాలన్నది మహిళా ఉద్యమం చిరకాల లక్ష్యం. ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టానికి మార్పులు తెచ్చే క్రమంలో అసెంబ్లీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యురాలిగా ఆమె రాష్ట్రమం తటా పర్యటించి వారసత్వ ఆస్తితోపాటు భర్త ఆస్తిలో కూడా వాటా కావాలనే మహిళా సంఘం డిమాండును సూర్యా వతి, ఉదయంలతో కలిసి ముందుకు తెచ్చారు. స్వరాజ్యంలో ఉన్న విశేషం ఏమిటంటే.. ఆమె పుట్టింది భూస్వామి కుటుంబంలో అయినా వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాల ప్రేమను చూరగొనడం! ఆ జనం ఆమెను భూమికోసం, భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతినిధిగా భావిస్తారు. 80 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆమె చరిత్రను లిఖించింది. ఇప్పుడు చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మరో అధ్యాయానికి తెర లేచింది. ఎస్. పుణ్యవతి వ్యాసకర్త ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి ఈ–మెయిల్: comradepunyavathi@gmail.com -
‘అరుణ తార’కు అంతిమ వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/చిక్కడపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి ఆమె హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నల్లగొండలోని సీపీఎం కార్యాలయా నికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా నిర్వహిం చారు. సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, మాజీ ఎంపీ మధు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, సీపీఎం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ‘స్వరాజ్యం అమర్‌రహే’, ‘జోహార్ మల్లు స్వరాజ్యం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు హోరెత్తాయి. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మల్లు లక్ష్మి, జ్యోతి, సీతారాములు, వెంకట్, జూలకంటి, నారాయణ, చాడ, సుభాషిణి అలీ, రాఘవులు, తమ్మినేని, మధు తదితరులు ఎంబీ భవన్లో నేతల నివాళి... అంతకుముందు... ఆదివారం ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌కు స్వరాజ్యం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయంపై పార్టీ నేతలు, కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి ఎర్రజెండాను కప్పారు. కొడుకు మల్లు గౌతంరెడ్డి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళు, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలతోపాటు వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు భారీగా ఎంబీ భవన్‌కు తరలివచ్చి, నివాళుర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీపీఎం నేతలు డి.జి. నరసింహారావు, టి.జ్యోతి, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ. వీఎస్ బోస్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకుడు స్వామిగౌడ్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మోస్తున్న మహిళా నాయకులు ఆమె పోరాటం అందరికీ ఆదర్శం తెలంగాణ సాయుధ పోరాటంలో వెన్ను చూపని వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. పీడిత ప్రజలు, మహిళల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీకీ, ప్రజలకు ఆమె లేని లోటు తీరనిది. –సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు పోరాటం స్వరాజ్యం ఊపిరి పోరాటమే స్వరాజ్యం ఊపిరి. తుదిశ్వాస వరకు పోరుబాట వదల్లేదు. ఆమె పోరాట పటిమ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి. – బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మహిళలను చైతన్యం చేసిన వ్యక్తి 80 ఏళ్ల పాటు వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీర మల్లు స్వరాజ్యం. ఆమె చూపిన బాటలో నడిచి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక శకం ముగిసింది ‘మల్లు స్వరాజ్యం మరణంతో ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. తెలంగాణ సమాజానికే ఆమె స్పూర్తి. నిజాం ప్రభుత్వం ఆమెపై రివార్డు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమె కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం.’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ -
మల్లు స్వరాజ్యం పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
Mallu Swarajyam: అరుణ కిరణం అస్తమించింది
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి: ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్ అందుకొని, బందూకుల్ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మెడికల్ కళాశాలకు పార్థివదేహం.. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో భౌతికకాయం ఉంచుతారు. తర్వాత పార్థివదేహాన్ని నల్లగొండకు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటలవరకు నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల సందర్శణార్థం ఉంచుతారు. తర్వాత ర్యాలీగా ప్రభుత్వ జన రల్ ఆస్పత్రి వరకు తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించనున్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.. స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో జన్మించారు. రాంరెడ్డికి ఐదుగురు సంతానం. నర్సింహారెడ్డి, శశిరేఖ, సరస్వతి, స్వరాజ్యం, కుశలవరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పాటుబడిన ధీశాలి. దున్నే వాడికే భూమి కావాలని, దొరల పాలన పోవాలని 11 ఏళ్లప్పుడే పోరుబాట పట్టారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు. ఉద్యమ సహచరుడితో వివాహం.. సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో నాయకులు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావుల సమక్షంలో ఆర్భాటాలు లేకుండా పెళ్లిచేసుకున్నారు. వెంకటనర్సింహారెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మావిళ్లమడువ. వీరు సూర్యాపేట మండలం రాయినిగూడెంలో స్థిరపడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన నర్సింహారెడ్డి 2004 డిసెంబర్ 4న మరణించారు. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె కరుణ, కుమారులు గౌతంరెడ్డి, నాగార్జునరెడ్డి. పెద్దకుమారుడు గౌతం రెడ్డి ప్రభుత్వ హోమియో వైద్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మిర్యాలగూడ డివిజన్లో సీపీఎం నాయకుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె కరుణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మిర్యాలగూడ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఉన్నారు. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి న్యాయవాది. ప్రస్తుతం ఆయన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్న కోడలు లక్ష్మి మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా ఉన్నారు. పోరాటమే ఊపిరిగా.. నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. దొరల దురహంకారాన్ని ప్రశ్నిస్తూ పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు. స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగులబెట్టినా వెరవకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆమెను పట్టుకున్నవారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ ప్రస్థానం ఇలా.. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత స్వరాజ్యం రాజకీయాలలోకి వచ్చారు. రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్ ఫండ్ చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. కానీ, మల్లు స్వరాజ్యం తుంగతుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో కొట్లాడి కార్పస్ ఫండ్ చెల్లించకుండానే జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అనేక భూసమస్యలను పరిష్కరించారు. 1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’పుస్తక రూపంలో ప్రచురించారు. వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు. 91 ఏళ్ల వయోభారంలోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా పనిచేశారు. 8 దశాబ్దాల కిందట ఎర్రజెండాతో పెనవేసుకున్న మల్లు స్వరాజ్యం జీవితం కడవరకు పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. -
పోరు జెండా: మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం... పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‌పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్ చావుకు వెరవని గెరిల్లా యోధురాలు అసెంబ్లీలో ఆమె మాట తూటా పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా ఆమె పోరాటాల ఎర్రజెండా.. అన్నం పెట్టి... ఆలోచన మార్చుకుని.. బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే... చూస్తే అన్నం లేదు. బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు. మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’ స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు. రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా... ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది. కూలీరేట్ల పెంపు... పెద్ద మలుపు.. తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుం» మే అయినా... ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్. అప్పటికే పోలీస్ పటేల్ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో బీఎన్ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే... అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న... సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె. అయినా వినలేదు... తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ... మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు. ఆమె గొంతెత్తితే స్వరాజ్యం... గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. బాగా పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్ పెట్టారు. ఆ సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్. సభ సక్సెస్ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది. ‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే... భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో... ఆ వాడలే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే విప్లవగీతమయ్యారు. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు. 16 ఏళ్లకే గెరిల్లా... భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో్ల కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక. నల్గొండ, వరంగల్జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్పెత్తనాన్ని సవాలు చేస్తూ... ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏరా>్పటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం. ఎన్నటికీ మరవని సంఘటన... ఓ కోయగూడెంలో షెల్టర్ తీసుకున్నది దళం. ఆ ఇంట్లో బాలింత, ఆమె తల్లిద్రండులు ఉన్నారు. ఎట్ల తెలిసిందో ఏమో పోలీసులు గుడిసెను చుట్టుముట్టిన్రు. లోపలికి వస్తే స్వరాజ్యంను చూస్తారని దర్వాజ దగ్గరకెళ్లింది ఇంటి యజమాని సమ్మక్క. చంటిపిల్లను తీసుకుని స్వరాజ్యం బయటపడ్డది. కానీ ఆ కోయ స్త్రీని స్వరాజ్యం అనుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వెంటనే వెనక్కి వచ్చి ఆ పసిబిడ్డను వెనక్కి ఇచ్చేయడానికి లేదు. రెండు మూడు రోజులు దళంతో ఉంచుకోవాల్సి వచ్చింది. పాలు సరిగ్గా దొరక్క శిశువు మరణించింది. తాను స్వరాజ్యం కాదని పోలీసులకూ చెప్పలేదు. వారం రోజుల తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె గ్రామానికి వచ్చాక వెళ్లి కలిసింది దళం. ఆ తల్లిని చూసి కన్నీల్లు పెట్టుకున్నారు స్వరాజ్యం. ‘నీ బిడ్డను ఎత్తుకునిపోయి తప్పు చేశాను. వదిలిపెట్టినా బాగుండేదేమో’ అని పశ్చాత్తాప పడ్డారు. ‘నా బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నవు... కానీ ప్రజలకోసం నిన్ను వదులుకున్నది కదా మీ అమ్మ’ అని ఓదార్పు మాటలు పలికిందట ఆమె. ఆ ఇద్దరు తల్లుల త్యాగాన్ని నేనెప్పటికీ మరవను అని చెప్పేవారామె. బియ్యం బుక్కి... సాయుధ పోరాట విరమణ తరువాత.. 1954లో ఆమె పేరు మీద ఉన్న పదివేల రివార్డును ఎత్తివేసింది ప్రభుత్వం. అదే ఏడు హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఏడేళ్ల అజ్ఞాతవాసం తరువాత వేదికనెక్కిన ఆమెను చూడగానే ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె ప్రసంగం విన్న జనం ఉర్రూతలూగారు. ఆ సభ అనంతరం మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. భూస్వామ్య కుటుంబంనుంచి వచ్చినా... తల్లిద్రండుల నుంచి నుంచి గుంటెడు జాగ కూడా తీసుకోలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి సరిగ్గా లేని రోజులు. ఎప్పుడూ జొన్న గటక, జొన్నరొట్టెలే అన్నట్టుగా ఉండేది. దొరకక ఓసారి బియ్యం దొరికినయ్. అప్పుడు స్వరాజ్యం పచ్చి బాలింత. ఆకలైతుంటే... అవి వండి తినేసరికి ఆలస్యమైతదని పచ్చిబియ్యం బుక్కి కడుపు నింపుకొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా... ఎంచుకున్న మార్గంలో కష్టాలుంటయి మధ్యలో కంగారు పడితే లాభం లేదని బలంగా నమ్మారామె. ఏనాడూ తన మార్గం తప్పలేదు. నిజాయితీని వీడలేదు. ఎమ్మెల్యేగా మాటల తూటాలు.. సాయుధ పోరాట విరమణ తరువాత... 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్వరాజ్యం. 5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారామె. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె అసెంబ్లీకి వెళ్తే... బంట్రోతు లోపలికి వెళ్లనివ్వలేదు. ‘నేను ఎమ్మెల్యేను’ అని ఆమె చెప్పుకున్నా నమ్మలేదు. అంత సాదాసీదాగా అసెంబ్లీకి వెళ్లేవారామె. చట్టసభల్లో తన బాధ్యతనూ ఉద్యమంలాగే భావించారు. ఆమె సమస్యలపై స్వరాజ్యం మాట్లాడితే...అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘మాటలు తూటాల లెక్కన పేలుస్తున్నవ్... ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ’ అన్నారు. ఒక్కసారి మైక్ పట్టుకున్నారంటే అంతలా ఉండేది ఆమె వాగ్ధాటి. పోరాటం చేయని సమస్య లేదు... భూదానోద్యమంలో ఇచ్చినవి, పోరాటకాలంలో కమ్యూనిస్టులు పంచిన భూములు యూనియన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆక్రమించుకున్నరు దొరలు. ఎమ్మెల్యేగా ఉండి తిరిగి వాటిని ప్రజలకు అప్పగించడానికి రాజీలేని పోరాటం చేశారు. 900 ఎకరాల భూమిని తిరిగి ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే పదవీ వీడాక కూడా ఆమె పోరాట పంథాను వీడలేదు. 1993లో సంపూర్ణ మద్యనిషేధంలో ఆమెది చురుకైన పాత్ర. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమానహక్కు, వరకట్న వ్యతిరేక చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళల పేరిట భూ పంపిణీ... స్వరాజ్యం పోరాటం చేయని సమస్యే లేదు. గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. -
