బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా? | Nallamasa Krishna writes on Bangaru Telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా?

Published Sat, Feb 18 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా?

బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా?

సందర్భం
కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేయాలని అనేక సంవత్సరా లుగా వేరు వేరు రూపాలలో పాలకులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పాలకులు నడుంకట్టారు. టీఆర్‌ఎస్‌ అధి కారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల భూములు గుంజుకుని నిర్వాసితులను చేయడానికి  వెనకడుగు వేయని విషయాలలో  ‘కొత్తగూడెం ఎయి ర్‌పోర్టు’ ఒకటి.

ఈ ఎయిర్‌పోర్టును కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతి పరిధిలో ఉన్న 1,600 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. దీని పరిధి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బంగారు చేలుక, పును మడు చేలుక, తోకబండల, మర్రిగూడెం, గోల్లగూడెం, ఎర్రం చెలక, పాయవాల గుంపు మెుదలగు గ్రామాల ప్రజలు భూనిర్వా సితులు కానున్నారు.

ఈ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఉన్న ప్రాంతమంతా 5వ షెడ్యూల్‌ పరిధిలోనిదే. ఆదివాసీలు జనాభా 90 శాతం నివసి స్తున్నారు. 5వ షెడ్యూల్డు ప్రాంతం అయినప్పటికీ ఆదివాసీలకున్న రాజ్యాంగ రక్షణలను ఏ మాత్రం పట్టించుకోకుండా 1/70, పెసాలాంటి చట్టాలను అమలు చేయకుండా ప్రజలనూ బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనవి. ఎయిర్‌ ఇండియా అథా రిటి ఇప్పటికే అనుమతినిచ్చింది. భారీ ఎత్తున పోలీసుల మెుహ రింపు చేసి, రెయిడ్స్‌ బృందంవారు గ్రామాలలో సర్వే నిర్వహిం చారు. ప్రజలందరూ ఒకే మాటతో మాకొద్దు ఈ ఎయిర్‌పోర్టు అని వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిపై అణచివేతను ప్రయోగిస్తూ వారి భూములు లాక్కొనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.

ప్రజలు విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ అభివృద్ధి ముసుగులో ఏజెన్సీలోనీ సహజ సంపదను బహుళజాతి సంస్థ లకు కట్టబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నంగా విమానాశ్రయం ముందుకువచ్చింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలను అణచివేసేందుకు సైనిక స్థావరాలను అనుసంధానం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందనేది మరో రహస్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. ఇది సైనిక స్థావరం కాదని ప్రజల సౌకర్యం కోసమేనని ప్రభుత్వం చెపుతూ వస్తోంది.

కానీ దీని నిర్మాణం వెనుక ప్రకటిత లక్ష్యాలు ఏమిటి, అసలు లక్ష్యాలు ఏమిటి? అక్కడ విమానాశ్రయాన్ని నిర్మాణం చేయడానికి కానున్న వ్యయం ఎంత? దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఇప్పటి వరకు ప్రజలు విమానాశ్రయం కావాలని పాలకులకు నివేదించారా? ఏ హక్కుతో ఆదివాసీ ప్రజలను చట్ట విరుద్ధంగా బయటకు పంపాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు లేదు. పాలకుల తప్పుడు విధానాలను విమర్శించి ప్రజలను మేల్కొలిపితే వారిని అభివృద్ధి నిరోధకులు అనడం మామూలై పోయింది. విధ్వంసాన్ని ఆపమంటే అన్నింటికీ ఒకేS జవాబు. బంగారు తెలంగాణకు ఆటంకంగా ఉన్నారనో లేదా భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారని అనటం పాలకులకు ఒక సాధారణ పద్ధతిగా అలవాటైంది. ఇంతకు ఏది అభివృద్ధి?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకునే పాలకులు ఏనాడైనా అట్టడుగు ఆదివాసీ, దళిత పీడిత ప్రజల బాగోగులు చూశారా? విమానాలలో తిర గండి. ఇదిగో అభివృద్ధి వెలిగిపోతుందనే వారు కొత్తగూడెం జిల్లా ఆదివాసుల, ఇతర దళిత పేద వర్గాలకు విద్యా, వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదు. కానీ ఆదివాసీ ప్రజలను విమానం ఎక్కిస్తామని మన పాలకులంటున్నారు. దీనిని గట్టిగా విమర్శించలేని ప్రతిపక్ష పార్టీలు పైకో మాట లోపల మరో మాటతో కాలం వెళ్లదీస్తున్నారు. సరైన నష్ట పరిహారం, స్థల మార్పిడి లాంటి పనికిరాని అర్థంలేని ప్రతిపాదనలు పెడుతు న్నారు. పాలకులు నిర్దయగా అమలుచేసే సామ్రాజ్యవాద ‘అభి వృద్ధి’ని విధ్వంసంగా చెప్పే స్పష్టమైన రాజకీయ అవగాహన లేని విధానాలు అవలంభించే పార్టీల వల్ల ప్రజల పోరాటాలకు తగిన ఫలితం దక్కకుండా పోవడం కనిపిస్తూనే ఉంది.

మ«ధ్యతరగతి బుద్ధిజీవులలో కూడా కొందరు విమానాశ్ర యాన్ని కడితే ప్రయోజనమే కదా... అని అంటున్నారు. ఇది రాజ కీయ పార్టీలకు బలాన్ని ఇచ్చేవాదనే. నిజానికి దోపిడి వర్గ రాజ కీయ పార్టీల బలమంతా దానిలోనే ఉన్నది. వాస్తవంగా ఆ ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏమిటంటే విమానాశ్రయం పేరుతో నిర్మించేది సైనిక స్థావరం అయినప్పుడు దానిని కావాలని కోరు కోవడం వల్ల అంతిమంగా లాభం పొందేదెవరు? ఒకవేళ దానిలో కొంత భాగం పౌర విమానయానికి కేటాయించినప్పటికీ ఆ విమా నాలలో తిరిగే వారెవరు? ఇప్పటికీ గ్రామాలకు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని మైలారం గ్రామ పంచాయతిలోని ఏడు గ్రామాల ఆది వాసీ ప్రజలా? మూడు పూటలా తిండి కూడా దొరకని, వైద్యంలేక చచ్చే పేదలా? కొత్తగూడెం జిల్లాలోని ఆర్థిక సామాజిక స్థితి అధ్య యనం చేశారా?

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్‌డీవో, డీఎఫ్‌ఓ మెుదలగు జిల్లా ప్రధాన కార్యాలయాలకు పావు కిలోమీటరు దూరం కూడా ఉండదు. ఆ జిల్లా బస్టాండులో కనీసం తాగడానికి నీరే కాదు.. మూత్రశాలలు కంపు వాసనతో రోత పుట్టిస్తాయి. ఇటువంటి చోట కాసిన్ని నీళ్ళూ, నాలుగు ఫినాయిల్‌ బాటిళ్ళూ సప్లై చేయలేని అసమర్థ పాలకులు బంగారు తెలం గాణలో విమానాలు మీ కోసమేనని ప్రజలకు ఊదరగొడితే నమ్మే దెవరని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. (ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడేదెవరో స్పష్టంగా చెప్పాలంటే... జలగం వెంగళ రావు కుమారుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు). మన పాలకులు నిత్యం రాజ్యాంగాన్ని చట్టాలను వందల వేల లక్షలసార్లు ఉల్లంఘిస్తారు. కానీ పేదలు కడుపు మండి చావ లేక బతకడానికి ప్రతిఘటిస్తే మాత్రం చట్టాలు ప్రజలకు వ్యతి రేకంగా అమలవుతాయి. శాంతి భద్రతలు గుర్తుకొస్తాయి. లాఠీలు లేస్తాయి. తుపాకులు గర్జిస్తాయి.

ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ శ్రేణులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ప్రభుత్వ కుట్రలను అభి వృద్ధి పేరుతో కొనసాగుతున్న విధ్వంసాన్ని ప్రతిఘటించాలని కోరుతున్నాము. ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విమానాశ్రయాన్ని/సైనిక స్థావరాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆదివాసీ ప్రజల నుంచి నిర్బంధంగా భూములు ఆక్రమించుకోవడాన్ని ఆపివేయాలి. ఆదివాసీ చట్టా లను, రాజ్యాంగ రక్షణలను అమలు చేయాలని ప్రతి తెలంగాణ వాదీ, రాజకీయ పార్టీలూ నినదించాలనీ మనవి చేస్తున్నాము.
(కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు ఉదయం 10 గంటలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం సందర్భంగా...)


- నలమాస క్రిష్ణ

వ్యాసకర్త తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌ : 98499 96300

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement