ప్రైవేటు ఆస్పత్రులకు కలర్ కోడెడ్ బోర్డులు.. నకిలీ ప్రైవేటు డాక్టర్లకు చెక్ పెట్టడమే లక్ష్యం
రాష్ట్రంలోనూ అమలు చేయాలంటున్న తెలంగాణ వైద్యులు..
కర్ణాటకలో అమలు చేస్తున్న విధానంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు.
ప్రజలకు సులభంగా కన్పించాలి
కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి.
ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది.
పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment