
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన మున్నూరు కాపులు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటారని పలువురు నేతలు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల ఎంపీగా ఎన్నికైన డి.శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌లను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంపీ కె. కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాకుండా వేరే ఎవరు ఆ స్థానంలో ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, కేసీఆర్ కాకుండా మరెవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ అభివృద్ధి చెందేది కాదని అన్నారు.
వెనుకబడ్డ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎంకు మున్నూరు కాపులు అండగా నిలవాలన్నా రు. జోగు రామన్న మాట్లాడుతూ మున్నూరు కాపులకు గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.