సాక్షి, హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద గర్భిణుల కష్టాలు తీరనున్నాయి. కడుపులో బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలంటే ఇన్నాళ్లూ పరీక్షల కోసం ఎంతో దూరంప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇక ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో)నే అల్ట్రా సౌండ్ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి పీహెచ్‌సీలో అల్ట్రాసౌండ్ పరీక్షలు అందుబాటులోకి తెస్తూ.. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు లింగనిర్ధారణ పరీక్షల నిషేధం అమలు చేస్తూ గర్భిణులు, గర్భస్థ శిశువుల ఆరోగ్య పరిరక్షణలో అనుసరించే విధివిధానాలను కూడా ఖరారు చేశారు.
ఇదీ గ్రామీణ నేపథ్యం...
ఎక్కువ మంది గ్రామీణ, పేద మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే వస్తుంటారు. రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల కాన్పులు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలోనే 4.50 లక్షల కాన్పులు నమోదవుతున్నాయి. గర్భిణులు, గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా తెలుకోవడంలో అల్ట్రాసౌండ్ పరీక్షలు కీలకంగా ఉంటాయి. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారే వైద్యులుగా ఉంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు ఈ పరీక్షలను చేసేందుకు అనుమతి లేదు. దీని వల్ల గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితులు కాన్పు తర్వాత గానీ తెలియడంలేదు. తల్లీ, బిడ్డ అనారోగ్యాలకు ఈ పరిస్థితులు ఎక్కువగా కారణమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం వెయ్యి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అల్ట్రాసౌండ్ పరీక్షల పరికరాలు ఉన్నా అక్కడ పని చేసే వారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వైద్యులే ఉండటంతో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ఈ పరిస్థితి మారనుంది.
ఎంబీబీఎస్ వైద్యులకు 6 నెలల శిక్షణ
కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలు మార్చింది. రాష్ట్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పని చేసే ఎంబీబీఎస్ వైద్యులు సైతం అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయవచ్చని పేర్కొంది. దీని కోసం ఎంబీబీఎస్ వైద్యులకు ప్రత్యేకంగా ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శిక్షణ పూర్తయిన వైద్యులు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయవచ్చని పేర్కొన్నారు.
ప్రత్యేక కమిటీ...
గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించే విషయంలో నిత్య పర్యవేక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో పది మందితో ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ గరిష్టంగా మూడు నెలలకు ఒకసారి సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే అవసరమైన సందర్భాల్లోనూ కమిటీ భేటీ కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment