rich tributes
-
‘అరుణ తార’కు అంతిమ వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/చిక్కడపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి ఆమె హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నల్లగొండలోని సీపీఎం కార్యాలయా నికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా నిర్వహిం చారు. సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, మాజీ ఎంపీ మధు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, సీపీఎం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ‘స్వరాజ్యం అమర్‌రహే’, ‘జోహార్ మల్లు స్వరాజ్యం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు హోరెత్తాయి. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మల్లు లక్ష్మి, జ్యోతి, సీతారాములు, వెంకట్, జూలకంటి, నారాయణ, చాడ, సుభాషిణి అలీ, రాఘవులు, తమ్మినేని, మధు తదితరులు ఎంబీ భవన్లో నేతల నివాళి... అంతకుముందు... ఆదివారం ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌కు స్వరాజ్యం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయంపై పార్టీ నేతలు, కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి ఎర్రజెండాను కప్పారు. కొడుకు మల్లు గౌతంరెడ్డి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళు, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలతోపాటు వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు భారీగా ఎంబీ భవన్‌కు తరలివచ్చి, నివాళుర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీపీఎం నేతలు డి.జి. నరసింహారావు, టి.జ్యోతి, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ. వీఎస్ బోస్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకుడు స్వామిగౌడ్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మోస్తున్న మహిళా నాయకులు ఆమె పోరాటం అందరికీ ఆదర్శం తెలంగాణ సాయుధ పోరాటంలో వెన్ను చూపని వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. పీడిత ప్రజలు, మహిళల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీకీ, ప్రజలకు ఆమె లేని లోటు తీరనిది. –సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు పోరాటం స్వరాజ్యం ఊపిరి పోరాటమే స్వరాజ్యం ఊపిరి. తుదిశ్వాస వరకు పోరుబాట వదల్లేదు. ఆమె పోరాట పటిమ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి. – బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మహిళలను చైతన్యం చేసిన వ్యక్తి 80 ఏళ్ల పాటు వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీర మల్లు స్వరాజ్యం. ఆమె చూపిన బాటలో నడిచి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక శకం ముగిసింది ‘మల్లు స్వరాజ్యం మరణంతో ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. తెలంగాణ సమాజానికే ఆమె స్పూర్తి. నిజాం ప్రభుత్వం ఆమెపై రివార్డు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమె కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం.’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ -
ఆటా, టాటా వేడుకల్లో మహానేత వైఎస్సార్‌కు ఘననివాళి
డల్లాస్ : ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాలు మూడు రోజులు పాటు(మే31-జూన్2) డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజైన శనివారం నాడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏటీసీ ప్రతినిధులు ఘననివాళి ఆర్పించారు. ఆయన జ్ఞాపకార్థం ‘సెలబ్రేటింగ్ డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అండ్ లెగసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు వైఎస్సార్‌తో వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ చిరకాల మిత్రుడు ప్రేమసాగర రెడ్డి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఆహుతులతో పంచుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ప్రతి సందర్భంలో ఆయన లేకపోవటం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ జీవితాంతం గుర్తుపెట్టుకునే మహామనిషి అన్నారు. సాయం కోసం వైఎస్సార్ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని.. ఆయన మనస్సున్న మహారాజని గుర్తుచేశారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్సార్ తనను హిందీ అకాడమీకి చైర్మన్‌గా నియమించటమే కాకుండా, అఖరి వరకు తనకు చేదోడువాదోడుగా నిలిచారని వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన నిజమైన నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. ఆయన స్నేహనికి ప్రాణమిచ్చే అరుదైన వ్యక్తి అని కొనియాడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబంతో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి మైలవరంతో ఉన్న అనుబంధాన్ని ఆయన ఆహుతులకు తెలియజేశారు. ఇతర వక్తలు మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణం ఇప్పటికి ఓ పీడకలలా వెంటాడుతుందన్నారు. ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల కోసం పోరాడుతూ తన తండ్రిని గుర్తుకు తెస్తున్నారని.. వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడు అవ్వాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాలను పూర్తి చేయగల సత్తా కేవలం వైఎస్ జగన్‌కే ఉందన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌కి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ రెడ్డి, రవి సన్నారెడ్డి, వైఎస్సార్ చిరకాల మిత్రులు రాఘవ రెడ్డి, డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, పరమేష్ భీంరెడ్డి, డా. మోహన్ మల్లం, డా.హరినాథ్ పొలిచర్ల, రాజేశ్వరరెడ్డి గంగసాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్లు డా.శ్రీధర్ కొర్సపాటి, డా. వాసుదేవతో పాటు అమెరికా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటానికి సహకరించిన హరిప్రసాద్ లింగాలకి కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
రామాచార్యులుకు చికాగోలో ఘననివాళి
సమాజ సేవకుడు, రాజకీయవేత్త పప్పూరు రామాచార్యుల జయంతి సందర్భంగా ఆయనకు చికాగోలో ఘనంగా నివాళులు అర్పించినట్లు చికాగో సాహితీ మిత్రుల సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చికాగోలోని పర్విల్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సాహితీ సభకు డాక్టర్ విశ్వనాథరెడ్డి అధ్యక్షత వహించారు. రామాచార్యులు గురించి ఆయన ముని మనవడు ధర్మవరం శ్రీనివాస కిరణ్ వివరించారు. రామాచార్యుల సంపాదకీయంలో వచ్చిన పలు పత్రికల గురించి 'సప్నా' అధ్యక్షురాలు శొంఠి శారదాపూర్ణ తెలిపారు. "రామయ్య పదాలు" పేరుతో రామాచార్యులు రాసిన ఆటవెలది పద్యాలను జయదేవ్ మెట్టుపల్లి పరిచయం చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను రామాచర్యులు ఆ రోజుల్లోనే గమనించి.. శ్రీబాగ్ ఒడంబడిక కోసం కృషి చేశారని డాక్టర్ విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా.. తిమ్మాపురం ప్రకాష్, డాక్టర్ రవి రెడ్డి, సుందర్ దిట్టకవి, భీమారెడ్డి తదితరులు రామాచార్యుల సాహితీ సేవలను వివరించారు. సభ ఏర్పాటుకు సహకరించిన యత్తపు శరత్, లింగారెడ్డిగారి వెంకటరెడ్డి, చిలమకూరు కృష్ణమోహన్‌లకు సాహితీమిత్రులు కృతఙ్ఞతలు తెలిపారు.