గోపికృష్ణ కిడ్నాపై 100 రోజులు..
హైదరాబాద్: లిబియాలో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ అపహరణకు గురై 100 రోజులు అవుతున్నా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నగరంలోని నాచారం ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నాప్‌కు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సమాచారం లేదని గోపీకృష్ణ భార్య కళ్యాణి సోమవారం మీడియా ముందు ఆవేదన చెందారు. మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు.
గోపీకృష్ణ మీద మూడు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ కుటుంబాలు గత మూడు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నట్లు సోదరుడు మురళి కృష్ణ చెప్పారు. అపహరణకు గురైన వారిని విడిపిస్తామని ప్రధాని నరెంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ విడుదలలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తమ్ముడు గోపికృష్ణ విడుదలకు కృషి చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కూడా మరోసారి కలుస్తామన్నారు.