Bipin
-
దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో
పనజి: ఆయన పేరు బిపిన్ కదమ్. వయసు 40 ఏళ్లు. ఉండేది గోవాలో. పని చేసేది దినసరి కూలీగా. కదమ్‌కు ఓ 14 ఏళ్ల కూతురు. దివ్యాంగురాలు. చేతులు కదపలేదు. తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల క్రితం పూర్తిగా మంచాన పడింది. కదమ్ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. దాంతో కూతురికి వేళకు తిండి తినిపించేందుకు ఏకంగా ఓ రోబోనే తయారు చేసేశాడు కదమ్! ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఎవరి సాయమూ తీసుకోకుండా ఏడాది పాటు తదేకంగా శ్రమించాడు. ఆన్లైన్ సమాచారం ఆధారంగా చివరికి సాధించాడు. ఈ రోబో వాయిస్ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్ రైస్ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు కదమ్. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. కదమ్ ఘనతను గోవా ఇన్నొవేషన్ కౌన్సిల్ ఎంతో మెచ్చుకుంది. కమర్షియల్‌గా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా రోబోను మరింత మెరుగుపరచాలని సూచించింది. అందుకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదే మాదిరిగా నా కూతురు కూడా నాతోపాటు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా ఉండాలన్న తపనే నాతో ఈ పని చేయించింది’’ అంటున్నాడు కదమ్. -
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు రాగా, తాజాగా ‘బంగారు తెలంగాణ’ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. బిపిన్ , రమ్య జంటగా బిపిన్ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై డా. లయన్ ఏవీ స్వామి నిర్మించి, కీలక పాత్ర చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘1969లో వివేకవర్ధిని కళాశాలలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆమరణ నిరాహారదీక్షతో పాటు ఎంతో మంది ఉద్యమాలు చేయడంతో బంగారు తెలంగాణ సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే మా చిత్రం ఉంటుంది. ఇందులో నేను లాయర్ పాత్ర చేశా. కేసీఆర్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘బంగారు తెలంగాణ’ పాటలు, మార్చి రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, కో–ప్రొడ్యూసర్: కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, సమర్పణ: రమ్య.