కేసీఆర్‌కు అండగా నిలుద్దాం: తుమ్మల
గజ్వేల్ (మెదక్): ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో కమ్మ కులస్తులు కీలక పాత్రను పోషించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన నియోజకవర్గ కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి కేసీఆర్ తగు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.
ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్ చేస్తే చాలు స్పందించి అండగా నిలబడతానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల కమ్మ సంఘం కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, పరుచూరి రాజు, వెంకటేశ్వర్‌రావు, నల్లా భాస్కర్‌రావు, పాలేటి నర్సింహారావు, నల్లా శ్రీధర్, చేకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.