సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల ఫీజులను సవరించారు. కొన్ని కాలేజీల్లో పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయి. మరికొన్ని కాలేజీల్లో యథాతథంగా ఉన్నాయి. ఫీజుల సవరణకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అనుమతించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
2023–26 మధ్య చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఇదే రుసుము కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజులు కొన్ని కాలేజీల్లో రూ. 50 వేలు పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయని వివరించారు. ఉదాహరణకు అపోలో మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ ఎంబీబీఎస్‌కు గతంలో రూ. 12.50 లక్షలున్న ఫీజును ఈ ఏడాది నుంచి రూ. 13 లక్షలకు పెంచారు. అయాన్ మెడికల్ కాలేజీలో గతంలో రూ. 14 లక్షలున్న బీ–కేటగిరీ ఫీజును ఇప్పుడు రూ. 12 లక్షలకు తగ్గించారు.
సీ–కేటగిరీ ఫీజులను బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు చేశారు. అంటే బీ–కేటిగిరీ ఫీజు రూ. 12 లక్షలున్న కాలేజీలో సీ–కేటగిరీ ఫీజు రూ. 24 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. మొత్తంగా సరాసరి 5 శాతం ఫీజులు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. స్వల్పంగానే ఫీజులు పెరిగాయని.. కొన్నిచోట్ల తగ్గాయని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో మెడికల్ కాలేజీలో ఒక్కో ఫీజు...
రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతం సీట్లు బీ–కేటగిరీ, 15 శాతం సీ–కేటగిరీ సీట్లుంటాయి. వాటిని మేనేజ్‌మెంట్ కేటగిరీ సీట్లుగా పరిగణిస్తారు.
మిగిలిన 50 శాతం సీట్లు ఏ–కేటగిరీ (కన్వినర్) కిందకు వస్తాయి. కాలేజీలవారీగా నిర్వహణ ఖర్చు లు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర వివరాలతో కూడిన ఆడిట్ రిపోర్టులను పరిశీలించిన టీఏఎఫ్‌ఆర్‌సీ... వాటి ఆధారంగానే ఫీజుల సవరణకు సిఫార్సు చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్ల ఏ–కేటగిరీ ఫీజు రూ. 60 వేలు ఉండగా అందులో ఎలాంటి మార్పు చేయలేదు.
అదనపు వసూళ్లు చేయరాదు...
కాలేజీలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థుల నుంచి ఎటువంటి క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదని కాళోజీ వర్గాలు స్పష్టం చేశాయి. కమిటీ నిర్ణయించిన రుసుము మినహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఇతర మొత్తాన్ని యాజమాన్యం అనధికారికంగా లేదా చట్టవిరుద్ధంగా వసూలు చేయకూడదని పేర్కొన్నాయి. ఒకవేళ విరా ళం ముసుగులో వసూలు చేసినట్లయితే దాన్ని క్యాపిటేషన్ రుసుముగా పరిగణించనున్నాయి.
అయితే తదుపరి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కోసం కాలేజీలు బ్యాంక్ గ్యారెంటీని విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని స్పష్టం చేశాయి. దీనిపై గతం నుంచే విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈ నిబంధనను ఇంకా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులను పెంచలేదని కాళోజీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment