ప్రజలే మా బాసులు | TRS plenary to adopt 12 resolutions | Sakshi
Sakshi News home page

ప్రజలే మా బాసులు

Published Sat, Apr 25 2015 12:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

TRS plenary to adopt 12 resolutions

* మా మదిలో, గుండెల్లో వాళ్లే  
* టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం
* వారి కల నెరవేర్చేందుకే అహర్నిశలు శ్రమిస్తాం
* రాష్ర్ట ప్రజలకే నా జీవితం అంకితం

* బంగారు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తాం
* రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
* ఐకేపీ సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం
* నాలుగేళ్లలో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి
* వాటర్‌గ్రిడ్ పూర్తి కాకుంటే ఓట్లు అడగబోం
* మూడేళ్లలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
* వచ్చే నెలలో పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని వెల్లడి
* 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక

 
 టీఆర్‌ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం.    
 - సీఎం కేసీఆర్
 
 ‘టీఆర్‌ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం’ అని అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ర్ట ప్రజలకే తన జీవితం అంకితమని, బంగారు తెలంగాణ గమ్యం ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి.. ఆనాటి జల దృశ్యం నుంచి ఈనాటి జన దృశ్యం వరకు అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత టీఆర్‌ఎస్ కార్యకర్తలదేనని కొనియాడారు. ఎనిమిదోసారి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. కార్యసాధకులుగా నిలవాలని, బంగారు తెలంగాణ లక్ష్యాన్ని చేరే వరకు పోరాడాలంటూ పార్టీ కార్యకర్తలు, కళాకారుల్లో కొత్త ఉత్తేజం నింపారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...    
 - సాక్షి, హైదరాబాద్
 
 కల నెరవేరుస్తాం
 అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రాబోయే రెండేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ సోదరులు నిరాశకు గురవుతున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. నిరాశ పడకండి. త్వరలోనే మీ కలలు కూడా నెరవేరుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంద శాతం చేస్తాం. ఉద్యోగుల విభజన అయిపోయిన తెల్లారే ఆ ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. ఐకేపీ, డ్వాక్రా ఉద్యోగులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐకేపీ సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం. కేజీ టు పీజీని వచ్చే ఏడాది అమలు చేస్తాం.
 
 ప్రాణహితకు మార్పులు
 ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎత్తివేయట్లేదు. మార్పులు చేసుకుంటున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటాం. దిగువకు అవసరమున్న నీటిని ప్రాణహిత గోదావరిలో కలిశాక.. కాళేశ్వరం నుంచి తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మిడ్‌మానేరుకు అక్కణ్నుంచి నీరు తీసుకుంటాం. ఎవడు అడ్డమొస్తడో నేను చూస్తా. ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానని గతంలో చెప్పిన. రాబోయే నాలుగేళ్లలో ఇటు పాలమూరు.. అటు ప్రాణహిత ప్రాజెక్టులను నిజంగానే కుర్చీ వేసి కట్టించి తీరుతా. ఏడాదిన్నర వ్యవధిలో దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్‌ఎల్‌బీసీలను పూర్తి చేస్తాం.
 
 హామీ నెరవేర్చకుంటే ఓట్లు అడగం
 ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రాబోయే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని ఇవ్వకపోతే ఓట్లు అడగమని ఇప్పటికే చెప్పిన. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మనం పట్టుబట్టి తెలంగాణ తెచ్చినట్లుగా అపర భగీరథుల్లా ఈ పథకం చేపట్టాలి. పది జిల్లాల్లో దాదాపు 20 వేల చోట్ల రైల్వే లైన్లు, వాగులు, ఒర్రెలు, కెనాల్స్, హైవేలు, రోడ్లు దాటుతూ పైపులైన్లు వేయాలి. ఎక్కడ ఏం గ్రామంలో ఈ పని వచ్చినా కార్యకర్తలు శివంగి బిడ్డల్లా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ పనుల్లో పాలుపంచుకోవాలి. రోడ్లు, రహదారులకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్లు, బ్రిడ్జి పనులన్నీ కథానాయకులై ముందుకు తీసుకుపోవాలి. మెట్రో రైలు నిర్మాణం అశాస్త్రీయంగా ఉంది. అటు ఎయిర్‌పోర్టు, ఇటు ఇబ్రహీంపట్నం, రాంచంద్రాపురం వరకు పొడిగించాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంస విక్రయ మార్కెట్లు, శ్మశానవాటికలు, డంప్‌యార్డులను అభివృద్ధి చేస్తాం.
 
 యాదగిరి నర్సన్న పవర్ ప్లాంట్
 ప్రస్తుతం రాష్ర్టంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉంది. అదనంగా రూ. 91,500 కోట్ల నిధులు సమకూర్చుకున్నాం. రాబోయే మూడేళ్లలో 24 వేల మెగావాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. అసెంబ్లీలో నేనీ విషయం చెబితే.. ‘ఇదేం మాయా మశ్చీంద్రనా.. ఇదేమన్నా అద్భుతమా..’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో మీరు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వాళ్ల కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. నల్లగొండ జిల్లా దామరచర్లలో 6,600 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతాం.
ఈ ‘యాదగిరి నర్సన్న’ పవర్ ప్లాంట్‌కు పది రోజుల్లో శంకుస్థాపన చేస్తా. తెలంగాణకు కరెంటు పీడ పోయింది. ఇక కరెంటు కోతలుండవ్. ఇప్పుడు పంటలను ఎండకుండా కాపాడుకున్నాం. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. పువ్వు పుట్టంగనే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లా పని చేస్తుందో చెప్పడానికి కరెంటు సరఫరానే నిదర్శనం. పరిశ్రమలకు తగినన్ని భూములు, నీళ్లు ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానం ఉంది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలిరావాలి.
 
 ధర్మపురిలో మొక్కు తీరుస్తా
 తెలంగాణలో గోదావరి ఐదారు వందల కిలోమీటర్లు పారితే.. ఆంధ్రప్రదేశ్‌లో యాభై అరవై కిలోమీటర్లు పారుతుంది. కానీ గోదావరి అంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరమంటే విజయవాడ.. అన్నట్లుగా మారింది. మనం కూడా అక్కడికిపోయి గుండు కొట్టించుకొని స్నానం చేసి వచ్చేటోళ్లం. బాసర సరస్వతి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వరంలో మహాశివుడు, భద్రాద్రిలో రాముడు కొలువు దీరి ఉన్నాడు. ఒక్క పుణ్యక్షేత్రం లేని రాజమండ్రిలో ఎందుకు పుష్కరాలు పెడుతారని అప్పుడు అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలతో వాదించాను. అప్పుడు తెలంగాణ సమాజం మేలుకున్నది. అప్పటి పుష్కరాల్లో నేను ధర్మపురిలో మునిగిన. మళ్లీ పుష్కరంలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్లీ వస్తానని, ధర్మపురి నర్సన్నకు పాదాభిషేకం, పాలాభిషేకం చేస్తానని, తల్లీ గోదావరీ.. నీ ఒడిలో మునిగి.. నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తానని ఆ రోజే మొక్కుకున్నా. అందుకే ఈ పుష్కరాల్లోనూ ధర్మపురికే వెళ్తా. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం.
 
 సన్నబియ్యం ఆలోచన ఈటలదే
 గత ప్రభుత్వం రేషన్ బియ్యంపై రూ. 900 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. సీలింగ్ లేకుండా పేద కుటుంబాలకు కడుపు నిండా తిండి పెడుతున్నాం. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు. వాళ్లకెప్పుడు హాస్టళ్లలో సదివే పిల్లలకు సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన రాలేదు. ఈటల రాజేందర్, నేను సన్నగనే ఉంటాం. నేను స్వయంగా హాస్టళ్లనే సదువుకున్నా.. పిల్లలకు సన్న బియ్యం పెడుతామని ఈటల చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వమన్నా. కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినా.. నన్ను సముదాయించి ఇలా మంచి పనులు చేయించే బిడ్డలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. సన్న బియ్యం ఘనత ఈటలదే.
 
 గోల్కొండ కోటపై జెండా ఎగరేశాం
 ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగరేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చారిత్రక వైభవానికి చిహ్నమైన గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరేసినం. గత పాలకులకు ఆ సోయి లేదు. కొమురం భీం విగ్రహం ప్రతిష్ఠించేందుకు వెళితే కాంగ్రెస్ పాలనలో ఆ విగ్రహాలను పోలీస్ స్టేషన్లో పెట్టిన్రు. నేనే స్వయంగా వెళ్లి జోడెఘాట్‌లో కొమురం భీం విగ్రహం పెట్టా.  తెలంగాణ గడ్డ గర్వపడే బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పాలకులే గౌరవించలేదు. పీవీని గౌరవించేందుకు అధికారిక ఉత్సవాలు నిర్వహించాం.
 
 అన్ని వర్గాలకు అండాదండ!
 ఇక ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మరోసారి ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే భరోసా ఇస్తున్నా. ఈ వర్గం, ఆ వర్గం అని లేదు. అందరికీ అండదండగా ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలే అయ్యింది. కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చాం. ముందు ముందు అనేక కార్యక్రమాలు వస్తాయి’ అని స్పష్టంచేశారు. పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. లండన్, అమెరికాలోని పార్టీ శాఖల నిర్వాహకులకూ ధన్యవాదాలు చెప్పారు. ‘కార్మిక వర్గానికి అండగా ఉంటాం. సిర్పూర్ పేపర్ మిల్లును మూత పడనీయం. వరంగల్ జిల్లాలోని ఏపీ రేయాన్స్ మూతపడితే డిప్యూటీ సీఎం కడియం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తీసుకువచ్చి కొన్ని రాయితీలు అడిగారు. వెంటనే ఇచ్చాం. ఏ పరిశ్రమనూ మూతపడనీయం. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు.
 
 ఓ గేయం.. ఓ పద్యం.. నూతనోత్తేజం
 ప్లీనరీలో ప్రసంగం సందర్భంగా కేసీఆర్ ఉత్సాహంగా పాట పాడారు. మరో పద్యంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ‘ఎన్నో కలలు కని తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు నేనే ఒక పాట రాసిన.. మనందరం పాడుకున్నాం’ అంటూ తన ప్రసంగం చివర్లో ఆ గేయంలోని ఓ చరణం అందుకున్నారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలె.. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె.. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె’ అని కేసీఆర్ పాటెత్తుకున్నారు. అదే తీరుగా స్వర్ణయుగంవైపు.. బంగారు తెలంగాణ వైపు.. రాష్ట్రం అడుగులు వేస్తుందని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మరోసారి టీఆర్‌ఎస్ కార్యకర్తలను కార్యసాధకులుగా కొనియాడుతూ ఓ పద్యాన్ని వల్లెవేశారు. ‘కొందరిని మండలాల్లో బ్రిగేడియర్‌గా వేస్తే కాలినడకన వెళ్లారు. వెనుకటికో కవి రాశారు.. ఒకచో నేలను బవ్వళించు.. నొకచో నొప్పారు బూసెజ్జపై.. నొకచో శాఖములారగించు.. నొకచో నుత్కృష్టశాల్యోదనం.. అంటే కార్యసాధకులు.. నేల మీద పడుకున్నమా.. పరుపు మీద పడుకున్నమా.. అన్నం తిన్నమా.. గంజి తాగినమా.. అని ఆలోచించకుండా ముం దుకుసాగుతరు’ అని కేసీఆర్ ఉత్తేజపరిచారు.  
 
 ప్రతీ రైతుకు నష్ట పరిహారం
 ‘పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. మనసు చిన్న చేసుకోకండి. నష్టపోయిన ప్రతీ ఎకరాకు, ప్రతీ రైతుకు సాయం చేస్తాం. కలెక్టర్ల నుంచి నివేదికలు అందగానే సాయమందిస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు కొన్ని తీర్మానాలు చేశారని, భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించారని పేర్కొన్నారు. మరికొన్ని విషయాలు 27వ తేదీన జరిగే బహిరంగ సభలో చెప్పుకుందామన్నారు. ఆ సభకు పది లక్షల మంది తరలిరానున్నట్లు తెలిపారు.
 
 పేదల సంక్షేమమే ఎజెండా
 తెలంగాణ రాష్ట్రమే బలహీనవర్గాల రాష్ట్రం. వారి సంక్షేమానికే పెద్దపీట వేసినం. 34 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. రూ.480 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినం. ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించినం. రాష్ట్రంలో 32 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. 3.75 లక్షల మంది బీడీ కార్మికులు జీవన భృతి పొందుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వర్కర్ల వేతనాలను పెంచాం. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, కడుపు నిండా అన్నం, పౌష్టికాహారం అందిస్తున్నాం. కేంద్ర బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు 50 శాతం కోత పెట్టినా రూ.700 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. రూ.6,500 కోట్ల భారం పడ్డప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సోదరులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. ముస్లిం మైనారిటీలకు రూ.1033 కోట్లు పెట్టాం. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టులకు రూ.10 కోట్లు కేటాయించామని కేసీఆర్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement