
‘తలసాని’ రాజీనామాపై మల్లగుల్లాలు!
రాజీనామా లేఖ అందలేదన్న అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం
ఇరకాటంలో అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు
ప్రజల్లో పలుచనవుతామని శ్రేణుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ‘బంగారు తెలంగాణ’.. ‘తెలంగాణ పునర్నిర్మాణం’ నినాదాలతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలను టీఆర్‌ఎస్ తన గూటికి చేర్చుకుంది. వలస వచ్చిన నేతలకు పదవులూ కట్టబెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇదే తరహాలో గులాబీ గూటికి చేరారు. అందరిలా ఆయన కూడా ఎమ్మెల్యేగా కొనసాగి ఉంటే అధికార పార్టీ ఇరుకున పడేది కాదు. కానీ తలసానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఇప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది.
మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు తలసాని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా లేఖను చూపించారు. ఆ లేఖను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ తన రాజీ నామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పేవారు. కానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక సమాచారం మేరకు అసలు తలసాని ఎలాంటి రాజీ నామా లేఖ రాయలేదని తేలింది. ఈ మేర కు శాసనసభ కార్యదర్శి కార్యాలయం త మకు తలసాని లేఖ అందలేదని ప్రకటిం చింది. దీంతో తలసానితో పాటు, ఆయనను చేర్చుకుని అందలం ఎక్కించిన టీఆర్‌ఎస్ కూ డా ఇరుకునపడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత అసెంబ్లీ సమావేశాల్లో తలసాని లక్ష్యంగానే విపక్షాలు అధికార పార్టీపై ధ్వజమెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మం త్రివర్గంలో ఎలా కొనసాగుతారని నిలదీశాయి. అయినా, అధికార పార్టీ పెద్దల నుంచి స్పందన లేకుండా పోయింది. ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు హైదరాబాద్‌లో విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికి సైతం ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా స్పీకర్‌తో తలసాని రాజీనామా ఆమోదంపై మాట్లాడారని, దీనిపై త్వరలో ని ర్ణయం వెలువడకుంటే, తానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ పేర్కొన్నారని సమాచారం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. తలసాని అసలు రాజీనామా చేయలేదని తేలడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ విమర్శలకు మరింత పదును పెట్టాయి. గవర్నర్, స్పీకర్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తలసాని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్‌ఎస్ నాయకత్వానికి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నా రు. దీనిపై నిర్ణయం ఆలస్యమయ్యేకొద్దీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరగడంతో పాటు.. ప్రజల్లో పలుచనైపోతామన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది.
దీంతో అధి నేత కేసీఆర్ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తలసాని విషయంలో వీలైనంత త్వరలోనే ఏదో ఒక చర్య తప్పక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. ఆమోదింపజేసి సనత్‌నగర్‌లో ఉపఎన్నికకు వెళతారా? లేక తాత్కాలికంగా ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? అన్నదానిపైనే నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.