బీజేపీతోనే బంగారు తెలంగాణ
కేసీఆర్ కుటుంబమే తప్ప.. ఎవరూ సంతోషంగా లేరు : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఇది రుజువవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే టీఆర్‌ఎస్ నేతలకు పూనకం వస్తుందని, నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ఇష్టం వచ్చిన హామీలివ్వడం, ప్రజలను విభజించడానికి రెచ్చగొట్టేలా మాట్లాడటం టీఆర్‌ఎస్ నేతలకు అలవాటు అని విమర్శించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబమే తప్ప.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేస్తున్నదని, సచివాలయాన్ని తెలంగాణభవన్‌గా మార్చిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక స్తోమత లేనివారు ప్రచారం చేసుకోవడానికి కూడా టీఆర్‌ఎస్ నేతలు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామనే ధైర్యంలేక మున్సిపల్ చట్టానికి సవరణలు చేస్తూ, టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని కిషన్‌రెడ్డి విమర్శించారు.
డ్రైపోర్టు, విశ్వవిద్యాలయాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, విద్యుత్‌ప్లాంట్లు, జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 41 వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ ప్రకటన చేయడం ద్వారా.. కేంద్రం లోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందనే విషయం రుజువవుతోందన్నారు.
ఈ నెల 7న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఉద్యానవన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ వస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు.