
బంగారు తెలంగాణే బడ్జెట్ లక్ష్యం
అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల వివరణ
బడ్జెట్‌పై చర్చలో విపక్షాల విమర్శలకు సమాధానం
* భారీ కసరత్తు తర్వాతే సమగ్ర బడ్జెట్‌ను రూపొందించాం
* పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుతాం
* ఇక తెలంగాణలో ఆకలి పాటలకు కాలం చెల్లినట్టే
* ప్రతి అర్హుడికీ ఆహారభద్రత కార్డు అందే వరకూ నిద్రపోం
* తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రాభివృద్ధిలో ప్రదర్శిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘నిన్నటి వరకు ఆకలి పాటలు పాడుకున్నం. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో వాటిని ఊరూరా వినిపించినం, ఇక ఆ పరిస్థితులు ఉండయ్. ఆకలి పాటలకు కాలంజెల్లింది. ఇకముందు కడుపులు నింపే పాటలే. మన తెలంగాణ కోసం ఎంత తీవ్రమైన ఉద్యమం చేసినమో.. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అంతే స్ఫూర్తితో ముందుకు సాగుతం. అందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. లక్ష కోట్లకుపైగా బడ్జెట్‌ను రూపొందించే క్రమంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశామని చెప్పారు.
కొన్ని విషయాల్లో అధికారులు నిబంధనలను ఉటంకించినప్పుడు.. కావాలంటే వంద సార్లు చర్చిద్దాం, పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారని తెలిపారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలకు శుక్రవారం అసెంబ్లీలో ఈటెల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివరాలను సభ ముందుంచి విశదీకరించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూనే అడుగడుగునా గత ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు..
ఆహార భద్రత కార్డుల జారీపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించిన క్రమంలో సభలో ఆర్థికమంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ర్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేవరకు తమ ప్రభుత్వం నిద్రపోదన్నారు. అయితే గతంలో ‘సర్వరోగ నివారణి’ తరహాలో తెల్ల రేషన్ కార్డును అన్నింటికీ ఉపయోగించే పద్ధతి ఉండేదని, ఇకపై మూస పద్ధతిలో ఉండరాదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇక పింఛన్ల కోసం భారీ స్థాయిలో రూ. 4 వేల కోట్లు కేటాయించిన ఘనత తమదేనన్నారు. కుటుంబంలో ఎంతమంది వికలాంగులున్నా అందరికీ పింఛన్ అందుతుందని, వికలాంగులను గుర్తించేందుకు అవసరమైతే సదరం క్యాంపులను విస్తృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన చెరువుల వ్యవస్థ గతంలో దెబ్బతిన్నదని, ఇప్పుడు కాకతీయుల స్ఫూర్తితో వాటిని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడత 9 వేల చెరువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన జలయజ్ఞంలోని కీలక ప్రాజెక్టులను కొలిక్కి తెచ్చేలా ఈ బడ్జెట్‌లో రూ. 6500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లున్నా కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రాలో ఏర్పాటు చేసిన నాటి పాలకుల వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలొచ్చాయని, దీన్ని అధిగమించేందుకు రామగుండం ఎన్టీపీసీతోపాటు ఇతర విద్యుత్ కేంద్రాలను విస్తరిస్తున్నట్టు తెలిపారు.
అలాగే ఉత్పత్తి వ్యయం తగ్గేలా ప్లాంట్లను ఆధునీకరిస్తామన్నారు. ఇక హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ‘ఐటీ, ఫార్మా, సినిమా సిటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ వెలుగొందుతుంది. విభజనకు ముందు విశాఖపట్నం తరలించుకుపోయిన ఫార్మాసిటీ.. ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నామని ఫార్మా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి’ అని ఈటెల పేర్కొన్నారు.
మండలిలోనూ సుదీర్ఘ సమాధానం
శాసనమండలిలోనూ బడ్జెట్‌పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి దాదాపు గంటన్నరపాటు సమాధానమిచ్చారు. నవ్వేవారి ముందు జారిపడొద్దన్న లక్ష్యం తో భారీ కసరత్తు చేసి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించామన్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద దాదాపు సమాన స్థాయిలో వ్యయం చూపడం అభివృద్ధికి సూచిక అని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రూ. 27 వేల కోట్లను అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ రూ. ఐదు వేల కోట్ల రుణాలకే పరిమితమయ్యామని చెప్పారు. బడ్జెట్‌లో పద్దులను ఆయన మరోసారి చదివి విని పించారు.
ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాత నిరుద్యోగుల ఆకాంక్షలు ఫలించేలా త్వరలో సర్వీసు కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే నాటికే రాష్ట్రం బంగారు తెలంగాణగా ఉందని ఈ రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని మండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్ అన్నారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ అమలుపై సందేహం వ్యక్తం చేశారు.
ఆ పత్రికలు, చానళ్లను నమ్మొద్దు
తెలంగాణపై విషం చిమ్మే కొన్ని పత్రికల రాతలు, కొన్ని చానళ్ల మాటలను నమ్మొద్దని ఆర్థిక మంత్రి సభను కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసిన ఆ పత్రికలు, చానళ్లు ఇప్పుడు తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఆవిర్భావం అసాధ్యం అని ఊదరగొట్టారు. మా ఉద్యమాన్ని ఉద్దేశించి.. తమ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో అంతరిస్తుందన్నరు. కానీ మేం తెలంగాణ తెచ్చి చూపెట్టినం. ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా మా పనితీరును విమర్శిస్తూనే ఉన్నాయి. వాటిని నమ్మి అపోహలకు గురికావద్దని సభ్యులను కోరుతున్నా’ అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మా.. కాదు.. మన ముఖ్యమంత్రి
బడ్జెట్‌పై విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానాలు చెప్పిన ఈటెల ఓ విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాట్లాడిన ప్రతీసారి ‘మా ముఖ్యమంత్రి ఇలా’.. అంటూ పేర్కొనడాన్ని సమావేశాలు మొదలైనప్పటి నుంచే కాంగ్రెస్ సభ్యులు ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. ఈటెల ‘మా ముఖ్యమంత్రి’ అన్నప్పుడల్లా రాష్ట్రమంతటికీ ఒకరే ముఖ్యమంత్రిగా ఉంటారని, ‘మన ముఖ్యమంత్రి’ అనాలంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ‘మా ముఖ్యమంత్రి’ అనడాన్ని దాదాపు ఊతపదంలా మార్చుకున్న ఈటెల శుక్రవారం నాటి సుదీర్ఘ ప్రసంగంలో దాన్ని సరిదిద్దుకోడానికి ఇబ్బందిపడ్డారు. ‘మా ముఖ్యమంత్రి’ అని అన్న వెంటనే ‘మనముఖ్యమంత్రి’ అని అనాల్సి వచ్చింది.