బోధన వైద్యులకు ‘నిర్ణీతకాల పదోన్నతులు’ | Doctors Will Get Promotions For a fixed Period of Time | Sakshi
Sakshi News home page

బోధన వైద్యులకు ‘నిర్ణీతకాల పదోన్నతులు’

Published Sun, May 5 2019 2:47 AM | Last Updated on Sun, May 5 2019 2:47 AM

Doctors Will Get Promotions For a fixed Period of Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. పైరవీలకు ఆస్కారం లేకుండా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల వ్యవధిలో పదోన్నతులు లభించనున్నాయి. 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయానికి వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. సీఎం ఆమోదం అనంతరం తగిన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

ముఖ్యమంత్రి వద్దకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్‌ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్‌లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.

3 వేలమంది వైద్యులకు ప్రయోజనం...
ప్రస్తుతం పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరై ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. మరికొందరికి పదోన్నతులు లభించడంలేదు. దీంతో పదోన్నతులు అనేది ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం పైరవీలు జరుగుతుంటాయి. పైరవీల సందర్భంగా లక్షలకు లక్షలు సమర్పించుకోవాల్సిన సందర్భాలూ ఉన్నాయని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు.

మరికొందరికైతే 20 ఏళ్లకుగాని పదోన్నతి లభించే పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. సీఎంకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వెద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి కూడా వేతనాల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్య మధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి.

ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీతకాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. వీలైనంత త్వరగా సీఎం ఆమోదం వస్తుంద ని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement