బాంబుల వర్షం.. 40 మంది ఉగ్రవాదులు హతం
ట్రిపోలి: లిబియాలో వైమానిక దాడులు తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం గుర్తుతెలియని ఓ యుద్ధ విమానం గగనతలం నుంచి జరిపిన బాంబు దాడుల్లో సుమారు 40 మంది ఇస్లామిక్ మిలిటెంట్లు హతమై ఉంటారని లిబియా అధికారులు భావిస్తున్నారు. లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సబ్రతా అనే ప్రాంతంలో ఓ ఇంట్లో సమావేశమయ్యారు.
ట్యూనీషియా సరిహద్దులో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానం బాంబులతో దాడిచేయగా 40 మందికి పైగా తిరుగుబాటుదారులు మృతిచెందారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు సమావేశమైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ట్రిపోలికి సరిహద్దుగా ఉన్న ట్యూనీషియా సమీపంలో ఈ దాడులు జరిగాయని హుస్సేన్ అల్ దవాదీ అనే అధికారి వెల్లడించారు. ట్యూనీషియాలో గతేడాది జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని అమెరికా మీడియాకు అక్కడి అధికారులు వెల్లడించినట్లు సమాచారం.