
ఫిరాయింపుదారులతోనే బంగారు తెలంగాణా?
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన వారితోనే బంగారు తెలంగాణను నిర్మిస్తారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరుపై.. బీజేపీ శాసనసభాపక్ష నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వీ.ఎస్.ఎస్.ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు తదితరులతో కలిసి బుధవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమంతా చూస్తున్నదని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్.. నియంతృత్వం, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సీఎం స్వయంగా, అధికారికంగా పాల్గొంటున్నా ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఉండటం లేదన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదనేలా, అణిచివేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే నిధులు, పనులు, అభివృద్ధి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ ఒక్కటే పోరాడిందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజల్లో ఓడిపోయినవారు, ప్రజలు ఛీకొట్టినవారే మంత్రులవుతున్నారని, వారికి ప్రొటోకాల్‌తోపాటు, ప్రజల సొమ్ముతో వారు విలాసాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఆ నియోజకవర్గంలో ఇళ్లు మంజూరుచేశారే తప్ప.. రాష్ట్రంలో మిగతాచోట్ల ఇవ్వలేదన్నారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గర సచివాలయం నిర్మిస్తామని చెప్పి.. ఇప్పుడేమో సికింద్రాబాద్‌లో సచివాలయం అంటూ రోజుకో కొత్త మాటతో ప్రజలను మోసం చేస్తున్నాడని కిషన్‌రెడ్డి విమర్శించారు.