సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ మల్లు స్వరాజ్యమే.
మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు..
► తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం.
► 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్‌గా పని చేశారు.
► అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు.
► వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు.
► మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.
► అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకు కూతురు పాదూరి కరుణ, కుమారులు మల్లు గౌతమ్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆమె చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా, చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment