జనపదం..భూమేశ్‌ గళం | kothapalli bhumesh songs cd release with bhajireddy goverdan | Sakshi
Sakshi News home page

జనపదం..భూమేశ్‌ గళం

Published Mon, Nov 27 2017 1:05 PM | Last Updated on Mon, Nov 27 2017 1:05 PM

kothapalli bhumesh songs cd release with bhajireddy goverdan - Sakshi

ఆయన పాట పల్లె ప్రజానీకాన్ని తట్టిలేపుతుంది.. వారిలో స్ఫూర్తి నింపుతుంది.. జనపదమే గళంగా పాటలు రాస్తూ, పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాడు జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌కు చెందిన కొత్తపల్లి భూమేశ్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తన పాటల ద్వారా ఆంధ్ర పాలకులు మనకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు. అలాగే ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘ఇది మన తెలంగాణ’ పేరుతో పాటలు రాశారు. ఇలా జనపదాన్నే తన గళంగా మార్చుకుని అందరి మన్ననలు పొందుతున్నారు.

జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): కొత్తపల్లి భూమేశ్‌కు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి, అదే అందరిలో అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. అతని పాటంటే చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మిక్కిలి ప్రీతి. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ ఎందరో ప్రముఖుల మెప్పు పొందారు. తెలంగాణ సాధనోద్యమంలో ధూంధాం వేదికగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేశారు. తెలంగాణ ఉద్య మంలో తనవంతు కృషి చేస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్రను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘బంగారు తెలంగాణ’ కోసం పాటలు రాస్తూ స్వీయ ప్రదర్శనలు ఇస్తున్నారు.

జన పదమే తన పాటగా..
జానపద గాయకుడు భూమేశ్‌ పల్లెటూరిలో పుట్టడంతో పాడి పంటల మధ్య ఆయన జీవనం సాగింది. రైతుల కన్నీరు చూసిన ఆయన భావం పాటగా మారింది. ఇలా ప్రజా సమస్యలపై జానపద పాటలు రాయడం మొదలుపెట్టాడు. 1997–98 సంవత్సరం నుంచి జానపద పాటలు పాడటం ప్రారంభించాడు. అప్పుడే ప్రస్తుత మనోహరాబాద్‌ సర్పంచ్‌ పాట్కురి తిరుపతిరెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం వైపు తొలి అడుగులు వేశాడు. గద్దర్‌ పాటలకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. అక్కడ ప్రముఖ కళాకారుడు రాజానర్సింహ, బెల్లి లలితతో కలిసి బృందంలో సభ్యుడిగా పాటలు పాడారు.

ధూంధాంతో దుమ్మురేపారు..
తెలంగాణ సాధనలో భాగంగా రసమయి బాల్‌కిషన్‌ ఏర్పాటు చేసిన ‘ధూంధాం’లో తన పాటల ద్వారా జనల్లో చైతన్యం తీసుకువచ్చారు. ధూంధాం జక్రాన్‌పల్లి మండలాధ్యక్షుడిగా ఉంటూ అనేక స్టేజ్‌ షోలు ఇచ్చారు. ఆంధ్ర పాలకుల దోపిడి, మన సంస్కృతి, సాంప్రదాయాలపై పాటలు పాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోని కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడకలో తెలంగాణ ఆవశ్యకతను పాటల రూపంలో వివరించారు.

ఊరూరా ప్రజా చైతన్య యాత్రలు
జిల్లాలో ఊరూరా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కావద్దంటూ, ఆర్మూర్‌ ప్రాంతంలోని రైతులకు ఎర్ర జొన్న బకాయిలు, పసుపు పంటకు గిట్టుబాగు ధర ఇవ్వాలని తన ప్రదర్శనలు పాటల ద్వారా డిమాండ్‌ చేశారు. తదితర పోరాటాల సభలలో జానపద గాయకుడిగా ఎలుగెత్తి చాటారు. నల్గొండ జిల్లాలో కొత్తపల్లి భూమేశ్‌ ఆధ్వర్యంలో 80 మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు.

స్వీయ రచనలో సీడీ ఆవిష్కరణ
స్వయంగా తాను రాసిన పాటలతో ‘ఇది ఇది మన తెలంగాణ’ అనే పేరుతో సీడీని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇది ఇది మన తెలంగాణ, అమ్మమ్మో కేసీఆర్,  మన ఊరు మన చెరువు, పించినోచ్చనమ్మ పించినోచ్చన మ్మ, చేయి చేయి కలిపితే, పంపిద్దాము మనము పంపిద్దాము, తన స్వీయ రచనలో ఆరు పాటలు పాడి సీడీలను విడుదల చేశారు. ఇప్పటి వరకు 50కి పైగా పాటలు రాశారు. సామాజిక చైతన్యం, అభ్యుదయ భావాలతో కూడిన పాటలు రాస్తూ ప్రజలను చైతన్య వంతం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ముఖ్యమైన కొన్ని పాటలు
ఇంకుడు గుంతల ఏర్పాటు, మిషన్‌కాకతీయ, హరితహారం, స్వచ్ఛభారత్, అవయవ దానం, భారత సైనికుల త్యాగం, ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత, తెలంగాణ అమరవీరులు, సీఎం కేసీఆర్‌ పరిపాలన గురించి పాటలు రాశారు. పది నిమిషాల్లో పాటలు రచించడంలో భూమేశ్‌ దిట్ట. ఏదేని అంశం చెబితే చాలు దానికి సంబంధించిన పాటను సిద్ధం చేస్తారు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటలు పాడిన కొత్తపల్లి భూమేశ్‌ను సీఎం కేసీఆర్, రసమయి బాల్‌కిషన్, ఎమ్మెల్యే గోవర్ధన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఎంపీ కవితలు ప్రశంసించారు.

బంగారు తెలంగాణ కోసం పాటల అల్బమ్‌ చేస్తా
బంగారు తెలంగాణ వైపు అడుగులు అంటూ జానపద గేయాలతో ఒక అల్బమ్‌ను పూర్తి చేస్తా. జానపద గాయకుడిగా పాటలు పాడుతూ తెలంగాణోద్యమంలోనే ఎక్కువ సమయం కేటాయించాను. ప్రస్తుతం బంగారు తెలంగాణలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తన పాటలతో వినిపిస్తాను. జాన పదంతో మంచి గాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందడానికి అహర్నిషలు శ్రమిస్తాను.    
– కొత్తపల్లి భూమేశ్, రచయిత, గాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement