భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు | Taxes are the entry for Huge budget | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు

Published Thu, Mar 12 2015 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు

భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు

భూతద్దంలో ‘బంగారు తెలంగాణ’
* రూ. 1.15 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
* తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈటెల
* ఆదాయ అంచనాలను భారీగా చూపిన సర్కారు
* పన్నుల మోత.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే మార్గాలు
* వ్యాట్ ద్వారా రూ. 11,116 కోట్ల అదనపు రాబడి అంచనా
* భూముల విక్రయం, క్రమబద్ధీకరణతో రూ. 13,500 కోట్లు
* అప్పులు, మద్యం అమ్మకాలు, కేంద్ర ప్యాకేజీపై ఆశలు
* ఊసే లేని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ

 
సాక్షి, హైదరాబాద్: మరోసారి లక్ష కోట్లకుపైగా బడ్జెట్. స్వేచ్ఛా రెక్కలు విచ్చుకున్న తెలంగాణ రాష్ర్ట ప్రజల ఆశలు, ఆకాంక్షలను పేర్చుతూ అప్పుల మూలాలు, రాబడుల స్తంభాలు, లక్ష్యాల మెట్లతో టీఆర్‌ఎస్ సర్కారు భారీ బడ్జెట్ కోటను నిర్మించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ. 1,15,689 కోట్లతో అసెంబ్లీ సాక్షిగా బుధవారం దీన్ని ఆవిష్కరించింది. సంక్షేమం, ఇతర ప్రతిష్టాత్మక పథకాలకు ఘనంగా నిధులు కేటాయించింది. నిరుటితో పోల్చితే ఆదాయ అంచనాలను అనూహ్యంగా పెంచేసింది. కేంద్ర ఆర్థిక సంఘం అంచనాల మేరకు ఖాతా పుస్తకంలో రూ. 531 కోట్ల మిగులును కూడా రాష్ర్ట ప్రభుత్వం చూపించింది. అయితే కేంద్ర, రాష్ర్ట పన్నులు పోను దాదాపు రూ. 22 వేల కోట్లను పన్నేతర ఆదాయంగా పేర్కొంది. పన్నుల ఆదాయాన్నీ భారీగా పెంచి చూపింది.
 
  ‘బడ్జెట్ కోట’ను బలోపేతం చేసుకోవాలంటే సర్కారు ముందున్న మార్గాలేమిటో ఆర్థిక మంత్రి ఈటెల చెప్పకనే చెప్పారు. ‘కొత్త రాష్ట్రంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చడానికి పన్నులు పెంచక తప్పదు. ప్రభుత్వానికి ఆదాయం గాలి నుంచి ఊడిపడదు’ అని మీడియాకు సెలవిచ్చారు. అంటే, ప్రజలపై పన్నుల మోత, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, అప్పులపై ఆధారపడే వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకోనుంది. కేంద్ర ప్యాకేజీపై కూడా ఆశలు పెట్టుకుంది. ఈ సవాళ్లను స్వీకరిస్తూనే ‘బంగారు తెలంగాణ’ బాటలో వడివడిగా అడుగులు వేయాలని చూస్తోంది. మొత్తానికి కేసీఆర్ సర్కారు తొలి బడ్జెట్‌లో వేసుకున్న రూట్‌మ్యాప్‌ను, అందులో కన్న కలలనే భూతద్దంలో చూసినట్లుగా ఈసారి కూడా అంచనాలు వేసుకుం ది. అయితే కేజీ టు పీజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, వంటి ఎన్నికల హామీలను మాత్రం ఈసారి పూర్తిగా పక్కనబెట్టింది.
 
 కోటలోకి ఎన్నెన్ని మార్గాలో..!
 రాష్ట్రంలో పన్నుల ద్వారా మొత్తం రూ. 46,494.75 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసింది. నిరుటితో పోల్చితే వ్యాట్ ద్వారా రూ. 11,116 కోట్ల అదనపు రాబడిని లక్షంగా పెట్టుకుంది. ఈ లెక్కన ప్రజలపై ప్రతి నెలా రూ. వెయ్యి కోట్లకుపైగా పన్నుల భారం మోపేందుకు సర్కారు ద్వారాలు తెరువనుంది. మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం రాబట్టుకునేందుకు  జనాన్ని మత్తులో ముంచే ఆలోచన చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, గనులు, ఖనిజాల ద్వారా భారీ ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. ఇసుక క్వారీలు, విక్రయాల ద్వారా రూ. 1500 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

దీంతో పాటు భూములు, ఆస్తుల అమ్మకం, క్రమబద్ధీకరణ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని సర్కారు ఆశపడుతోంది. గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ. 6,500 కోట్లు వస్తుందని అంచనా వేసుకుంది. కానీ క్రమబద్ధీకరణతో కేవలం రూ. వెయ్యి కోట్ల రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా రూ. 13,500 కోట్ల ఆదాయాన్ని అశిస్తోంది. దీంతో భూములు అమ్మకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి నిధులు తగ్గినందుకే 2014-15 ఆదాయ అంచనాల్లో రూ. 20,227 కోట్ల లోటు ఏర్పడిందన్న సర్కారు.. ఈసారి కూడా అదే ఊహల పల్లకీలో విహరించడం విచిత్రం. గతేడాది  కేంద్రం నుంచి రూ. 5,000 కోట్ల ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అదేమీ జరగలేదు. పైగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ర్టంగా 14వ ఆర్థిక సంఘం గుర్తించడంతో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.
 
 సంక్షేమానికి పెద్దపీట
 బడ్జెట్టు కేటాయింపుల్లో టీఆర్‌ఎస్ సర్కారు సంక్షేమ కోణాన్నే ఎంచుకుంది. నీటిపారుదల, వ్యవసాయం, విద్య, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆహార భద్రత, ఆసరా, కళ్యాణలక్ష్మి, రైతు రుణాల మాఫీ పథకాలకు సముచిత నిధులు కేటాయించింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాల పెంపు, బీడి కార్మికులకు పించన్లు ఈసారి బడ్జెట్‌లో కొత్త అంశాలు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పనను బడ్జెట్‌లో ప్రభుత్వం విస్మరించింది.
 
 పెరిగిన ప్రణాళికేతర వ్యయం
 రాష్ర్ట తొలి బడ్జెట్‌తో పోల్చితే ప్రణాళిక వ్యయంలో పెద్ద తేడా లేకున్నా.. ప్రణాళికేతర వ్యయాన్ని భారీగా పెరిగింది. ఈసారి ప్రణాళిక వ్యయం కింద రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.63,306 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. తొలి బడ్జెట్‌లో రూ.301.02 కోట్ల మిగులు చూపించిన ప్రభుత్వం.. ఈసారి అంతకంటే ఎక్కువే మిగులు చూపించింది. ఆర్థిక మిగులు రూ.531 కోట్లు ఉంటుందని.. ద్రవ్యలోటు రూ.16,969 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో ఈ ద్రవ్యలోటును 3.49 శాతంగా అంచనా వేసింది. అంటే ద్రవ్య పరిమితికి మించి అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉద్యోగుల జీతభత్యాల పెంపు వల్ల ఈ ఏడాది ప్రణాళికేతర వ్యయం గతంలో కంటే పెరిగిందని ఈటెల ప్రకటించారు.
 
 కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గినప్పటికీ అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని పొందుపరిచినట్లు చెప్పారు. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రాబడుల్లో వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. కానీ తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అందుకే ప్రణాళిక వ్యయం పెంచడానికి రాష్ర్టం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడి రూ. 12,823 కోట్లు మాత్రమే. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని భారీగా తగ్గించింది. దీంతో గత ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రణాళిక నిధులు రూ. 11,781 కోట్లతో పోల్చితే.. ఈసారి రూ. 6,497 కోట్లు మాత్రమే వస్తాయని అంచనా. అయినా రాష్ర్ట ప్రణాళిక వ్యయాన్ని అధికంగానే ప్రతిపాదించాం’ అని ఈటెల పేర్కొనడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement