కార్యకర్తలకు పదవుల హారం
సాక్షి, హైదరాబాద్: ‘ఈసారన్నా నన్ను విముక్తి చేస్తారేమో అనుకుంటే.. ప్రభుత్వం వచ్చినంక విడిచిపెడుతమన్నరు. మళ్లీ ఈసారి కూడా నన్నే పెట్టిండ్రు. మంచిది, సంతోషం. అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలే. అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. అనేక త్యాగాలు, నిర్బంధాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలతో తెలంగాణ సాకారమైంది. ఈ ఘనత అంతా టీఆర్‌ఎస్ కార్యకర్తలదే. ఇది చరిత్రలో సుస్థిరం. కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులు అంతా మీరే’ అని కేసీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలో సుదీర్ఘ ప్రసంగంలో ముందుగా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ అమరుల త్యాగాలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘సాంస్కృతిక సారథి వేదికపై రసమయి బాలకిషన్ ఏడ్చిండు. కళ్ల నీళ్లు పెట్టుకున్నాం. 14 ఏళ్ల జ్ఞాపకాలు రీలుగా గిర్రున తిరిగాయి.
గులాబీ కండువాలు వేసుకొని వెళితే ఎన్నో అపహాస్యాలు... ఎక్కడా మడమ తిప్పలే. నేను చిన్నబోతే ‘నాయిని’ వచ్చి మేమున్నామని ఉత్సాహ పరిచేవాడు. మనం జెండా కింద పెడితే జన్మలో తెలంగాణ రాదని నా వెంట ఉన్న అక్కాచెల్లెళ్లు వెన్నుతట్టారు. శ్రీకాంతాచారి, స్వర్ణ, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్, యాదగిరిరెడ్డి వంటి ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటాం.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే రెండుమూడు నెలల్లో మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతామని, అందరికీ పదవులు వస్తాయని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ‘మీరు చేసిన సభ్యత్వం చూసి గర్వ పడుతున్నా. ఊహించని విధంగా 50 లక్షల మంది పార్టీలో చేరారు. రూ.10 కోట్ల సభ్యత్వ రుసుం వచ్చింది. రూ. 4.50 కోట్లు కార్యకర్తల పేరిట బీమా ప్రీమియం చెల్లించినం. ఎవరికి ఎప్పుడు ప్రమాదం వచ్చినా రూ.2 లక్షల ఆర్థికసాయం అందుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు.