తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు రాగా, తాజాగా ‘బంగారు తెలంగాణ’ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. బిపిన్ , రమ్య జంటగా బిపిన్ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై డా. లయన్ ఏవీ స్వామి నిర్మించి, కీలక పాత్ర చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘1969లో వివేకవర్ధిని కళాశాలలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆమరణ నిరాహారదీక్షతో పాటు ఎంతో మంది ఉద్యమాలు చేయడంతో బంగారు తెలంగాణ సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే మా చిత్రం ఉంటుంది.
ఇందులో నేను లాయర్ పాత్ర చేశా. కేసీఆర్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘బంగారు తెలంగాణ’ పాటలు, మార్చి రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, కో–ప్రొడ్యూసర్: కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, సమర్పణ: రమ్య.