నివాళి
ఎర్ర పూల వనంలోని మరో పువ్వు రాలింది. ఆ పువ్వే మల్లు స్వరాజ్యం. తెరిచిన పుస్తకం వంటి ఆమె జీవితం ప్రతి మహిళకూ ఒక పాఠ్యాంశం. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళకూ ఆమె జిందగీ ఒక పాఠశాల. 92 సంవత్సరాల నిండు జీవితం ఆమెది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు తరాల ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా అనిపిస్తుంది. దేశ స్వాతంత్రోద్యమంలోనూ, దేశ చరిత్రను మలుపు తిప్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, మహిళా ఉద్యమాల్లోనూ పాల్గొన్న వారూ, నాయకత్వం వహించిన స్త్రీలూ అనేకమంది లేకపోలేదు. కానీ తుది శ్వాస వరకు (ఎనభై ఏళ్లపాటు) ఉద్యమాలలో కొనసాగినవారు బహు అరుదు.
ఒక కళాకారిణి, ఒక విప్లవకారిణి, ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళా హక్కుల నేత, ఒక మాతృమూర్తి... ఇలా ప్రజా జీవితంలో ఆమె పాత్రలెన్నో! 11–12 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైన స్వరాజ్యం ప్రజా జీవన ప్రస్థా నంలో ఎన్నో ఘట్టాలున్నాయి. అతి చిన్న వయసులో వ్యవ సాయ కార్మికులను, ప్రత్యేకించి స్త్రీలను ప్రోత్సహించి సమ్మె చేయించారు. ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసి అత్తగారింటికి ఈడ్చుకు పోతుంటే పిల్లల గుంపును పోగుచేసి అడ్డుకున్నారు. ఫ్యూడల్ దొరల పెత్తనం కింద నలిగిపోయిన ఆనాటి తెలంగాణలో వ్యవసాయ కార్మిక స్త్రీల స్థితి కడు దయనీయం. పచ్చి బాలింత అయినా రోజుల పసికందుని వదిలి దొరల పొలాల్లో పనికి వెళ్లక తప్పేది కాదు. ‘పాలు చేపుకు వచ్చినాయి దొరా... చంటి బిడ్డకు పాలిచ్చి వస్తాను’ అని అన్నా వదలకుండా, ఏది చూపించు, అని చనుబాలు పిండించిన పైశాచికానందం నాటి దొరలది.
‘నాగళ్ల మీదున్న ఉయ్యాలో... నాయన్న లారా ఉయ్యాలో... చీమూ నెత్తురు లేదా ఉయ్యాలో... తిరగబడ రేమయ్యా ఉయ్యాలో...’ అంటూ మెదడు మొద్దుబారి పోయి అచేతనంగా ఉన్న అణగారిన పేదల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవనారి!
ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి రగులుతున్న తెలంగాణ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. 1946 నాటికి సాయుధపోరాటం ఆరంభమయ్యింది. పోరాట కాలంలోనూ, విరమణ తరువాత కూడ ఏడేళ్లపాటు ఆమె పూర్తిగా జనంలోనే తిరిగారు. ఇంటి ముఖం చూడలేదు. 16 ఏళ్ల వయసు నుంచి 23వ ఏడు వరకు నల్లగొండ, వరంగల్, ఇప్పటి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ఉద్యమాన్ని విస్తరింపజేశారు. అటవీ ప్రాంతమే ఆమె నివాసం. ఒకా
నొక దశలో ఆమే దళ కమాండర్. ఆమె తోటి దళసభ్యుల్లో ఒకరు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి (వీఎన్). పోరాట విరమణ అనంతరం ఆమె జీవిత భాగస్వామి అయ్యారాయన.
స్వరాజ్యం జీవితం గురించి చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలు. కామ్రేడ్ వీఎన్ ఉద్యమ బాధ్యతలు ఒక తపస్సులా నిర్వహిస్తే... కుటుంబ బాధ్యతను తాను భుజాన వేసుకుని రైతు స్త్రీగా పొలం దున్ని, సాగుచేసి పిల్లల్ని సాకారు స్వరాజ్యం. అయినా రాజకీయాలు మరువ లేదు. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి ఉరుకుతూ, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ప్రజా ఉద్యమాలను కాపాడు కుంటూ వచ్చారు. హైదరాబాద్‌లో అప్పట్లో రమీజా అనే మహిళపై పోలీసులు అత్యాచారం చేసి... ‘ఆమె మంచిది కాదు’ అనే ప్రచారం చేస్తూ... తమ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. స్వరాజ్యం వారికి వ్యతిరేకంగా పోరాడి బాధితురాలికి అండగా నిలిచారు.
పోరాట కాలంలో స్త్రీలకు కూడా ఆయుధ శిక్షణ ఇప్పించాలని పట్టుబట్టడం, దళ సభ్యురాలిగా ఉన్న కోయ మహిళ నాగమ్మలో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్స హించడం, దాంపత్య జీవితంలో స్త్రీల ఇష్టానికి విలువ ఇవ్వాలని, ఇష్టం లేని పెళ్లి నుండి బయట పడే హక్కు స్త్రీలకు ఉండాలని, ఆస్తి పంపకాలలో స్త్రీలకు కూడా వాటా అవసరమని పట్టుబట్టడం... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలోనూ స్వరాజ్యం స్త్రీల సమస్యలను వినిపించారు.
శాసనసభను వేదికగా చేసుకొని ఎన్నో సమస్యలపై గళం విప్పి మాట్లాడారు. స్త్రీల మరుగుదొడ్ల సమస్యలు, మంచి నీటి సమస్యలు, ప్రసూతి సౌకర్యాల గురించి మాట్లాడి ‘మరుగుదొడ్ల స్వరాజ్యం’ అని వ్యంగ్యోక్తులు పడటానికి వెరవ లేదు.
ఆమె జనారణ్యంలో గెరిల్లా. ఇక్కడ ఒక ఘటన చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక రైతు బ్యాంకుకు అప్పు పడ్డాడు. బ్యాంకు ఆయన ఎడ్ల బండిని ఎడ్లతో సహా జప్తు చేసింది. బండిని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. రైతు వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న స్వరాజ్యం దగ్గర మొత్తుకున్నాడు. పోలీస్టేషన్‌కు పోయి ఘర్షణకు దిగారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వినదు కదా! ‘చట్టం తన పని తాను చేస్తుంది’ అని ముక్తాయిస్తుంది. ‘మంచిది. ప్రజా నాయకు రాలిగా నా పని నేను చేస్తున్న. నీ ఇష్టం వచ్చింది చేసుకో’ అని ఎడ్లతో సహా బండిని రైతుకు అప్పగించించారామె. ఇది స్వరాజ్యం గెరిల్లా తత్వం. ఇటువంటి అనుభవాలు ఎన్నో!
స్త్రీలకు ఆస్తి హక్కు నిత్యం ఆమె నోట్లో నానుతూ ఉండే సమస్యల్లో ఒకటి. వారసత్వ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా వాటా కావాలన్నది మహిళా ఉద్యమం చిరకాల లక్ష్యం. ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టానికి మార్పులు తెచ్చే క్రమంలో అసెంబ్లీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యురాలిగా ఆమె రాష్ట్రమం తటా పర్యటించి వారసత్వ ఆస్తితోపాటు భర్త ఆస్తిలో కూడా వాటా కావాలనే మహిళా సంఘం డిమాండును సూర్యా వతి, ఉదయంలతో కలిసి ముందుకు తెచ్చారు.
స్వరాజ్యంలో ఉన్న విశేషం ఏమిటంటే.. ఆమె పుట్టింది భూస్వామి కుటుంబంలో అయినా వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాల ప్రేమను చూరగొనడం! ఆ జనం ఆమెను భూమికోసం, భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతినిధిగా భావిస్తారు. 80 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆమె చరిత్రను లిఖించింది. ఇప్పుడు చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మరో అధ్యాయానికి తెర లేచింది.
ఎస్. పుణ్యవతి
వ్యాసకర్త ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి
ఈ–మెయిల్: comradepunyavathi@gmail.com
Comments
Please login to add a commentAdd a comment