మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని నల్లగొండ మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్న పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/చిక్కడపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి ఆమె హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నల్లగొండలోని సీపీఎం కార్యాలయా నికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు.
సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా నిర్వహిం చారు. సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, మాజీ ఎంపీ మధు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, సీపీఎం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ‘స్వరాజ్యం అమర్‌రహే’, ‘జోహార్ మల్లు స్వరాజ్యం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు హోరెత్తాయి. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు.
మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మల్లు లక్ష్మి, జ్యోతి, సీతారాములు, వెంకట్, జూలకంటి, నారాయణ, చాడ, సుభాషిణి అలీ, రాఘవులు, తమ్మినేని, మధు తదితరులు
ఎంబీ భవన్‌లో నేతల నివాళి...
అంతకుముందు... ఆదివారం ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌కు స్వరాజ్యం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయంపై పార్టీ నేతలు, కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి ఎర్రజెండాను కప్పారు. కొడుకు మల్లు గౌతంరెడ్డి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళు, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమెను కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలతోపాటు వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు భారీగా ఎంబీ భవన్‌కు తరలివచ్చి, నివాళుర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీపీఎం నేతలు డి.జి. నరసింహారావు, టి.జ్యోతి, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ. వీఎస్ బోస్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకుడు స్వామిగౌడ్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మోస్తున్న మహిళా నాయకులు
ఆమె పోరాటం అందరికీ ఆదర్శం
తెలంగాణ సాయుధ పోరాటంలో వెన్ను చూపని వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. పీడిత ప్రజలు, మహిళల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీకీ, ప్రజలకు ఆమె లేని లోటు తీరనిది.
–సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు
పోరాటం స్వరాజ్యం ఊపిరి
పోరాటమే స్వరాజ్యం ఊపిరి. తుదిశ్వాస వరకు పోరుబాట వదల్లేదు. ఆమె పోరాట పటిమ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి.
– బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు
మహిళలను చైతన్యం చేసిన వ్యక్తి
80 ఏళ్ల పాటు వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీర మల్లు స్వరాజ్యం. ఆమె చూపిన బాటలో నడిచి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఒక శకం ముగిసింది
‘మల్లు స్వరాజ్యం మరణంతో ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. తెలంగాణ సమాజానికే ఆమె స్పూర్తి. నిజాం ప్రభుత్వం ఆమెపై రివార్డు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమె కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం.’
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment