చెన్నూర్/కోటపల్లి : బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ మాయమాటలు విని కారు గుర్తుకు ఓటేస్తే కష్టాలు తీసుకొచ్చారని, ప్రజలు ఓటు వేసి గెలిపించిన కారు ప్రజలపై సవారీ చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా, రైతు ఆత్మహత్యలకు నిరసనగా చేపట్టిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రోజుకో నిబంధన పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. కరెంటు కోతలతో రైతులు పంటలు ఎండి తీవ్రంగా అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం తామంతా కృషి చేశామని చెప్పారు. ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీల ధైర్యంతోనే కేసీఆర్ ముందడుగు వేశారని.. ఏనాడూ స్వయంగా పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ప్రజల బతుకులను బాగు చేసేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు.
కరెంటు లేకుంటే పరిశ్రమలెలా వస్తాయి..
తెలంగాణలో కరెంటు లేకుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కేసీఆర్ తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఛత్తీస్‌ఘడ్ నుంచి రెండున్నర నెలల్లో కరెంటు తెస్తామని చెప్పిన వీడియో దృశ్యాలను ఈ సందర్బంగా ప్రజలకు చూపించారు.
ప్రస్తుతం మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రోజుకో మాట మాట్లాడ్డం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు. జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల డెంగీ జ్వరంతో ఎమ్మెల్యే మనమరాలు మృతి చెందినా.. జిల్లాలో డెంగీ మరణాలు లేవనడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలంగాణ ఇప్పటివరకు రైతులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని, పదవీకాంక్షతోనే ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం కోసం ఊహకందని హామీలు ఇచ్చిందని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని మాజీ ఎంపీ బలరాం నాయక్ ఆరోపించారు. కేట్లు, డూప్లికేట్లు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా పాలకులు ఇసుక రిచ్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తాని హామీ ఇచ్చారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ముక్కుపోగులు, మూడు తులాల బంగారం ఇస్తామని కేసీఆర్ మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీని అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కారుకు ఓటేసి కష్టాల పాలు..
Published Wed, Nov 12 2014 3:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement