
రూ.1.10 లక్షల కోట్లతో బడ్జెట్
* సుదీర్ఘంగా కసరత్తు చేశాం: సీఎం కేసీఆర్
* టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేరిక సందర్భంగా రాజేంద్రనగర్‌లో భారీ బహిరంగ సభ
* రాజకీయ ఏకీకరణ ద్వారా బంగారు తెలంగాణ
* అందుకే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నాం
హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండబోవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మార్చి 31 నుంచి తెలుపు రేషన్ కార్డున్న పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని, బీసీలు, ఓసీ వర్గాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
2016-17 వార్షిక బడ్జెట్‌ను రూ. 1.10లక్షల కోట్లతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా శుక్రవారంరాత్రి 7 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడం, అన్ని పార్టీల రాజకీయ నేతలను కలుపుకొని వెళ్లి బంగారు తెలంగాణ నిర్మించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగానే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామన్నారు. ఇండియా టుడే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని తేల్చిందని, ఇదంతా తెలంగాణ ప్రజల గెలుపు మాత్రమేనని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఏదైనా హామీ ఇస్తే అది కచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పేదలున్నా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహిస్తానని, సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లో ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా అవసరమైన గ్రామాల్లోనే 111 నంబర్ జీవో అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్‌పై పదిహేను రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశామని, రూ.1.10 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్-రంగారెడ్డి త్వరలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బడ్జెట్‌లో తెలంగాణకు 50 శాతం కేటాయింపులు చూపేవారని, కానీ పదిశాతమే వాస్తవంగా కేటాయించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
వెటర్నరీ విద్యార్థుల ఆందోళన
సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో చివరన ఉన్న వెటర్నరీ కళాశాల విద్యార్థులు తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ బ్యానర్ ప్రదర్శించి, నినాదాలు చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. సభలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే యాద య్య, సంజీవరావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.