ఆమె జీవన గమనం స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆమె మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘ఆనాడు.. రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు సీఎం కేసీఆర్. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం.. గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్న సీఎం కేసీఆర్.. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ► ‘‘స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. చివరివరకు నమ్మిన సిద్ధాంతం కొసం పని చేసిన వ్యక్తి ఆమె. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడారు. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ► మల్లు స్వరాజ్యం.. గొప్ప నేత. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం. ఆమె మరణం తెలంగాణ కు తీరని లోటు. ఎంపీ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు ►నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నైజాం గుండాలను తరిమికొట్టి తెలంగాణ సాయుధపోరాటంలో పోరాడిన ఆమె పోరాట పటిమ ఎందరికో ఆదర్శమని గుర్తు చేసుకున్నాయన. ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో ఆమె నిలిచారని, ప్రజా ప్రతినిధిగానూ ఆమె ఎంతో గొప్ప కార్యక్రమాలను నిర్వహించారన్నారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు గుత్తా ఒక ప్రకటనలో తెలిపారు. ► సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వేర్వేరు సిద్దాంతాలు అయినా.. పేదల పక్షాన శ్రీమతి స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతి చెబుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. -
సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
-
సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ మల్లు స్వరాజ్యమే. మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు.. ► తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. ► 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్‌గా పని చేశారు. ► అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ► వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. ► మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. ► అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకు కూతురు పాదూరి కరుణ, కుమారులు మల్లు గౌతమ్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆమె చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా, చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. -
మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వాకబు చేశారు. కిషన్‌రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలున్నారు. -
మాట్లాడితే రూపాయి నోట్ల దండలు
‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని గెరిల్లాగా పాల్గొన్న యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మెల్యేగా’ పనిచేసిన 86 ఏళ్ల స్వరాజ్యం జీవిత కథను ‘నా మాటే తుపాకి తూటా’గా(కవర్ పేజీలో పొరపాటుంది) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. దీన్ని విమల, కాత్యాయని కథనం చేశారు. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ: ‘‘మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’ ‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’ ‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు. నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ ‘‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’ నా మాటే తూపాకి తూటా మల్లు స్వరాజ్యం ఆత్మకథ; కథనం: విమల, కాత్యాయని; పేజీలు: 136; వెల: 120; ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్: 040–23521849 -
నల్లగొండ సీపీఎం ఎంపీ అభ్యర్థిగా మల్లు లక్ష్మి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ పార్లమెంట్ సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి పేరును ఖరారు చేశారు. బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆమె తెలంగాణ సాయుధపోరాట యోధులు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి కోడలు. 1992 సంవత్సరంలో ఆమె ఐద్వా సభ్యురాలిగా చేరి మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలను నిర్వహించారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. ఐద్వాలో జిల్లా కార్యదర్శిగా ఆల్ ఇండియా కమిటీ సభ్యురాలిగా పనిచేసి 2014 సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు. ప్రస్తుతం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి పనిచేస్తున్నారు. మల్లు లక్ష్మి ఈనెల 25న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. -
రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ
మల్లు స్వరాజ్యం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాచరి కాన్ని మళ్లీ తేవాలనుకుంటే అది ఆయన వల్ల కాదని, రాచరికాన్ని, తానీషాలనే పూడ్చి పెట్టిన ఘనత తెలంగాణదని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అ న్నారు. కేసీఆర్‌కు ప్రగతిభవన్ ఎంత ముఖ్య మో.. తెలంగాణ ప్రజలకు ధర్నాచౌక్ కూడా అంతే ముఖ్యమన్నారు. సేవ్‌ధర్నాచౌక్ పేరు తో మఖ్థూం భవన్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు 11వ రోజుకు చేరుకు న్నాయి. మంగళవారం దీక్షలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, వర్కింగ్ ఉమెన్స్ ఫోరం, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి, మహిళా రైతు హక్కుల వేదిక, ప్రగతిశీల మహిళా సంఘం, నేషనల్ అల యన్స్ ఫర్ పీపుల్ మూమెంట్ సంఘాలు పాల్గొన్నాయి. ఇందులో మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... ధర్నాచౌక్‌ను ఎత్తివేసి సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారన్నారు. విద్యావేత్త ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ... అభివృద్ధి అంటే ప్రజల హక్కులను కాలరా యడం, భూములను లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. టీజేఏసీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సామాజిక కార్యకర్త దేవి, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఐద్వా నాయకురాలు జ్యోతి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్, అంకురం సంస్థ ప్రతినిధి సుమిత్ర తదిత రులు పాల్గొని ప్రసంగించారు. -
'ప్రజల ఆకాంక్షను కేసీఆర్ అర్థం చేసుకోవాలి'
జనగామ : జనగామ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధం చేసుకోవాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటి సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.జనగామ ప్రత్యేక జిల్లా కోసం చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం ఆమె ఇక్కడికి వచ్చారు. జనగామకు విచ్చేసిన మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... వీర తెలంగాణను వేరు తెలంగాణ చేసిన కేసీఆర్ జనగామను జిల్లా చేస్తే తప్పేముంది ప్రశ్నించారు. విస్నూరు దొరను తరిమికొట్టిన జనగామ వంటి పోరాటాల గడ్డను జిల్లాగా ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను మల్లు స్వరాజ్యం డిమాండ్ చేశారు. -
త్వరలో ప్రజా భూకంపం: స్వరాజ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలో ప్రజా భూకంపం రానుందని మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం గ్రేటర్ కమిటి ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. తన లాగ భూమిని పంచే ధైర్యం ఏ ఎమ్మెల్యేకైనా ఉందా అని సవాల్ చేశారు. ఒక్క ఉయ్యాల పాటతోనే ప్రజలందరిని చైతన్యం చేశామన్నారు. కమ్యూనిస్టులతోనే ప్రజల పాలన సాధ్యమన్నారు. కార్యక్రమంలో నర్సింగరావు, డాక్టర్ అందె సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యరహితమైనప్పుడే బంగారు తెలంగాణ
మల్లు స్వరాజ్యం వ్యాఖ్య ఐద్వా ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రం మద్యరహితమై, మహిళలపై దాడులు జరగకుండా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్‌లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో మద్యం నియంత్రణకు చేపట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగినసమావేశంలో మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవర పల్లికి వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాను అమలు చేయనున్న కొత్త ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసలై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటుంటే చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలో మగ్గే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.మద్యం నియంత్రణకు ఐద్వా ఆధ్వర్యంలో పోరుచేసేందుకే బస్సుయాత్రను ఎంచుకున్నామని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. మద్యం పేరిట జరుగుతున్న రాక్షస దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకు ఉద్యమానికి అండగా నిలవాలని స్వరాజ్యం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులంతా ప్రగతినగర్ గ్రామాన్ని సందర్శించి మద్యం లేకుంటే అభివృద్ధి ఎలాగుంటుందో పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పోరాట యోధురాలు, జాతీయ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్ ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా చేస్తేనే బంగారు తెలంగాణ
జగద్గిరిగుట్ట: ప్రభుత్వాధినేతలు పదేపదే చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిపోవాలంటే తమ ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనన్నారు ఐద్వా నాయకురాళ్లు. కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్‌లో సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం.. బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించడంతోపాటు మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నివారించగలిగినప్పుడే బంగారు తెలంగాణ వైపు అడుగులు పడినట్లని స్వరాజ్యం అన్నారు. మద్యం మహమ్మారిని తరిమేందుకు, మహిళలపై దాడులను నియంత్రించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఉత్తమ గ్రామంగా ఉన్న గంగదేవరపల్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కనీసం అక్కడయినా జ్ఞానం తెచ్చుకుని ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు మద్యానికి బానిసై తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటున్నారని ఆవేదన చెందారు. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు కొత్తగా చీప్ లిక్కర్ విధానాన్ని తీసుకువచ్చి పేదలను మరింత పేదరికంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలల హక్కుల ఉద్యమకారిణి శాంతాసిన్హా, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు కె.జ్యోతి, ఇందిర, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి సహా పలువురు మహిళలు హాజరయ్యారు. -
తెలంగాణకు నష్టం జరగనివ్వొద్దు
సీఎం కేసీఆర్‌కు మల్లు స్వరాజ్యం సూచన హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా, అట్టడుగువర్గాల ప్రజలకు తిండి, బట్ట, ఇళ్లు వంటి కనీస అవసరాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం సూచించారు. బుధవారం సెక్రటేరియట్లో తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాధికార బతుకమ్మ సంబురాల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘కేసీఆర్‌కు తెల్వక రా రమ్మని కంపెనీలను పిలుస్తున్నడు. వచ్చే కంపెనీలేమో వందల ఎకరాలు కావాలంటున్నాయి. దళితులకు పంపిణీకి 3 ఎకరాల భూమి అంటేనే దొరకడం లేదు. అభిమన్యుడిగా కేసీఆర్ ఇరుక్కుపోతాడేమో ఆలోచించుకోవాలి. భద్రంగా వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు. సాయుధపోరాట పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు.ప్రొఫెసర్ రమా మెల్కొటే, ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ, ప్రొఫెసర్ కె.లక్ష్మి, ప్రొఫెసర్ అండమ్మ, దేవకీదేవి, రత్నమాలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సన్మానించారు. సంఘం అధ్యక్షురాలు జె.సుభద్ర మాట్లాడుతూ బతుకమ్మను రాజకీయం చేయొద్దన్నారు. అంతకుముందు సచివాలయ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో భాష, జాతి, సంస్కృతిపై దాడి జరిగిందన్నారు. బతుకమ్మ ఉద్యమస్ఫూర్తిని రగిలించిందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎస్పీ భార్య, హోంగార్డు భార్య కలిసి బతుకమ్మ ఆడారంటే.. ఈ పండుగ అంతరాలను ఏవిధంగా చెరిపేసిందో అర్థమవుతుందన్నారు. -
' సింగపూర్, మాదాపూర్ ల వెంటబడొద్దు'
హైదరాబాద్: అభివృద్ధి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... సింగపూర్, మాదాపూర్ ల వెంటబడడం సరికాదని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. పేదల అభ్యున్నతి, సమగ్ర సామాజిక అభివృద్ధితో సమాజంలో అంతరాలను తగ్గించడంపై కేసీఆర్ దృష్టి సారించాలని ఆమె సూచించారు. తెలంగాణ సచివాలయంలో బుధవారం జరిగిన బతుకమ్మ పురస్కారాల ప్రదానోత్సంలో ఆమె పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
దోపిడీదారులను అడ్డుకునే దమ్ముందా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మల్లు స్వరాజ్యం సవాల్ హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా తెలంగాణ మహాసభ హైదరాబాద్ : ‘నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి, నాటి వీర తెలంగాణ పోరాటానికి నక్కకు- నాక లోకానికి ఉన్న తేడా ఉంది. ఆనాటి పోరాటంలో మేం దోపిడీదారులకు ముకుతాడు వేశాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజలను దోచుకుంటున్న నేటి దోపిడీదారులను నిర్మూలించాలి’ అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభ శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్, మల్లు స్వరాజ్యం హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది కమ్యూనిస్టులేనని, రాజకీయ నాయకులకు దమ్ముంటే తనతో గాని, ప్రజా ఉద్యమ కారులతో గాని డబ్బుల్లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ప్రధాని మోదీది మనువాదమా..? మానవతా వాదమా.. తేల్చుకోవాలన్నారు. ప్రధాని మోదీ మహిళల సంక్షేమం కోరుకునే వాడైతే పార్లమెంట్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. దళితులకు మాత్రమే భూమి పంపిణీ చేస్తామని చెప్తున్న కేసీఆర్ .. దళితులు మిగతా బలహీన వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పిన నరేంద్రమోదీ ఆహార భద్రత, ఐసీడీఎస్, ఉపాధి హామీ పథకాలపై సరైన దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు బి.హైమావతి తదితరులు పాల్గొన్నారు.