శనివారం కిడ్నాప్ వార్తలను టీవీలో చూస్తున్న బలరాం కుటుంబసభ్యులు
రెండు రోజులైనా తెలియని ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు.
విడుదలకు కృషి చేస్తున్నాం: వెంకయ్య
నాచారంలోని గోపీకృష్ణ కుటుంబసభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్‌లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారు క్షేమంగానే తిరిగొస్తారన్న నమ్మకముందని భరోసా ఇచ్చారు. కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి క్షేమంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాని, లిబియాలోని సిర్త్‌యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి సమాచారం రావడం లేదని బలరాం కుటుంబసభ్యులు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే తమకు సమాచారం తెలుస్తోందని వాపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
వారినీ కాపాడండి: సుష్మాకు దత్తన్న ఫోన్
సాక్షి, హైదరాబాద్: ఉగ్రసంస్థ ఐఎస్‌ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పటికే ఇద్దరిని కాపాడిన తీరు అభినందనీయమని, మిగిలిన ఇద్దరినీ కాపాడాలని దత్తాత్రేయ శనివారం ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. సుష్మ సానుకూలంగా స్పందించారని, బందీలుగా ఉన్నవారు క్షేమంగా విడుదల అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బలరాం, గోపీకృష్ణ విడుదలయ్యేలా చూడండి
* కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
లిబియాలో కిడ్నాప్‌నకు గురైన రాష్ట్రానికి చెందిన బలరాం విడుదల విషయంలో చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖరాశారు. లిబియా కిడ్నాప్ ఉదంతంపై సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు సైతం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బలరాంతో పాటు ఏపీకి చెందిన గోపీకృష్ణ సైతం క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు.